'రూలర్' కు అల్లుడు ప్రశంసలు

Sun Dec 08 2019 18:28:42 GMT+0530 (IST)

Nara Lokesh Reaction On Ruler Trailer

నందమూరి బాలకృష్ణ నటించిన రూలర్ సినిమాకు అల్లుడు నారా లోకేశ్ అదిరిపోయే కాంప్లిమెంట్ ఇచ్చారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెలరకెక్కుతున్న ఈ సినిమా ఈ నెల 20న రిలీజ్ కానుంది. ఇప్పటికే యంగ్ లుక్‌తో ఆకట్టుకుంటున్న బాలయ్య చిత్రాలు వైరల్ గా మారగా తాజాగా సినిమా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సోషల్ మీడియాలో దూసుకు పోతున్న ట్రైలర్‌పై నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు. ట్విటర్ వేదికగా స్పందించిన లోకేశ్ బాలయ్యను ఆకాశానికెత్తారు. బాలయ్య డైలాగులతో పాటు బాలయ్య నటన అదుర్స్ అంటూ మెచ్చుకున్నారు."ఈ ధాన్యం తింటున్న మీరే ఇంత పొగరు చూపిస్తుంటే - దీన్ని పండించిన రైతుకు ఇంకెంత పవరు - పొగరు ఉంటుందో చూపించమంటావా?" అన్న బాలయ్య డైలాగ్ ను  కోట్ చేస్తూ బాలా మావయ్యా!మీ డైలాగ్ సూపర్. టోటల్ గా మీ సినిమా 'రూలర్' ట్రైలర్ అదుర్స్. దీన్నిబట్టి సినిమా దుమ్ములేపుద్దనిపిస్తోంది. ఆల్ ద బెస్ట్ బాలా మావయ్యా అని లోకేష్ ట్వీట్ చేశారు.

మావయ్య సినిమాలపై స్పందించడం లోకేశ్ కు కొత్తేమీ కాదు. ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎంత బిజీగా ఉన్నా బాలయ్య సినిమాల టీజర్లు - ట్రైలర్లు నచ్చినప్పుడు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ ఉండేవారు. గౌతమీపుత్ర శాతకర్ణి - మహానాయకుడు - కథానాయకుడు సినిమాల విషయంలో కూడా లోకేష్ తన సోషల్ మీడియాలో స్పందించారు. ఇప్పుడు రూలర్ సినిమాపైనా తన అభిప్రాయాన్ని చెప్పి అభిమానుల్లో కదలిక తెచ్చారు.

మరోవైపు రూలర్ లో బాలయ్య డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఆయన అభిమానులు టిక్ టాక్ లో వాటిని విరివిగా వాడడం ప్రారంభించారు. ‘‘ఇది దెబ్బతిన్న సింహాంరా.. అంత తొందరగా చావదు. వెంటాడి వేటాడి చంపుద్ది’’ అన్న డైలాగ్  హిట్ అయింది. సోనాల్ చౌహాన్ - వేదిక హీరోయిన్లుగా నటించిన ఈ సినిమా కోసం బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు.