'ఎఫ్ 2' కి జాతీయ స్థాయిలో అవార్డు వచ్చినందుకు హ్యాపీనే కానీ..!

Thu Oct 22 2020 11:00:21 GMT+0530 (IST)

National level award for F2

కేంద్ర సమాచార ప్రసారశాఖ మంత్రిత్వ శాఖ 2019 సంవత్సరానికి గానూ వివిధ భాషలకు చెందిన 26 సినిమాలకు అవార్డులు ప్రకటించింది. ఫీచర్ ఫిలిం కేటగిరీలో ఇండియన్ పనోరమ అవార్డుకు ఉత్తమ తెలుగు చిత్రంగా ''ఎఫ్ 2: ఫన్ అండ్ ఫ్రస్టేషన్'' సినిమా ఎంపికైంది. ఈ అవార్డు సాధించిన ఏకైక తెలుగు సినిమా 'ఎఫ్ 2' కావడం విశేషం. విక్టరీ వెంకటేష్ - వరుణ్ తేజ్ హీరోలుగా మిల్కీ బ్యూటీ తమన్నా - మెహ్రీన్ పిర్జాదా హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం గతేడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు నిర్మించారు. 'ఎఫ్ 2'కు జాతీయ అవార్డు రావడంపై వెంకటేష్ - వరుణ్ తేజ్ - దిల్ రాజు ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు అనిల్ రావిపూడి ''బాక్సాఫీసు నుంచి బ్లాక్ బ్లస్టర్ దాకా సాగిన ప్రస్థానానికి జాతీయ గుర్తింపు లభించింది. వెంకటేష్ గారికి నా సోదరుడు వరుణ్ తేజ్ షూటింగులో సహకరించిన నటీనటులు సిబ్బందికి నా ధన్యవాదాలు. దిల్ రాజు గారికి శిరీష్ గారికి నా థ్యాంక్స్'' అని సంతోషాన్ని వ్యక్తం చేశారు.అయితే తెలుగు చిత్రం 'ఎఫ్ 2' కి జాతీయ స్థాయిలో అవార్డు రావడం పట్ల హ్యాపీగానే ఉన్నప్పటికీ.. అంతకంటే మంచి సినిమాలకు అవార్డ్ రాలేదనే కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. 2019లోనే విడుదలైన నాని 'జెర్సీ' చిత్రం మంచి ఎమోషనల్ మూవీగా ప్రేక్షకుల ప్రశంసలు పొందింది. కానీ దాన్ని ఎవ్వరూ పట్టించుకోకపోవడమే కాస్త ఫ్రస్ట్రేషన్ గా ఉందని నెటిజన్స్ 'ఎఫ్ 2' కి వచ్చిన అవార్డ్ పై కామెంట్స్ చేస్తున్నారు. ఇది పక్కన పెడితే జాతీయ స్థాయిలో అవార్డు తెచ్చుకున్న టాలీవుడ్ దర్శకులు ఆ తరువాత డల్ అయిపోతున్నారనే టాక్ ఎప్పటి నుంచో ఉంది. నేషనల్ అవార్డు తెచ్చుకున్న సతీష్ వేగ్నేశ్నకు ఆ తర్వాత అన్నీ ఫ్లాపులే పలకరించాయి. అదే ఏడాది జాతీయ అవార్డ్ అందుకున్న తరుణ్ భాస్కర్ కి కూడా వెంటనే ప్లాప్ వచ్చింది. మరి ఇప్పుడు అనిల్ రావిపూడి 'ఎఫ్ 2'కి సీక్వెల్ గా వస్తున్న 'ఎఫ్ 3'తో దీన్ని బ్రేక్ చేస్తాడేమో చూడాలి.