సమంత అడుగుజాడల్లో నడుస్తున్న చైతూ..!

Fri Sep 24 2021 09:00:01 GMT+0530 (IST)

Naga Chaitanya following Samantha

డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ హవా మొదలైన తర్వాత ఫిలిం మేకర్స్ సరికొత్త కంటెంట్ ని ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో ఓటీటీలదే రాజ్యమని భావించిన స్టార్ హీరోహీరోయిన్లు సైతం వెబ్ సిరీస్ లలో నటించడానికి ఆసక్తి చూపుతున్నారు. స్టార్డమ్ - థియేటర్ మార్కెట్ వంటివి దృష్టిలో పెట్టుకొని డిఫరెంట్ రోల్స్ చేయలేకపోతున్న స్టార్స్ అందరికీ.. ఓటీటీలు అలాంటి అవకాశాన్ని అందిస్తున్నాయి. అందుకే నెగిటివ్ రోల్స్ చేయడానికి కూడా స్టార్స్ వెనుకాడటం లేదు.ఇటీవల అగ్ర కథానాయిక సమంత అక్కినేని 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ద్వారా ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. దర్శకద్వయం రాజ్ & డీకే రూపొందించిన ఈ సిరీస్ లో సామ్ నెగిటివ్ రోల్ లో నటించి అదరగొట్టేసింది. లైంగిక వివక్షకు గురైన రాజీ అలియాస్ రాజ్యలక్ష్మి అనే తమిళ ఈలం సోల్జర్ పాత్రలో సమంత అద్భుతంగా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. యాక్షన్ సీన్స్ తో పాటుగా బోల్డ్ సన్నివేశాల్లో కూడా నటించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. 'ఫ్యామిలీ మ్యాన్ 2' కి మెయిన్ ఎస్సెట్ట్ గా మారిపోయింది సామ్. అయితే ఇప్పుడు సతీమణి సమంత దారిలో చైతూ కూడా ఓటీటీ వరల్డ్ లో అడుగుపెట్టనున్నాడు.

ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో కోసం యువ సామ్రాట్ నాగచైతన్య ఓ హారర్ వెబ్ సిరీస్ చేయడానికి రెడీ అయ్యారు. ఈ విషయాన్ని 'లవ్ స్టోరీ' సినిమా ప్రమోషన్స్ లో చైతన్య రివీల్ చేశారు. అందులో తను నెగెటివ్ రోల్ లో కనిపించనున్నట్లు కూడా తెలిపారు. స్క్రిప్ట్ అద్భుతంగా ఉండటంతో వెంటనే నెగిటివ్ రోల్ చేయడానికి అంగీకరించానని చై చెప్పారు. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కనుంది.

విక్రమ్ కుమార్ ఇంతకు ముందు అక్కినేని ఫ్యామిలీకి 'మనం' వంటి మరపురాని క్లాసిక్ చిత్రాన్ని అందించారు. ప్రస్తుతం నాగచైతన్యతోనే ''థాంక్యూ'' అనే థ్రిల్లర్ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో ఇద్దరూ కలిసి వెబ్ సిరీస్ చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ డిసెంబర్ నెలలో సెట్స్ మీదకు వెళ్లే అవకాశం ఉంది. సమంత 'ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ లో నెగెటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఇప్పుడు సతీమణి ని ఫాలో అవుతున్న చైతూ హారర్ వెబ్ సిరీస్ లో ఏ మేరకు మెప్పిస్తారో చూడాలి.