Begin typing your search above and press return to search.

నందమూరి అక్కినేని చేతులు కలపాల్సిందే

By:  Tupaki Desk   |   25 Jan 2023 8:00 AM GMT
నందమూరి అక్కినేని చేతులు కలపాల్సిందే
X
అటు అక్కినేని ఇటు నందమూరి అని ఒక సినిమాలో పాట ఉంది. అలాగే తెలుగు సినిమాకు ఇద్దరూ కంటి వెలుగుగా నిలిచారు. ఇద్దరి మధ్య ఎన్ని పొరపొచ్చాలు ఉన్నా అన్నదమ్ముల కంటే మిన్నగా మసిలారు. ఒకే రంగంలో ఉన్నపుడు వృత్తిరిత్యా అసూయలు ఉండడం సహజం. అంతే కాదు సమాన స్థాయిలో స్టార్స్ గా రాణిస్తున్న వేళ అవి మరింతగా ఉంటాయి.

అయినా కానీ ఎప్పటికపుడు విభేదాలను తుడిచిపెట్టేస్తూ తెలుగు కళామతల్లి కీర్తిని కాపాడుతూ వచ్చారు. భావి తరానికి ఒక సందేశంగా మిగిలారు. అందుకే వారు ఎప్పటికీ తరగని పేరు తెచ్చుకున్నారు. ఎన్టీయార్ ఎక్కువ ఏయన్నార్ ఎక్కువ అని ఫ్యాన్స్ మధ్య తీవ్ర స్థాయిలో వీధి తగాయిదాలు వచ్చిన సందర్భంలో ప్రతీ సారి తాము ఇద్దరమూ ఒక్కటే అని అగ్ర నటులు నిరూపించారు.

ఇద్దరూ కలసి మల్టీస్టారర్ మూవీస్ చేశారు. ఇద్దరూ తమ ఇమేజ్ ని పక్కన పెట్టి మరీ అభిమానులకు ఉత్తమ సందేశాన్ని అందించారు. అలా ప్రపంచ సినీ చరిత్రలో ఎక్కడా లేని విధంగా సమాన స్థాయి కలిగిన ఇద్దరు నటులు కలసి అత్యధికంగా 14 చిత్రాల్లో నటించి రికార్డు క్రియేట్ చేశారు.

ఇక్కడ మరో ముచ్చట చెప్పుకోవాలి. ఎన్టీయార్ సొంత బ్యానర్ లో ఎన్టీయార్ సొంత డైరెక్షన్ లో ఏయన్నార్ నటించారు. అది చాణక్య చంద్రగుప్త చిత్రం. అలాగే ఎన్టీయార్ పెద్దల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు తీసిన చిత్రం సత్యం శివం మూవీలో కూడా ఈ ఇద్దరు నటించి అలరించారు. తమ సినిమా పోస్టర్ల మీద పేడ ముద్దలు అవతల ఫ్యాన్స్ వేస్తున్నారు అని ఆ కలహాలకు ఫుల్ స్టాప్ పలకాలని భావించి రామక్రిష్ణుడు మూవీని ఇద్దరూ సరదాగా చేసి అలరించారు.

ఎన్టీయార్ రాజకీయాల్లోకి వెళ్లాలనుకున్నపుడు ఏయన్నార్ ని కలసి తనతో రావాలని ఆహ్వానించారు. ఆయన సలహాలు తీసుకున్నారు. అంతటి స్నేహ బంధం వారిది. ఇక ఎన్టీయార్ ఏయన్నార్ ఇద్దరూ ఒకేసారి పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు. ఇద్దరూ తెలుగు చిత్ర సీమ సొంత రాష్ట్రానికి రావాలన్న ఉద్దేశ్యంతో హైదరాబాద్ లో స్టూడియోలు కట్టారు. ఇద్దరూ తెలుగు ప్రజల కష్టాలలో నష్టాల్లో ఉంటూ జోళె పట్టి విరాళాలు సేకరించారు.

అటు నిర్మాతలకు దర్శకులకు అండగా ఉంటూ పరిశ్రమ పచ్చగా పదికాలాల పాటు అలరారాని తాపత్రయపడే ఈ ఇద్దరూ తమ మంచితనంతో పెంచిన అభిమానంతో వేలు పెట్టి నడిపించారు. ఈ రోజు తెలుగు చలన చిత్ర సీమ క్రమశిక్షణకు మారుపేరుగా ఉందంటే ఈ ఇద్దరి నడవడిక నడత ప్రధాన కారణం అని చెప్పాలి.

అటువంటి ఎన్టీయార్ నట వారసుడిగా బాలక్రిష్ణ వచ్చారు. మాస్ హీరోగా ఎదిగి దశాబ్దాల పాటు రాణిస్తున్నారు. ఏయన్నార్ నట వారసుడిగ నాగార్జున సైతం స్టార్ హీరోగా ఉన్న్నారు. తరువాత తరంలో ఈ ఇద్దరి మధ్య అంత సాన్నిహిత్యం లేకపోయినా బాహాటంగా ఒకరు అంటే మరొకరు విమర్శలు చేసుకునే పరిస్థితి ఈ రోజుకీ లేదు. మరో వైపు చూస్తే నాగార్జున బాలయ్యల మధ్యన విభేదాలు ఏవో ఉన్నాయని ప్రచారంలో ఉన్నా కూడా ఇద్దరూ బయటకు ఒక్క మాట అనుకున్నది లేదు.

ఇవన్నీ ఒక ఎత్తు అయితే బాలయ్య తాజాగా చేస్న కామెంట్స్ మాత్రం అక్కినేని ఫ్యాన్స్ కుటుంబ సభ్యులనే కాకుండా కళాభిమానులందరికీ బాధించేలా ఉన్నాయి. అక్కినేని నందమూరి రెండు కళ్ళుగా అంతా భావిస్తారు. ఆ ఇద్దరి విషయంలో అందరూ ఒకే మాట మీద ఉంటారు. అక్కినేని ఎన్టీయార్ వారసులు కూడా ఆ విధంగానే ఉండాలన్నది అందరి కోరిక. ఈ రోజు టాలీవుడ్ సినిమా విశ్వవ్యాప్తం అయింది. భాషా భేదం లేకుండా అందరూ కలసి నటిస్తున్నారు.

అలాంటిది ఇద్దరు తెలుగు లెజండరీస్ కి చెందిన వారసులు ఇలా విభేదాలతో రచ్చ చేసుకుంటే అది తెలుగు సినిమా ఖ్యాతి మీదనే మచ్చ పడేలా చేస్తుంది అని అంటున్నారు. తెలుగు సినిమా ప్రాభవం కోసం తన తండ్రుల కీర్తిని ముందుకు తీసుకెళ్ళడం కోసం అయినా నట వారసులు చేతులు కలపాల్సి ఉంది. దానికి ఇదే సరైన సమయం. బాలయ్య మాట తూలరు. దాన్ని మంచి కోసమే మలచుకుని నాగార్జున బాలయ్య చేతులు కలిపి అటు అక్కినేని ఇటు నందమూరి అని అంతా అనుకునేలా తెలుగు సినీ ఖ్యాతిని మరింతగా పెంచాలని అంతా ఆశిస్తున్నారు. పొరపాటు సహజం. అది దిద్దుకుంటేనే అందం. ఆ పని ఆ మహానటుడి వారసుడిగా బాలయ్య చేయడం తక్షణ కర్తవ్యం అంటున్నారు అంతా.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.