Begin typing your search above and press return to search.

'థ్యాంక్యూ' సినిమాలో తప్పులు ఉన్నాయన్న చైతన్య..!

By:  Tupaki Desk   |   11 Aug 2022 2:45 AM GMT
థ్యాంక్యూ సినిమాలో తప్పులు ఉన్నాయన్న చైతన్య..!
X
అక్కినేని నాగచైతన్య ఇటీవల 'థాంక్యూ' సినిమాతో ప్లాప్ ను మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. తొలి రోజే మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో నాలుగు వరుస హిట్స్ తో జోష్ మీదున్న చైతూ కి బ్రేక్ పడినట్లయింది. ఈ నేపథ్యంలో తాజాగా 'థాంక్యూ' ఫలితంపై యువసామ్రాట్ స్పందించారు.

నాగ చైతన్య గత కొన్ని రోజులుగా 'లాల్ సింగ్ చడ్డా' మూవీ ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నారు. ఇది అతనికి బాలీవుడ్ డెబ్యూ. ఇందులో అమీర్ ఖాన్ హీరోగా నటించగా.. బాలరాజు బోడి అనే కీలక పాత్రలో చైతూ కనిపించనున్నారు. ఈరోజు (ఆగస్టు 11) గురువారం ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన చై పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.

ఎప్పుడూ నిజాయితీగా సమాధానాలు చెప్పే నాగ చైతన్య.. 'థ్యాంక్యూ' సినిమా ఫలితం తనను బాగా నిరాశపరిచిందని అంగీకరించారు. కానీ విజయాలు వైఫల్యాలు ఒక నటుడి జీవితంలో భాగమే అని.. దాన్నుంచి మూవ్ ఆన్ అయ్యానని తెలిపారు.

ప్రతి విజయం, అపజయం నుంచి పాఠాలు నేర్చుకుని జీవితంలో ముందుకు సాగుతానని నాగ చైతన్య పేర్కొన్నారు. 'థాంక్యూ' సినిమా ఫెయిల్ అయ్యిందని అంగీకరించడమే కాకుండా.. అందులో తప్పులు ఉన్నాయని అభిప్రాయపడ్డారు. తన తదుపరి సినిమాతో స్ట్రాంగ్ గా వస్తానని చైతూ హామీ ఇచ్చాడు. ఇకపోతే 'థాంక్యు' సినిమా ఈరోజు నుంచే అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.

చైతన్య మాట్లాడుతూ.. ''అవును. 'థాంక్యూ' రిజల్ట్ నన్ను బాగా డిజప్పాయింట్ చేసింది. అందులో కొన్ని తప్పులు ఉన్నాయి. ఒక యాక్టర్ కెరీర్ లో సక్సెస్ లు ఫెయిల్యూర్స్ భాగమే. ఫెయిల్యూర్స్ ని అధిగమించి ముందుకు వెళ్ళాలి. నేను వాటి నుంచి ఎంతో నేర్చుకుంటాను. ఈ సినిమా నుంచి కూడా నేర్చుకున్నాను. నెక్స్ట్ మూవీతో స్ట్రాంగ్ గా తిరిగి వస్తాను'' అని చెప్పుకొచ్చారు.

'లాల్ సింగ్ చద్దా' సినిమాలో తన పాత్ర కేవలం 20 నుండి 30 నిమిషాలు ఉంటుందని.. అయినప్పటికీ సినిమా అంతా ఆ మూడ్ క్యారీ అవుతుందని నాగచైతన్య చెప్పారు. హిందీలో ఇది నా ఫస్ట్ డబ్ల్యు మూవీ. అక్కడ కూడా నా మార్కెట్ పెరుగుతుంది కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అదే సమయంలో నాకు కాస్త నెర్వస్ గానూ ఉంది అని అన్నారు. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని చెప్పారు.

అప్పుడప్పుడు స్పెషల్ రోల్స్ చేస్తే ఒక యాక్టర్ గా ఇంకా షైన్ అవుతామని నేను నమ్ముతాను. అందుకే అవకాశం వచ్చినప్పుడు కొన్ని ప్రయోగాలు ట్రై చేయాలి. అప్పుడే మనం ఎలాంటి రోల్ అయినా నిరూపించుకోగలడని ఆడియన్స్ నమ్ముతారు. స్పెషల్ క్యారెక్టర్స్ చేయడానికి నేను ఎప్పుడూ సిద్దమే అని చైతూ తెలిపారు.

ఇక నాగచైతన్య తన తదుపరి చిత్రాన్ని వెంకట్ ప్రభు దర్శకత్వంలో చేయనున్నారు. ఇది తెలుగు తమిళ బాషల్లో రూపొందే బైలింగ్విల్ మూవీ. చై ఇందులో పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తామని చైతూ తెలిపారు.