నందమూరి హీరో కూడా రేసులోకి వచ్చేస్తున్నాడు..!

Sat Nov 27 2021 16:50:09 GMT+0530 (IST)

Nandamuri Hero Is Also Coming Into The Race

'పటాస్' రేంజ్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న నందమూరి కళ్యాణ్ రామ్.. ప్రస్తుతం ''బింబిసార'' అనే సినిమాలో నటిస్తున్నారు. టైమ్ ట్రావెల్ సోషియో ఫాంటసీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మల్లిడి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. ‘ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్’ అనేది దీనికి ట్యాగ్ లైన్. ఇందులో కళ్యాణ్ రామ్ సరసన కేథరీన్ ట్రెసా - సంయుక్త మేనన్ కథానాయికలుగా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ - ఫస్ట్ లుక్ గ్లింప్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. బార్బేరియన్ కింగ్ బింబిసారగా కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ లుక్ లో ఆకట్టుకున్నాడు.అయితే ఇన్నాళ్లూ సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకున్న 'బింబిసార' సినిమా.. విడుదలకు రెడీ అవుతోంది. డిసెంబర్ నెలలో పలు క్రేజీ మూవీస్ థియేటర్లలోకి వస్తుండగా.. నందమూరి హీరో సినిమా కూడా వాటితో పాటుగా రిలీజ్ కానుందని టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ తాజాగా ఓ ఆసక్తికరమైన అప్డేట్ తో ముందుకు వచ్చారు. 'బింబిసార' టీజర్ ను నవంబర్ 29న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. 'అతను క్రూరమైనవాడు. బార్బేరియన్ కింగ్ తన భూభాగాన్ని గుర్తించడానికి వస్తున్నాడు' అని పేర్కొన్నారు.

మరో రెండ్రోజుల్లో విడుదల కానున్న సినిమా టీజర్ కోసం నందమూరి అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ వస్తుందని భావిస్తున్నారు. ఏదేమైనా ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న 'బింబిసార' మూవీపై కళ్యాణ్ రామ్ భారీ ఆశలే పెట్టుకున్నారు. ఇది కల్యాణ్ రామ్ కెరీర్ లోనే హయ్యెస్ట్ బడ్జెట్ తో హై టెక్నికల్ వాల్యూస్ తో తెరకెక్కుతున్న సినిమా. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా పలు ప్రధాన భారతీయ భాషల్లో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారని సమాచారం.

కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం సమకూరుస్తున్నారు. 'బింబిసార' సినిమా తర్వాత కళ్యాణ్ రామ్ 'డెవిల్' అనే మరో పాన్ ఇండియా మూవీని పూర్తి చేయనున్నారు. ఇదే క్రమంలో దిల్ రాజు ప్రొడక్షన్ - మైత్రీ మూవీస్ వంటి అగ్ర నిర్మాణ సంస్థల్లో నందమూరి హీరో సినిమాలు ఉన్నాయి.