బాలయ్య - నాగబాబు వ్యాఖ్యల ప్రభావం 'ఆర్.ఆర్.ఆర్' పై పడనుందా...?

Fri May 29 2020 18:30:36 GMT+0530 (IST)

Naga Babu Comments on Balakrishna

ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి బాలకృష్ణ - మెగా బ్రదర్ నాగబాబు వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనిపై ఇండీస్ట్రీ ప్రముఖులు స్పందిస్తూ పరస్పర విరుద్ధ కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఎంత దూరం వెళ్తాయో చూడాలి. అయితే ఇప్పుడు ఈ నందమూరి మెగా యాక్టర్ల మాటల యుద్ధం ఒక సినిమా మీద పడుతుందేమో అని సినీ అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే నందమూరి హీరో తారక్ మెగా హీరో రామ్ చరణ్ కలిసి నటిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్'. ఎన్నో ఏళ్ళ నుండి మెగా నందమూరి ఫ్యాన్ వార్స్ మనందరికి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి - బాలయ్య సినిమాలో ఒకే సీజన్ లో బరిలోకి దిగిన ప్రతిసారి ఈ వార్ తారాస్థాయికి చేరుతూ ఉంటుంది. దీంతో ఈ రెండు ఫ్యామిలీస్ కి పడదు అని కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. అయితే దర్శకధీరుడు రాజమౌళి ఈ రెండు ఫ్యామిలీ హీరోలను ఒకే స్క్రీన్ మీద చూపించబోతున్నాడు. దీంతో మెగా నందమూరి ఫ్యాన్ వార్ కి ఫుల్ స్టాప్ పడినట్లే అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు బాలయ్య - నాగబాబు కామెంట్స్ వలన మళ్ళీ సోషల్ మీడియాలో వారి అభిమానుల మధ్య కామెంట్ల యుద్ధం స్టార్ట్ అయింది.ఈ నేపథ్యంలో దీని ఎఫెక్ట్ ఇప్పుడు 'ఆర్.ఆర్.ఆర్' మీద పడుతుందేమో అని సినీ అభిమానులు డౌట్ పడుతున్నారు. ఇప్పటికే ఆర్.ఆర్.ఆర్ లో స్క్రీన్ స్పేస్ గురించి మెగా నందమూరి ఫ్యాన్స్ గొడవలు పెట్టుకుంటారేమో అని డౌట్ పడుతుంటే.. మళ్ళీ ఇప్పుడు ఈ ఇష్యూ మరో సమస్య తెచ్చి పెడుతుందేమో అని కలవరపడుతున్నారు. కాకపోతే ఎన్టీఆర్ - రామ్ చరణ్ ఇండస్ట్రీలో ఎంత సాన్నిహిత్యంగా ఉంటారో అందరికి తెలిసిందే. అందువలన వీరిద్దరూ రేపు మళ్ళీ కలిసి షూటింగులో పాల్గొనడానికి ఇబ్బంది పడరని చెప్పవచ్చు. వీరి మధ్య ఇగోలు కూడా ఉండవనేది అందరూ అంగీకరించే విషయమే. నిన్న ఎన్టీఆర్ జయంతి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా చరణ్ నివాళులు అర్పించడం చూసాం. వయసులో చిన్న వారైన చరణ్ - తారక్ లే కలిసి మెలిసి ఉంటుంటే సీనియర్ యాక్టర్స్ అయిన చిరంజీవి బాలయ్య నాగబాబులకు ఈ ఇగోలు ఎందుకని సినీ అభిమానులు ప్రశ్నిస్తున్నారు. అయినా మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఇంట్లో జరిగే మీటింగ్ కి బాలయ్యని పిలిస్తే ఈ గొడవే ఉండేది కాదని.. బాలయ్య కూడా అలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉంటే బాగుండేదని వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా మెగా నందమూరి యాక్టర్ల మాటల యుద్ధం ప్రభావం 'ఆర్.ఆర్.ఆర్' పై పడకుండా ఉండాలని వారు కోరుకుంటున్నారు.