Begin typing your search above and press return to search.

#Nani29: తెలంగాణ నేపథ్యంలో నాని ''దసరా''.. ఊర మాస్ లుక్ లో నేచురల్ స్టార్..!

By:  Tupaki Desk   |   15 Oct 2021 9:36 AM GMT
#Nani29: తెలంగాణ నేపథ్యంలో నాని దసరా.. ఊర మాస్ లుక్ లో నేచురల్ స్టార్..!
X
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇటీవలే 'టక్ జగదీష్' చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన నాని.. 'శ్యామ్ సింగ రాయ్' మూవీని డిసెంబర్ లో థియేట్రికల్ రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఓవైపు 'మీట్ క్యూట్' సినిమాని నిర్మిస్తూనే మరోవైపు 'అంటే సుందరానికీ!' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చారు. కెరీర్ ప్రారంభం నుంచి విభిన్నమైన చిత్రాల్లో నటిస్తూ వచ్చిన నాని.. ఇప్పుడు తాజాగా తన 29వ సినిమాని అధికారికంగా ప్రకటించారు.

దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని #Nani29 చిత్రానికి ''దసరా'' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టు ప్రకటించి నాని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇందులో నాని సరసన మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలిపారు. 'ఈ దసరా నిరుడు లెక్క ఉండదు' అంటూ ఈ సందర్భంగా రిలీజ్ చేసిన అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. ఇందులో చెవికి పోగు- రింగుల జుట్టుతో నాని డీగ్లామర్ గా రగ్డ్ లుక్ లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ తో పాటుగా రిలీజ్ చేసిన 'సైరన్ ఆఫ్ దసరా' గ్లిమ్స్ కూడా ఆసక్తికరంగా ఉంది.

'దసరా' చిత్రంలో నాని - కీర్తి సురేష్ లుక్స్ ఎలా ఉండబోతున్నాయో ఈ గ్లిమ్స్ లో చూపించారు. అంతేకాదు ఇది తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న పీరియాడికల్ డ్రామా అని హింట్ ఇచ్చారు. 'చిత్తూ చిత్తుల బొమ్మ.. శివుని ముద్దుల గుమ్మా' అంటూ బతుకమ్మ పాట వినిపిస్తుండగా.. బ్లాక్1అండ్ వైట్ థీమ్ లో ఒకప్పటి కాలంలోని రైలుని ట్రాక్ ని ఇందులో చూడొచ్చు. అలానే రైలు నుంచి కొన్ని మూటలు పడటం చూస్తుంటే హీరో దొంగగా కనిపిస్తారేమో అనే సందేహం కలుగుతోంది.

ఈ వీడియో చివర్లో నాని తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. 'ఈ దసరా నిరుడు లెక్కుండది.. బాంచత్.. జమ్మివెట్టి చెబుతున్నా.. బద్దల్ బాసింగలైతాయ్.. ఎట్లైతే గట్లైతది.. సూసుకుందాం' అంటూ నాని తనదైన శైలిలో డైలాగ్ చెప్పి అలరించారు. 'దసరా' సినిమాతో కొత్త దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సంతోష్ నారాయణన్ - సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ ఈ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నారు. అవినాష్ కొల్లా ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు. 'నేను లోకల్' తర్వాత నాని - కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న సినిమా ''దసరా''. ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.