'శివ'లో చైన్ పట్టుకుంటే 'ఘోస్ట్'లో కత్తి పట్టాను: నాగ్

Mon Sep 26 2022 09:56:16 GMT+0530 (India Standard Time)

Nagarjuna Ghost Pre Release Event Speech

నాగార్జున తనకి గల రొమాంటిక్ హీరో క్రేజ్ ను అప్పుడప్పుడు గుర్తుచేస్తూ 'బంగార్రాజు' వంటి సినిమాలు చేస్తున్నారు. ఆ తరువాత కాన్సెప్ట్ బేస్డ్ గా సాగే యాక్షన్ సినిమాలకి ప్రాధాన్యతనిస్తూ వెళుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన చేసిన సినిమానే 'ది ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆయన డిఫరెంట్ లుక్ తో కనిపించనున్నారు.సాధారణంగా హాలీవుడ్ లో కనిపించే కంటెంట్ తో ఆయన తెలుగు ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు. ఆల్టోబర్ 5వ తేదీన వివిధ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నారు.

 నిన్న రాత్రి ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కర్నూల్ లో నిర్వహించారు. ఈ  స్టేజ్ పై నాగార్జున మాట్లాడుతూ .. "ఈ సినిమా రిలీజ్ డేట్  కి ఒక ప్రత్యేకత ఉంది. 33 ఏళ్ల క్రితం అక్టోబర్ 5వ తేదీన ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా 'శివ'  సినిమా వచ్చింది. ఆ సినిమాలో నేను 'చైన్' పట్టుకుని వచ్చాను.

ఇప్పుడు అదే రోజున 'ది ఘోస్ట్' సినిమా రానుంది. ఈ సినిమాలో నేను 'కత్తి' పట్టుకుని వస్తున్నాను. ఇది కూడా ఫ్యామిలీ ఎంటర్టైనరే. గతంలో కత్తి  పట్టుకున్న సినిమాలు చాలానే చేశాను. కానీ ఈ సినిమా అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది.

ప్రవీణ్ సత్తారుకి యాక్షన్ అంటే ఇష్టం .. డ్రామా అంటే ఇష్టం. అందువలన ఆ రెండింటిని కలిపి ఆయన ఈ సినిమా చేశాడు. ఈ సినిమాలోని యాక్షన్ సీన్స్ కోసం నేను ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకోవలసి వచ్చింది. పాపం సోనాల్ కి కూడా యాక్షన్ తప్పలేదు .. తను కాలు విరగ్గొట్టుకుంది.

దీనిని బట్టి ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డామనేది మీకు అర్థమైపోయి ఉంటుంది. ఈ ఏడాది ఆరంభంలో చైతూతో కలిసి 'బంగార్రాజు'గా వచ్చాను. త్వరలో అఖిల్ తో కలిసి ఒక సినిమా చేయబోతున్నాను. 'ఘోస్ట్' .. 'ఏజెంట్'  కలిస్తే ఎలా ఉంటుందో .. ఆ సినిమా అలా ఉంటుంది.

నేను .. అఖిల్ చేయనున్న ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కుతుంది. అక్టోబర్ 5వ తేదీన మా సినిమాతో పాటు నా  ఆత్మీయుడు చిరంజీవి సినిమా 'గాడ్ ఫాదర్' కూడా రానుంది. ఈ రెండు సినిమాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.