ఫైనల్ గా `బింబిసార`ని వీక్షించిన బాలయ్య!

Sat Aug 13 2022 18:05:44 GMT+0530 (India Standard Time)

NandamuriBalakrishna Garu watched Bimbisara

నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటించిన పీరియాడిక్ ఫిక్షన్ మూవీ `బింబిసార`. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె. హరికృష్ణ అత్యంత భారీ స్థాయిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ మూవీని నిర్మించారు. నందమూరి కల్యాణ్ రామ్ బింబిసారుడిగా దేవదత్తుడిగా ద్విపాత్రాభినయం చేసిన ఈ మూవీ ద్వారా మల్లిడి వశిష్ట దర్శకుడిగా పరిచయం అయ్యారు.దాదాపు గత రెండు నెలలగా టాలీవుడ్ సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లుగా ఫ్లాపులుగా మారుతున్న నేపథ్యంలో ఆగస్టు 5న విడుదలైన ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

వరుస ఫ్లాపులతో బెంబేలెత్తిపోతున్న టాలీవుడ్ కు కొండంత ధైర్యాన్ని అందించింది. విడుదలైన తొలి రోజే యునానిమస్ గా బ్లాక్ బస్టర్ టాక్ ని సొంతం చేసుకుని ప్రేక్షకుల విమర్శలకు ప్రశంసల్ని సొంతం చేసుకుంది.

ఇండస్ట్రీ వర్గాలతో పాటు ప్రతీ ఒక్కరూ ఈ మూవీపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇదిలా వుంటే టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ మూవీని శనివారం ప్రత్యేకంగా స్టార్ హీరో నందమూరి కల్యాణ్ రామ్ బాబాయ్ నందమూరి బాలకృష్ణ వీక్షించారు.  

బాలకృష్ణతో పాటు నందమూరి కల్యాణ్ రామ్ ఈ మూవీ దర్శకుడు వశిష్ణ కూడా  `బింబిసార`ని వీక్షించారు. హైదరాబాద్ లోని ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో ప్రత్యేకంగా హీరో బాలకృష్ణ కోసం ప్రీవ్యూని చిత్ర బృందం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా మూవీని వీక్షించిన అనంతరం బాలయ్య చిరునవ్వులు చింతిస్తున్న ఫొటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. బాలకృష్ణ నటించిన `ఆదిత్య 369` కూడా టైమ్ ట్రావెల్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమానే.

గతంలో ఈ మూవీకి సీక్వెల్ చేస్తున్నామంటూ బాలయ్య సీనియర్ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ప్రకటించారు. టైటిల్ గా `ఆదిత్య 999` అని కూడా ప్రచారం జరిగింది. అయితే కథలో మార్పులు అనివార్యం అని బాలయ్య అసంతృప్తిని వ్యక్తం చేయడంతో ఈ ప్రాజెక్ట్ కాస్తా హోల్డ్ లోకి వెళ్లిపోయింది. అయితే టైమ్ ట్రావెల్ కథగా తెరకెక్కిన `బింబిసార` బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఈ చిత్ర దర్శకుడు మల్లిడి వశిష్టకు `ఆదిత్య 999` బాధ్యల్ని బాలయ్య అప్పగించే అవకాశం వుందని అభిమానుల్లో ప్రస్తుతం చర్చ జరుగుతోందని అంటున్నారు.