జబర్ధస్త్ నుంచి తప్పుకోవడానికి కారణం

Thu Nov 21 2019 22:03:21 GMT+0530 (IST)

Nagababu On about Jabardasth Show

మెగా బ్రదర్ నాగబాబు జడ్జిగా జబర్ధస్త్ రియాలిటీ షో ఎంత పెద్ద సక్సెసైందో తెలిసిందే. ఆయన సారథ్యంలో ఏడున్నర సంవత్సరాల పాటు ఈ షోని విజయవంతంగా నడిపారు. జబర్థస్త్ వెనక శ్యాంప్రసాద్ రెడ్డి తపన ఎంతగా ఉందో సక్సెస్ కోసం టీమ్ వర్క్ చేయించడంలో నాగబాబు అంతే శ్రమించారని చెబుతారు. ఇక రోజాతో కలిసి జడ్జిగా ఆయన ఈ షోకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అయితే నాగబాబు ఈ షో నుంచి తప్పుకుంటున్నారని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. ఇంతకుముందు జనసేనలో చేరి తమ్ముడు పవన్ కల్యాణ్ కి సపోర్టునిచ్చిన క్రమంలో ఆయన ఇక జబర్ధస్త్ షో చేయరని ప్రచారమైంది.అయితే నాగబాబు తిరిగి షోలోకి రీఎంట్రీ ఇచ్చారు. ఇన్నాళ్లు ఆయనే జడ్జిగా కొనసాగారు. ఎట్టకేలకు ఈ శుక్రవారం ఎపిసోడ్ నుంచి ఆయన కనిపించరని తెలుస్తోంది. ఈ సంగతిని నాగబాబు స్వయంగా వెల్లడించారు. ఏడున్నరేళ్ల పాటు ఈ షోలో నిర్విరామంగా కనిపించే అవకాశం కల్పించిన శ్యాంప్రసాద్ రెడ్డి బృందానికి ఆయన ధన్యవాదాలు చెబుతూ తాను ఎగ్జిట్ అవుతున్నానని తెలిపారు. ఫిబ్రవరి 2013 నుంచి ఆగస్ట్ 2019 వరకూ ఈ షోలో కొనసాగానని నాగబాబు వెల్లడించారు. క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్లనే తాను విడిచి వెళుతున్నానని అన్నారు.

అయితే తాను ఈ షో నుంచి తప్పుకోవడానికి పారితోషికం ఒక కారణమని బయట ప్రచారమవుతోంది. దీనిపైనా నాగబాబు క్లారిటీనిచ్చారు. నేను ఈ షోలో చేరడానికి పారితోషికం కారణం కాదు. అలాగే వదిలి వెళ్లడానికి కూడా అది కారణం కాదు. వంద శాతం పారితోషికం కారణం కాదు. పరిస్థితులే బయటకు వెళ్లేలా చేశాయి. మధ్యలో ఇలా వెళతానని అనుకోలేదు. కానీ తప్పలేదు! అని అన్నారు. జబర్ధస్త్ షోలో చేరక ముందు తాను ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నానని ఈ షో ఆదుకుందని అన్నారు. తనకు కామెడీపై ఉన్న ఆసక్తి చూసి శ్యాంప్రసాద్ రెడ్డి అవకాశం ఇచ్చారని నాగబాబు వెల్లడించారు. జబర్ధస్త్ షో గురించి తాను ఏనాడూ వ్యతిరేకంగా ఎక్కడా చెప్పలేదని .. అలాగే వివాదాల్ని కోరుకోలేదని తెలిపారు.