రేయ్ 'అల్లరి' తీసేయ్.. నాని సలహా

Mon Mar 01 2021 10:00:01 GMT+0530 (IST)

Nani Tweet On Allari Naresh

అల్లరి నరేష్ హీరోగా సుదీర్ఘ కాలం తర్వాత సక్సెస్ దక్కించుకున్నాడు. దాదాపు పదేళ్ల క్రితం సుడిగాడు సినిమా తో హిట్ ను అందుకున్న అల్లరి నరేష్ ఆ తర్వాత వరుస ఫ్లాప్ లతో సతమతం అయ్యాడు. మినిమం గ్యారెంటీ సక్సెస్ హీరోగా పేరు దక్కించుకున్న అల్లరి నరేష్ ఈమద్య కాలంలో ఫ్లాప్ హీరో అనిపించుకున్నాడు. కెరీర్ పరంగా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొన్న అల్లరోడికి ఎట్టకేలకు 'నాంది' సినిమా సక్సెస్ ను కట్టబెట్టింది. విజయ్ కనకమేడల దర్శకత్వంలో రూపొందిన నాంది సినిమా హిట్ సినిమాల జాబితాలో చేరిపోయింది. ఇప్పటికే బ్రేక్ ఈవెన్ ను సాధించి విమర్శకుల ప్రశంసలు కూడా దక్కించుకుంది. తాజాగా ఈ సినిమా ను చూసిన యంగ్ హీరో నాని తనదైన శైలిలో స్పందించాడు.నాని ట్విట్టర్ లో... ఎట్టకేలకు నాంది చూశాను. రేయ్ రేయ్ రేయ్ అల్లరి నరేష్ పేరు మార్చేయ్ ఇంక అల్లరి గతం భవిష్యత్తుకి ఇది నాంది. చాలా సంతోషంగా ఉంది. ముందు ముందు మరిన్ని మంచి సినిమాలు నటుడిగా మరింత గుర్తింపు తెచ్చుకునే పాత్రలు చేయాలని కోరుకుంటున్నాను అంటూ ట్వీట్ చేశాడు. అల్లరి సినిమాతో హీరోగా పరిచయం అయ్యి పదేళ్ల పాటు జైత్ర యాత్ర కొనసాగించిన నరేష్ ఇప్పుడు అల్లరి ని తీసి పక్కన పెట్టే టైమ్ వచ్చినట్లుగా అనిపిస్తుంది. నాంది తో సీరియస్ సినిమాల హీరోగా నరేష్ టర్న్ అయ్యే సమయం వచ్చేసింది. అందుకే అభిమానులతో పాటు నాని కూడా అల్లరి ట్యాగ్ తీసేయాలని సలహా ఇస్తున్నారు.