Begin typing your search above and press return to search.

'శ్యామ్ సింగ రాయ్'పై నానీకి అంత నమ్మకమా?

By:  Tupaki Desk   |   19 Oct 2021 2:37 AM GMT
శ్యామ్ సింగ రాయ్పై నానీకి అంత నమ్మకమా?
X
నాని గురించి తెలిసినవాళ్లు ఆయనంటే ఒక పద్ధతి .. ఒక ప్లానింగ్ .. ఒక విజన్ అనే అంటారు. అంతలా ఆయన తన సినిమాలను ప్లాన్ చేసుకుంటాడు. ఆ ప్లానింగ్ లో ఎక్కడా ఎంతమాత్రం తేడా రాకుండా చూసుకుంటాడు. ముఖ్యంగా ఆయన 'దిగిరాను దిగిరాను దివి నుంచి భువికి' అన్నట్టుగా కాకుండా,దర్శక నిర్మాతలకు అందుబాటులో ఉంటాడు. వాళ్లు ఎప్పుడంటే అప్పుడు తనని కలిసే సాన్నిహిత్యంతో ఉంటాడు. అందువల్లనే నానితో మళ్లీ ,మళ్లీ సినిమాలు చేయడానికి వాళ్లు ఆసక్తినీ .. ఉత్సాహాన్ని చూపుతుంటారు.

ఇక నాని ఒక స్నేహపూర్వకమైన వాతావరణంలో కథా చర్చలు చేస్తాడు. తాను అనుకున్నట్టుగా వచ్చేవరకూ కసరత్తు జరుగుతూనే ఉంటుంది. నానీకి కథాకథనాలపై మంచి పట్టు ఉంది. కథలో ఏయే అంశాలు ఉండాలి? ఎక్కడ ఏ విషయాన్ని చెప్పాలి అనే విషయంపై కూడా మంచి అవగాహన ఉంది. కథ అనేది లేకపోతే ఎవరు ఏం చేసినా వర్కౌట్ కాదు .. అందువలన కథాబలం ఉండాలి .. అందులో కొత్తదనం ఉండాలి అనే విషయాన్ని ఆయన బాగా నమ్ముతుంటాడు. ఆయన అలా భావించడం వల్లనే ఆయన కెరియర్లో విభిన్నమైన కథలు .. విలక్షణమైన పాత్రలు కనిపిస్తాయి.

ఆయన తాజా చిత్రంగా 'శ్యామ్ సింగ రాయ్' రూపొందింది. రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరించాడు. ఈ సినిమాలో నాని లుక్ .. కథాకథనాలు విభిన్నంగా ఉండనున్నాయి. అందువలన అందరిలో ఆసక్తి ఉంది. ఈ సినిమా థియేటర్లకు .. ఓటీటీ సంస్థలకు మధ్య ఊగిసలాడుతున్నట్టుగా వార్తలు వచ్చాయి. కానీ డిసెంబర్ 24వ తేదీన థియేటర్లలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నామనే తాజా ప్రకటనతో ఊహాగానాలకు తెరపడిపోయింది. అయితే ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళ .. మలయాళ .. కన్నడ భాషల్లో విడుదల చేయాలనుకోవడమే ఇక్కడి విశేషం.

నాని సినిమాలలో ఇంతవరకూ ఏదీ కూడా ఒకేసారి నాలుగు భాషల్లో విడుదలైంది లేదు. రాజమౌళి దర్శకత్వంలో ఆయన చేసిన 'ఈగ' తెలుగుతో పాటు తమిళ .. హిందీ భాషల్లో మాత్రమే రిలీజ్ అయింది. అలాంటిది ఈ సారి మాత్రం ఆయన 'శ్యామ్ సింగ రాయ్'తో మలయాళ .. కన్నడ భాషలలోకి కూడా అడుగపెడుతున్నాడు. ఈ కథపై నానీకి గల నమ్మకమే అందుకు కారణమని చెప్పుకుంటున్నారు. మరి ఇతర భాషల్లో ఈ సినిమా ఎంతవరకూ తన సత్తా చాటుకుంటుందో, అక్కడ ఆయన క్రేజ్ కి ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

తెలుగులో కృతి శెట్టికి మంచి క్రేజ్ ఉంది. తెలుగుతో పాటు తమిళ .. మలయాళ భాషల్లో సాయిపల్లవి క్రేజ్ ఉంది. ఇక మడోన్నా సెబాస్టియన్ కి గల ఇమేజ్ మలయాళంలో వర్కౌట్ అవుతుంది. కన్నడలో తెలుగు సినిమాలకు మంచి ఆదరణే ఉంటుంది. అందువలన ఆ భాష నుంచి ఈ సినిమాలో హీరోయిన్ లేకపోయినా వాళ్లు చూస్తారు. తమకి నచ్చితే హిట్టు ఇచ్చేస్తారు. మరి ఈ సినిమా నాలుగు భాషల్లో నాని పెట్టుకున్న నమ్మకాన్ని ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి.