అక్కినేని రాజుల జోరు.. పండక్కు పక్కా!

Mon Sep 13 2021 15:01:09 GMT+0530 (IST)

Nagarjuna Bangarraju Movie Update

అక్కినేని హీరోలు నాగార్జున మరియు నాగచైతన్య కలిసి నటిస్తున్న బంగార్రాజు సినిమా చిత్రీకరణ చాలా స్పీడ్ గా జరుగుతోంది. ఇటీవలే ఈ సినిమా ను ప్రారంభించినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఇంతలోనే షెడ్యూల్ మీద షెడ్యూల్ ను ముగించేస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో మొదటి షెడ్యూల్ ఆ వెంటనే మరో షెడ్యూల్ ను కూడా ముగించేసిన దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీ షెడ్యూల్ కు సిద్దం అయ్యాడు. రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక బంగార్రాజు సెట్టింగ్ లో రేపటి నుండి రెగ్యులర్ షూటింగ్ జరుగబోతుంది. ఈ షెడ్యూల్ సినిమాకు చాలా కీలకమైన సన్నివేశాలను కలిగి ఉందని అంటున్నారు. సినిమాలోని ఇద్దరు హీరోల కాంబో సన్నివేశాలు ఈ షెడ్యూల్ లోనే ప్లాన్ చేశారట. మొత్తానికి రామోజీ ఫిల్మ్ సిటీలో ఒక ప్రముఖ షెడ్యూల్ తర్వాత సినిమా చిత్రీకరణ మెజార్టీ పార్ట్ ముగిసినట్లే అంటూ అక్కినేని ఫ్యామిలీ సన్నిహితుల ద్వారా సమాచారం అందుతోంది.బంగార్రాజు సినిమా చిత్రీకరణ చాలా స్పీడ్ గా చేస్తున్నారు. గతంలో వచ్చిన సోగ్గాడే చిన్ని నాయన సినిమా ను సంక్రాంతికి తీసుకు వచ్చాడు. సంక్రాంతికి సరిగ్గా సూట్ అయ్యే ఫ్యామిలీ ఎంటర్ టైనర్ మూవీ ఇది అంటూ గతంలోనే సోగ్గాడే చిన్ని నాయనకు మంచి మార్కులు పడ్డాయి. అందుకే బంగార్రాజు సినిమా కూడా తప్పకుండా సంక్రాంతికే విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. 2022 సంక్రాంతికి రాధే శ్యామ్.. భీమ్లా నాయక్.. సర్కారు వారి పాట చిత్రాలతో పాటు మరి కొన్ని సినిమాలు కూడా విడుదల కాబోతున్నాయి. అయినా కూడా గత సినిమా అనుభవం మరియు సెంటిమెంట్ దృష్ట్యా బంగార్రాజు సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేయాలని భావిస్తున్నారు. అదే కనుక జరిగితే మంచి వసూళ్లను దక్కించుకుంటుంది అనే నమ్మకంను వ్యక్తం చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు.

నాగచైతన్యకు జోడీగా బంగార్రాజు లో ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి నటిస్తున్న విషయం తెల్సిందే. భారీ ఎత్తున అంచనాలున్న బంగార్రాజు లో బంగార్రాజుకు జోడీ ఎవరు అనే విషయంలో స్పష్టత దక్కడం లేదు. నాగార్జునకు గతంలో రమ్యకృష్ణ జోడీగా నటించారు. బంగార్రాజులో కూడా ఆమెనే అనుకున్నా కూడా ఆ తర్వాత నిర్ణయం మారింది అనే వార్తలు వచ్చాయి. కాని ఆ వార్తలకు అధికారిక క్లారిటీ మాత్రం దక్కలేదు. తండ్రి కొడుకులు కలిసి నటిస్తున్న సినిమా అవ్వడం వల్ల సహజంగానే అంచనాలు పీక్స్ లో ఉంటాయి. కనుక ఈ సినిమా తప్పకుండా ఘన విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు అంటున్నారు. బంగార్రాజుకు ఉన్న క్రేజ్ నేపథ్యంలో సినిమా కు ఎంత  పోటీ ఉన్నా కూడా ఖచ్చితంగా రావాల్సిన వసూళ్లు వస్తాయి. అందుకే బంగార్రాజు పక్కాగా పండక్కు వచ్చేలా ఉన్నాడు అంటున్నారు.