Begin typing your search above and press return to search.

వారితో పాటు చైతూ కూడా 'క్యూ'

By:  Tupaki Desk   |   15 May 2021 9:30 AM GMT
వారితో పాటు చైతూ కూడా క్యూ
X
గత ఏడాది కాలంలో సినిమా థియేటర్లు సరిగ్గా రన్ అయ్యింది రెండు మూడు నెలలు మాత్రమే. థియేటర్లు రన్‌ అవుతున్నాయి అనుకుంటున్న సమయంలో కరోనా సెకండ్‌ వేవ్ కారణంగా మళ్లీ థియేటర్లు మూత పడ్డాయి. థియేటర్లు రన్ కాకున్నా షూటింగ్స్ ఏదో మాదిరిగా జరుగుతున్నాయి. దాంతో పలువురు యంగ్‌ హీరోలు ఒకటి కాదు రెండు కాదు అంతకు మించి సినిమాలు సిద్దం చేసి పెడుతున్నారు. పరిస్థితులు కుదుట పడ్డ వెంటనే బ్యాక్ టు బ్యాక్‌ బాక్సాఫీస్ వద్ద సందడికి పలువురు హీరోలు సిద్దంగా ఉన్నారు. ఆ జాబితాలో ఇప్పుడు నాగ చైతన్య కూడా చేరిపోయాడు.

నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన 'లవ్‌ స్టోరీ' సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. డేట్‌ కూడా ఫిక్స్ చేసిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లో విడుదల అనగా వాయిదా పడింది. లవ్‌ స్టోరీ సినిమా విడుదల కాకుండానే థ్యాంక్యూ సినిమాను చైతూ పూర్తి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న థ్యాంక్యూ సినిమా ఇటీవలే యూరప్‌ షెడ్యూల్‌ పూర్తి చేసుకుని వచ్చింది. త్వరలో తదుపరి షెడ్యూల్‌ మొదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మెజార్టీ పార్ట్‌ షూటింగ్‌ పూర్తి అయ్యిందని తెలుస్తోంది. ఈ ఏడాదిలోనే థ్యాంక్యూ సినిమా ను విడుదల చేసేలా ప్లాన్‌ చేస్తున్నారు.

ఈ రెండు సినిమాలతో పాటు బాలీవుడ్‌ లో లాల్‌ సింగ్ చద్దా సినిమా లో అమీర్ ఖాన్ తో నాగ చైతన్య సినిమా చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా షూటింగ్‌ లో చైతూ జాయిన్ అవ్వాల్సి ఉంది. అన్ని అనుకున్నట్లుగా జరిగితే అమీర్ ఖాన్‌ మూవీ కూడా ఈ ఏడాదిలోనే రాబోతుంది. అంటే చైతూ నటించిన మూడు సినిమాలు కూడా కాస్త గ్యాప్‌ లో బ్యాక్ టు బ్యాక్ రాబోతున్నాయి. పలువురు హీరోలు కూడా వరుసగా తమ సినిమాలతో వచ్చేందుకు సిద్దం అవుతున్నారు. మొత్తానికి కరోనా కాస్త తగ్గుముకం పట్టి థియేటర్లు ఓపెన్ అయితే సినిమాలు క్యూ కట్టడం ఖాయం.