Begin typing your search above and press return to search.

‘అ!’ సూపర్ హిట్.. అందుకే ఐటీ రైడ్లు-నాని

By:  Tupaki Desk   |   24 Feb 2020 7:30 AM GMT
‘అ!’ సూపర్ హిట్.. అందుకే ఐటీ రైడ్లు-నాని
X
నాని తొలిసారి నిర్మాతగా అవతారమెత్తి తీసిన సినిమా ‘అ!’. ప్రశాంత్ వర్మ అనే కొత్త దర్శకుడిని పరిచయం చేస్తూ ఈ వినూత్నమైన సినిమాను ప్రొడ్యూస్ చేశాడతను. ఈ చిత్రానికి రిలీజ్ ముంగిట మంచి బజ్ కనిపించింది కానీ.. జనాల నుంచి మిశ్రమ స్పందన కనిపించింది. సినిమా అనుకున్నంతగా ఆడలేదనే ట్రేడ్ వర్గాలు భావించాయి. ఆ సినిమా ప్రస్తావన వచ్చినపుడల్లా అది హిట్ కాదన్నట్లుగా అందరూ మాట్లాడుతున్నారు. కానీ నాని మాత్రం ఆ అభిప్రాయం తప్పంటున్నాడు. తన ప్రొడక్షన్లో వచ్చిన తొలి సినిమా సూపర్ హిట్ అని అతను తేల్చాడు. తన బేనర్ ‘వాల్ పోస్టర్ సినిమా’ నుంచి రాబోతున్న రెండో సినిమా ‘హిట్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అతను ఈ సంగతి చెప్పడం విశేషం. ‘హిట్’ గురించి మాట్లాడుతూ మాట్లాడుతూ.. కొంచెం బ్రేక్ తీసుకుని ‘అ!’ ప్రస్తావన తెచ్చాడు నాని.

ఆ సినిమా గురించి ఎవరు మాట్లాడినా.. చాలా మంచి ప్రయత్నం, గొప్ప సినిమా అంటూనే సరిగా ఆడలేదని చెబుతున్నారని.. వెబ్ సైట్లలో ఆర్టికల్స్‌లో కూడా ఇలాగే పేర్కొనడం గమనించానని.. కానీ వాళ్లందరి అభిప్రాయం తప్పని.. ఈ సినిమా కమర్షియల్‌గా సూపర్ సక్సెస్ అయిందని.. తనకు మంచి లాభాలు వచ్చాయని నాని స్పష్టం చేశాడు. దీనికి కొనసాగింపుగా తనపై ఐటీ దాడులు జరిగింది కూడా ఈ సినిమా నుంచి వచ్చిన లాభాలే కారణమన్నట్లుగా నాని చమత్కరించడం విశేషం. ఐతే ఈ సినిమా వల్ల నాని మాత్రమే లాభ పడ్డాడా.. బయ్యర్లకు కూడా లాభం వచ్చిందా అన్నది ప్రశ్న. ఆ సంగతలా ఉంటే.. ‘అ!’ అంత మంచి సక్సెస్ అయినపుడు ప్రశాంత్ వర్మ ‘అ!-2’కు నిర్మాత దొరకక పోవడం వల్ల ఏడాది నుంచి ఆ స్క్రిప్టు పక్కన పడి ఉందని అంటున్న నేపథ్యం లో నాని ఎందుకు ముందుకొచ్చి ఆ సినిమాను ప్రొడ్యూస్ చేయలేదన్న ప్రశ్నా తలెత్తుతోంది. ఇటీవల ఈ సీక్వెల్ ఉంటుందని ప్రశాంత్ ప్రకటించినప్పటికీ.. దాని నిర్మాత నాని అని మాత్రం ప్రకటించ లేదు.