Begin typing your search above and press return to search.

మళ్లీ టీవీ షో హోస్ట్ గా చేయనంటున్న నాని..!

By:  Tupaki Desk   |   15 Sep 2021 4:30 PM GMT
మళ్లీ టీవీ షో హోస్ట్ గా చేయనంటున్న నాని..!
X
నేచురల్ స్టార్ నాని కెరీర్ ప్రారంభం నుంచీ విభిన్నమైన చిత్రాలతో.. తనదైన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో బుల్లితెర మీద కూడా మెరిసాడు. సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న సమయంలో 'బిగ్ బాస్' తెలుగు రియాలిటీ షో సీజన్-2 కు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. అయితే ఆ తర్వాత సీజన్ లో కానీ.. మరో టీవీ షోలో కానీ నాని కనిపించలేదు. కేవలం సినిమాలకే పరిమితమై వరుస ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వస్తున్నాడు.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన నాని.. మళ్ళీ స్మాల్ స్క్రీన్ మీద హోస్ట్ గా కనిపించే అవకాశం లేదని తెలిపారు. బుల్లితెర మీద హోస్ట్ గా కనిపించే అవకాశం ఉందా? అన్న ప్రశ్నకు సమాధానమిస్తూ.. ''లేదు. అలాంటి ప్లాన్స్ ఏమీ లేవు. 'బిగ్ బాస్' షో ఇకపై చేయనని లాస్ట్ ఎపిసోడ్ అప్పుడే చెప్పేసాను. సోషల్ మీడియాలో కూడా ఈ విషయం పోస్ట్ చేశాను'' అని నాని అన్నారు.

'బిగ్ బాస్' షో అనేది చాలా కాలిక్యులేషన్స్ తో కూడుకుంది. నేను డైలీ సినిమా మైండ్ తో నిద్రలేస్తా.. సినిమా గురించే ఆలోచిస్తూ నిద్రపోతా. అలాంటి నాకు టీవీ షో భారంగా అనిపిస్తుంది. నాకంటే బెటర్ గా ఆ షో ని నడిపే నాగార్జున గారు ఇప్పుడు హోస్ట్ చేస్తున్నారు అని నాని చెప్పారు. అయితే 'బిగ్ బాస్' షో చేసినందుకు తనకు ఎలాంటి పశ్చాత్తాపం లేదని నాని అన్నారు.

''బిగ్ బాస్ షో నేర్పినంత సహనం మరేదీ నేర్పలేదు. అదొక డిఫరెంట్ ఎక్సపీరియన్స్. నా సినిమాలు, నా షూటింగ్ లు అంటూ ఉండే నాకు అదొక భిన్నమైన ప్రపంచం అయింది'' అని చెప్పారు. అయితే షో జరుగుతున్నప్పుడు కంటెస్టెంట్స్ ని ఏదైనా అన్నప్పుడు ట్రోల్ చేసిన వారు కూడా.. ప్రతి ఏడాది షో స్టార్ట్ అయ్యేప్పుడు మళ్ళీ ఎప్పుడు 'బిగ్ బాస్' కు హోస్ట్ చేస్తారని మేసేజ్ లు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతుంటారని.. అవి చూసినప్పుడు హ్యాపీగా అనిపిస్తుందని నాని చెప్పుకొచ్చారు.

ఇక సినిమాల విషయానికొస్తే.. నాని హీరోగా నటించిన 'టక్ జగదీష్' సినిమా ఇటీవలే అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 'శ్యామ్ సింగ రాయ్' చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది. అలానే 'అంటే.. సుందరానికి' సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఇక ప్రొడ్యూసర్ గా నాని నిర్మిస్తున్న 'హిట్ 2' షూటింగ్ జరుపుకుంటుండగా.. 'మీట్ క్యూట్' సినిమా త్వరలో ఓటీటీ వేదికగా రిలీజ్ కానుంది.