మరో మైత్రి మూవీస్ ను పరిచయం చేయబోతున్న నాని

Sun Sep 25 2022 13:43:44 GMT+0530 (India Standard Time)

Nani To Launch A New Banner

టాలీవుడ్ లో ఈ మధ్య కాలంలో అత్యధిక సినిమాలు చేస్తున్న నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్. ఈ బ్యానర్ లో పలువురు భాగస్వామ్యులుగా ఉన్నారు. అందులో ఒక నిర్మాత ఇటీవల మైత్రి మూవీ మేకర్స్ నుండి బయటకు వచ్చేశాడట. అందులో ఉన్న వారితో విభేదాల కారణంగా ఆయన బయటకు వచ్చేసి సొంతంగా సినిమాలను నిర్మించేందుకు సిద్ధం అయ్యాడని సమాచారం అందుతోంది.అందులో భాగంగానే ఆ నిర్మాత ఇప్పటికే పలువురు యంగ్ హీరోలకు మరియు ఒకరు ఇద్దరు స్టార్ హీరోలకు అడ్వాన్స్ లు ఇవ్వడం జరిగిందట. ఆ నిర్మాత మొదటగా నిర్మించబోతున్న సినిమా లో నాని హీరోగా నటించబోతున్నట్లుగా టాలీవుడ్ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇప్పటికే సదరు నిర్మాత ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను నాని సినిమా కోసం మొదలు పెట్టించాడు అనేది టాక్.

నాని హీరోగా కొత్త దర్శకుడి దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమాతో ఆ నిర్మాత తెలుగు ప్రేక్షకులకు కొత్త బ్యానర్ ను పరిచయం చేయబోతున్నట్లుగా తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ నుండి బయటకు వచ్చిన ఆయన కాస్త అటు ఇటుగా అదే పేరును పెట్టే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

మైత్రి అనే పదం ఉపయోగించి బ్యానర్ పేరు పెడితే బాగుంటుందని ఆ నిర్మాత భావిస్తున్నాడట. ప్రస్తుతానికి సినిమా యొక్క స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. నాని ప్రస్తుతం చేస్తున్న దసరా సినిమా షూటింగ్ ముగిసిన వెంటనే అంటే ఇదే ఏడాది చివర్లో కొత్త బ్యానర్ లో నాని సినిమా పట్టాలెక్కే అవకాశాలు ఉన్నాయంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా తెలుస్తోంది. నాని సినిమా తో ఆరంభం కాబోతున్న ఈ కొత్త బ్యానర్ భవిష్యత్తులో ఎలాంటి సినిమాలను అందిస్తుందో చూడాలి.