నేషనల్ సినిమా డే ఎఫెక్ట్... సినిమాకు మంచి రోజులు రాబోతున్నాయా?

Mon Sep 26 2022 10:48:51 GMT+0530 (India Standard Time)

National Cinema Day Effect... Good days are coming for cinema?

గత కొన్ని సంవత్సరాలుగా సినిమా టికెట్ల రేట్లు కొన్ని రెట్లు పెరిగాయి. ఒక మధ్య తరగతి ఫ్యామిలీ మల్టీ ప్లెక్స్ లో సినిమా ను చూడాలి అంటే వారి యొక్క నెలవారి ఖర్చులకు ఎంత అయితే ఖర్చు చేస్తారో అంత ఒక్క సినిమాకు ఖర్చు చేయాల్సిన పరిస్థితి ఉంది. అంతగా టికెట్ల రేట్లు పెరగడంతో కింది స్థాయి వారు మధ్య తరగతి వారు సినిమాలకు పూర్తిగా దూరం అయ్యారు అనేది విశ్లేషకుల వాదన.కొన్ని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో మాత్రమే ఇప్పుడు మధ్య తరగతి వారు సినిమా చూసే అవకాశం ఉంది. మల్టీ ప్లెక్స్ అనే పదం కూడా వారు వినేందుకు భయపడుతున్నారు. టికెట్ల రేట్లు మాత్రమే కాకుండా అక్కడ ఉన్న తిను బండారాలు కూడా అత్యంత ఖరీదు ఉండటం వల్ల వామ్మో మల్టీ ప్లెక్స్ మా వల్ల కాదు అన్నట్లుగా పరిస్థితి మారిపోయింది.

తాజాగా నేషనల్ సినిమా డే సందర్భంగా దేశంలోని అన్ని మల్టీ ప్లెక్స్ ల్లో కూడా కేవలం 75 రూపాయలకే  టికెట్ ను ఇవ్వడం జరిగింది. దాంతో దాదాపుగా ఏడు లక్షల మంది ఆ ఒక్క రోజు మల్టీప్లెక్స్ ల ముందు బారులు తీరారు. సినిమా అంటే మన దేశంలో ఈ స్థాయిలో అభిమానం ఉంది.. కానీ ఆర్థిక సమస్య కారణంగానే జనాలు సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపడం లేదని ఆ సంఘటన నిరూపించింది.

టికెట్ల రేట్లు ఒక మోస్తరుగా మధ్య తరగతి వారికి అందుబాటులో ఉంటే కచ్చితంగా భారీగా జనాలు థియేటర్లకు తరలి వస్తారని ఇప్పుడు విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమా థియేటర్లను పూర్తిగా మర్చిపోక ముందే టికెట్ల రేట్ల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనే చర్చ ఇప్పుడు నేషల్ సినిమా డే తర్వాత ఇండస్ట్రీ వర్గాల్లో మొదలయ్యింది.

సినిమా ఇండస్ట్రీకి మంచి రోజులు రాబోతున్నాయా అన్నట్లుగా ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాల్లో ముఖ్యంగా మల్టీ ప్లెక్స్ యాజమాన్యాల చర్చలు జరుగుతున్నాయి. టికెట్ల రేట్లు విపరీతంగా ఉండటం వల్లే ప్రేక్షకులు థియేటర్లకు రావడం లేదు. కనుక మరీ 75 రూపాయలు కాకుండా కాస్త పెంచి టికెట్ల రేట్లను సామాన్యులకు అందుబాటులో ఉంచాలని.. ప్రస్తుతం ఉన్న భారీ టికెట్ల రేట్లను తగ్గించాలని భావిస్తున్నారు.

అదే కనుక జరిగితే మల్టీప్లెక్స్ లకు మహారాజ పోషకులుగా మధ్య తరగతి వారు మారే అవకాశం ఉంటుంది. అప్పుడు ఇండస్ట్రీకి కూడా మంచి జరుగుతుంది. ఆ దిశగా మరింతగా చర్చలు జరిగితే ఇండస్ట్రీకి మంచి రోజులు వస్తాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.