Begin typing your search above and press return to search.

'బంగార్రాజు'కి భయం లేకుండా పోయిందే!

By:  Tupaki Desk   |   4 March 2021 11:30 PM GMT
బంగార్రాజుకి భయం లేకుండా పోయిందే!
X
'బంగార్రాజు' పేరు వినగానే ఎవరికైనా 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమా గుర్తుకువస్తుంది. నాగార్జున కథానాయకుడిగా రూపొందిన ఈ సినిమాకి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించాడు. గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా, 2016 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథాకథనాల పరంగా .. పాటల పరంగా ఈ సినిమా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. 'బంగార్రాజు' పాత్రలో పల్లెటూరి బుల్లోడుగా నాగార్జున చేసిన సందడిని అభిమానులు ఇప్పటికీ మరిచిపోలేదు. నాగార్జున కెరియర్లోనే అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది.

అప్పటి నుంచి నాగార్జున 'బంగార్రాజు' పాత్ర పేరునే టైటిల్ గా చేసుకుని, గ్రామీణ నేపథ్యంలోనే ఒక సినిమాను చేయాలని చూస్తున్నారు. కల్యాణ్ కృష్ణ కూడా అందుకు సంబంధించిన స్క్రిప్ట్ పైనే చాలాకాలంగా కసరత్తు చేస్తూ వస్తున్నాడు. అనేక అవరోధాల తరువాత ఈ కథకి నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. త్వరలోనే ఈ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళ్లడానికి రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్టు నాగార్జున చెప్పారు. ఆ మాట వినగానే ఆయన అభిమానులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

ఎందుకంటే వచ్చే ఏడాది సంక్రాంతికి పవన్ కల్యాణ్ సినిమా బరిలో ఉండనుంది. క్రిష్ దర్శకత్వంలో చారిత్రక నేపథ్యతో రూపొందుతున్న సినిమాలో పవన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆయన వజ్రాల దొంగగా కనిపించనున్నాడు. పవన్ తన కెరియర్లో చేస్తున్న తొలి చారిత్రక చిత్రం కావడంతో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక వచ్చే సంక్రాంతికే మహేశ్ బాబు కూడా 'సర్కారువారి పాట' పాడనున్నాడు. తొలిసారిగా ఆయన సరసన కీర్తి సురేశ్ నటిస్తుండటం అందరిలో ఆసక్తిని పెంచుతోంది.

మరి ఇలాంటి పోటీ వాతావరణంలో 'బంగార్రాజు' భయం లేకుండా రంగంలోకి దిగుతున్నాడు. సంక్రాంతికి ఎన్ని సినిమాలు థియేటర్లలో దిగినా, వసూళ్ల విషయంలో కంగారు పడవలసిన పనిలేదనే మాట నాగార్జున ఎప్పటినుంచో చెబుతూ వస్తున్నారు. వరుస సెలవుల కారణంగా అన్ని సినిమాలకు ఆదరణ లభిస్తుందనేది ఆయన అభిప్రాయం. ఇక పవన్ .. మహేశ్ బాబు చేస్తున్న సినిమాల జోనర్లు వేరు .. 'బంగార్రాజు' నేపథ్యం వేరు. తన సినిమా పండుగ వాతావరణానికి కాస్త దగ్గరగా ఉంటుంది గనుక, టెన్షన్ పడాల్సిన పనిలేదనేది నాగార్జున ధీమా అయ్యుంటుంది.