Begin typing your search above and press return to search.

మహేష్ సినిమాలో నందమూరి హీరో.. నిజమెంత..?

By:  Tupaki Desk   |   28 May 2022 10:39 AM GMT
మహేష్ సినిమాలో నందమూరి హీరో.. నిజమెంత..?
X
సూపర్ స్టార్ మహేష్ బాబు - త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. #SSMB28 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రాన్ని ఫిబ్రవరిలో గ్రాండ్ గా లాంచ్ చేశారు. 'సర్కారు వారి పాట' సక్సెస్ జోష్ లో ఉన్న మహేష్.. జూన్ లో ఈ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

'అతడు' 'ఖలేజా' చిత్రాల తర్వాత మహేశ్ - త్రివిక్రమ్ కలిసి చేస్తోన్న సినిమా కావడంతో అందరిలో అంచనాలు నెలకొన్నాయి. ఇందులో మహేష్ బాబు సరసన పూజా హేగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం నందమూరి తారకరత్న ను తీసుకోడానికి త్రివిక్రమ్ ప్లాన్ చేశారని గత రెండు రోజులుగా వార్తలు వస్తున్నాయి.

అయితే తారకరత్న పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతా నుంచి ఈ విషయాన్ని ధృవీకరిస్తూ ఓ ట్వీట్ ట్వీట్ చేయబడింది. #SSMB28 అనే హ్యాష్ ట్యాగ్ తో.. ఇందులో అతని పాత్ర నెగిటివ్ షేడ్స్ ఉన్న డాక్టర్ రోల్ అనుకునే విధంగా ఎమోజీలు జత చేశారు. దీంతో తారకరత్న ఈ సినిమాలో నటిస్తున్నారంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

'ఒకటో నెం. కుర్రాడు' సినిమాతో హీరోగా లాంచ్ అయిన నందమూరి వారసుడు తారకరత్న.. ఒకేసారి 9 సినిమాలకు కొబ్బరికాయ కొట్టి సంచలనం రేపాడు. అయితే అందులో సగం సినిమాలు కూడా సెట్స్ మీదకు వెళ్ళలేదు. 'అమరావతి' వంటి పలు చిత్రాల్లో నెగెటివ్ రోల్స్ చేసి మెప్పించారు. అయినప్పటికీ బిజీగా మారలేకపోయాడు.

త్వరలో 'సారథి' అనే సినిమాతో పాటుగా '9 అవర్స్' అనే వెబ్ సిరీస్ తో ప్రేక్షకులను పలకరించబోతున్నారు తారకరత్న. ఇదే క్రమంలో మహేష్ సినిమాలో విలన్ గా నటించడానికి రెడీ అయ్యారని ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాతో ఫామ్ లోకి వస్తాడని అంటున్నారు.

ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాల్లో ప్రతినాయకుడి పాత్రలు కూడా ప్రత్యేకంగా డిజైన్ చేయబడుతుంటాయి. ఇప్పుడు తారకరత్న ను కూడా సరికొత్తగా ఆవిష్కరించే అవకాశం ఉందని అభిప్రాయ పడుతున్నారు. అయితే తారకరత్న పేరుతో ఉన్న ట్విట్టర్ అకౌంట్ వెరిఫైడ్ కాకపోవడంతో.. అధికారిక ఖాతా కాదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మేకర్స్ లేదా తారకరత్న క్లారిటీ ఇస్తారేమో చూడాలి.

ఏదేమైనా మహేష్ బాబు సినిమాలో నందమూరి హీరో నటిస్తున్నారని వార్తలు రావడంతో అందరిలో ఆసక్తి పెరిగిందనే చెప్పాలి. మే 31న కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ బాబు సినిమాలకు సంబంధించిన ఏదొక అప్డేట్స్ వస్తుంటాయి. ఈ నేపథ్యంలో SSMB28 సినిమా నుంచి అప్డేట్ వస్తుందని వార్తలు వస్తున్నాయి. మరి అదే రోజున నటీనటుల వివరాలు కూడా వెల్లడిస్తారేమో చూడాలి.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్. మది సినిమాటోగ్రాఫర్ గా.. ఏఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయనున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించనున్నారు.