'స్కైలాబ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్టుగా నాని!

Sat Nov 27 2021 22:00:01 GMT+0530 (IST)

Nani To Be Chief Guest At Skylab Pre Release Event

ఈ మధ్య కాలంలో ఓ మాదిరి బడ్జెట్ తో మంచి కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయి. విభిన్నమైన కథాకథనాలతో రూపొందిన ఈ తరహా సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. దాంతో కొత్తదనంతో కూడిన కథలు థియేటర్లకు వచ్చేస్తున్నాయి. అలా రూపొందిన మరో సినిమానే 'స్కైలాబ్'. సత్యదేవ్ - నిత్యామీనన్ జంటగా ఈ సినిమా రూపొందింది. పృథ్వీ పిన్నమరాజు ఈ సినిమాను నిర్మించగా నిత్యామీనన్ కూడా నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించడం విశేషం. ఈ సినిమాతో విశ్వక్ ఖండేరావు దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.ఈ సినిమా నుంచి ఇంతవరకూ వచ్చిన అప్ డేట్ ల కారణంగా గ్రామీణ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందనే విషయం అర్థమవుతోంది. రాహుల్ రామకృష్ణ ముఖ్యమైన పాత్రను పోషించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని U సర్టిఫికేట్ తెచ్చుకుంది. డిసెంబర్ 4వ తేదీన ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి నాని ముఖ్య అతిథిగా రానున్నాడు. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఈ సినిమా టీమ్ పోస్టర్ ను వదిలింది.

ఈ సందర్భంగా ఈ సినిమా సమర్పకుడు రవికిరణ్ మాట్లాడుతూ .. "ఈ సినిమా కథాకథనాలపై రెండున్నరేళ్లు కసరత్తు జరిగిన తరువాతనే మెదలుపెట్టాము. కథాకథనాలపై దర్శకుడు విశ్వక్ కి మంచి పట్టుంది. అలాగే ప్రేక్షకులు ఎలాంటి కొత్తదనాన్ని కోరుకుంటున్నారనే విషయంపై మా నిర్మాత పృథ్వీకి మంచి అవగాహన ఉంది. సిరిసంపదలకంటే మానవతా విలువలు .. బంధాలు గొప్పవని చాటిచెప్పే ప్రయత్నం చేస్తున్నాము. విభిన్నమైన కథతో వస్తున్న మా సినిమాను ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది" అని చెప్పాడు.

ఈ మధ్య తెలుగులో నిత్యామీనన్ కి కాస్త గ్యాప్ వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె నుంచి 'స్కైలాబ్' సినిమా వస్తోంది. డిసెంబర్ 4వ తేదీన ఈ సినిమా ప్రేక్షకులను పలకరించనుంది. ఇక ఎప్పటి నుంచో సరైన రిలీజ్ డేట్ కోసం వెయిట్ చేస్తున్న 'గమనం' కూడా డిసెంబర్ 10వ తేదీన రానుంది. జనవరి 12 వ తేదీన 'భీమ్లా నాయక్' విడుదల కానుంది. ఇలా నిత్యామీనన్ నుంచి వరుస సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలతో నిత్యామీనన్ కెరియర్ మళ్లీ పుంజుకుంటుందేమో చూడాలి.