ఇంట్రెస్టింగ్ లైన్ తో వస్తున్న నాని..!

Sat Dec 04 2021 09:00:01 GMT+0530 (IST)

Nani coming with an interesting line

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ''శ్యామ్ సింగ రాయ్''. 'టాక్సీవాలా' ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ దీనికి దర్శకుడు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని క్రిస్మస్ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే విడుదల చేయబడిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ముఖ్యంగా  టైటిల్ సాంగ్ - టీజర్ నాని సినిమాపై అంచనాలు పెంచేసింది.



ఇందులో నాని రెండు పాత్రల్లో కనిపించనున్నారని ప్రచార చిత్రాలను బట్టి అర్థం అయింది. టీజర్ లో 1970స్ కలకత్తా బ్యాక్ డ్రాప్ లో బెంగాలీ వ్యక్తిగా.. అలానే మోడరన్ యువకుడు వాసుగా ఆకట్టుకున్నారు. రెండు పాత్రల తీరుతెన్నులు కొత్తగా ఉంటాయని తెలుస్తోంది. అయితే వీరిలో శ్యామ్ సింగ రాయ్ ఓ రచయిత అని.. అతను రాసే కథల్లో ఉండే పాత్రల్లోకి వెళ్లిపోయే క్యారెక్టర్ అని అంటున్నారు.

ఈ క్రమంలో ఆచారాల పేరుతో అన్యాయానికి బలైపోతున్న స్త్రీలకు అండగా నిలబడి పోరాడతాడని.. తన ప్రజల తరపున నిలబడి ఓ లెజెండ్ గా ఎదగడమే 'శ్యామ్ సింగ రాయ్' కథ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఇందులో ఇద్దరు నాని లకు మధ్య సంబంధం ఎంటనేది ఆసక్తికరంగా ఉంటుందట.

ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. నాని ఓ ఇంట్రెస్టింగ్ లైన్ తో రాబోతున్నారని అర్థం అవుతోంది. అందులోనూ ఇది నేచురల్ స్టార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ. సత్యదేవ్ జంగా ఈ చిత్రానికి కథ అందించారు. వీఎఫ్ఎక్స్ వర్క్స్ కు అధిక ప్రాధాన్యత ఉండబోతోంది. ఈ సినిమాపై నాని చాలా నమ్మకంగా ఉన్నారు. 'వి' 'టక్ జగదీష్' వంటి బ్యాక్ టు బ్యాక్ ఓటీటీలో రిలీజ్ చేసిన నాని.. ఈసారి ఎట్టిపరిస్థితుల్లోనూ థియేట్రికల్ విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు.

'శ్యామ్ సింగ రాయ్' చిత్రాన్ని తెలుగుతో పాటుగా తమిళం మలయాళం కన్నడ భాషల్లో డిసెంబర్ 24న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రమోషన్స్ లో భాగంగా థియేట్రికల్ ట్రైలర్ - మిగిలిన పాటలు రానున్నాయి. మిక్కీ జె మేయర్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. సాను జాన్ వర్గేష్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా.. నవీన్ నూలి ఎడిటర్ గా వర్క్ చేస్తున్నారు.

నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో సాయి పల్లవి - కృతి శెట్టి - మడోనా సెబాస్టియన్ వంటి ముగ్గులు ముద్దుగుమ్మలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. జిషు సేన్ గుప్తా - రాహుల్ రవీంద్రన్ - మురళీ శర్మ - అభినవ్ గోమటం - లీలా శాంసన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.