పిడికిలి బిగించి రంగంలోకి దిగుతున్న సుందరం

Tue May 24 2022 17:01:20 GMT+0530 (India Standard Time)

Natural star nani on ante sundaraniki

నాని హీరోగా రూపొంది కొన్ని నెలల క్రితం వచ్చిన శ్యామ్ సింగ రాయ్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే. ఆ సినిమాలో నాని ద్విపాత్రాభినయం చేశాడు. చాలా విభిన్నమైన లుక్ లో నాని కనిపించి ప్రతి ఒక్కరిని కూడా మెప్పించిన విషయం తెల్సిందే. నాని శ్యామ్ సింగ రాయ్ తర్వాత సినిమా కోసం అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా అంటే సుందరానికి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్దం అయ్యాడు.మరో రెండు వారాల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న అంటే సుందరానికి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేస్తున్నట్లుగా నాని నుండి ప్రకటన వచ్చింది. గత వారం పది రోజులుగా నాని అంటే సుందరానికి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేయలేదు.. సినిమా ఏమైనా వాయిదా పడే అవకాశం ఉందా అంటూ కొందరు చెవులు కొరుక్కున్నారు. వారికి సమాధానం అన్నట్లుగా నాని ఒక ట్వీట్ చేశాడు.

షో ప్రారంభిద్దాం అంటూ నాని పిడికిలి బిగించిన ఫోటోను షేర్ చేశాడు. అంటే మనం రెడీ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా నాని షేర్ చేశాడు. విభిన్నమైన చిత్రాలతో కెరీర్ లో ఇప్పటికే ఎన్నో సక్సెస్ లను దక్కించుకున్న నాని ఈ సినిమా తో కొత్త తరహా ఎంటర్ టైన్మెంట్ ను ఈయన ఇచ్చే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఒక పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా అంటే సుందరానికి ఉండబోతుంది.

అంటే సుందరానికి సినిమా లో నానికి జోడీగా నజ్రియా ఫహద్ హీరోయిన్ గా నటించిన విషయం తెల్సిందే. తెలుగు లో నజ్రియాకు ఇదే మొదటి సినిమా అయినా కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ఆమె డబ్బింగ్ సినిమాలు మరియు ఆమె సోషల్ మీడియా పోస్ట్ ల కారణంగా నజ్రియా తెలుగు వారికి చాలా కాలంగా దగ్గరే ఉన్నట్లుగా ఉంది. అందుకే ఈ సినిమాలో నటిస్తున్నప్పుడు కొత్త హీరోయిన్ పీల్ లేదు.

నాని ఈ సినిమాలో ఒక బ్రాహ్మణ కుటుంబంలో కుర్రాడిగా కనిపించబోతున్నాడు. ఇక హీరోయిన్ నజ్రియా క్రిస్టియన్ అమ్మాయిగా కనిపిస్తుంది. వీరిద్దరి మద్య ప్రేమ వ్యవహారం కాస్త రెండు కుటుంబాల మద్య పెద్ద గొడవకు తెర తీస్తుంది. దాంతో వారు ఏం చేస్తారు అనేది ఈ సినిమా కథ అన్నట్లుగా టీజర్ లో చెప్పకనే చెప్పారు.

సినిమా విడుదల జూన్ 10వ తారీకు అవ్వడంతో ప్రమోషన్ కార్యక్రమాలకు నాని రంగంలోకి దిగబోతున్నాడు. ఇప్పటికే మంచి బజ్ ఉంది.. నాని తనదైన శైలిలో చాలా అగ్రెసివ్ గా సినిమాను ప్రమోట్ చేస్తే తప్పకుండా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.