కొరటాలతో ఎన్టీఆర్ రివేంజ్ డ్రామా!

Mon Jan 17 2022 08:27:28 GMT+0530 (IST)

NTR Revenge Drama with koratala

'అరవింద సమేత' బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తరువాత ఎన్టీఆర్ 'ఆర్ ఆర్ ఆర్' సినిమా సెట్స్ పైకి వెళ్లిపోయాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగు విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. దాంతో ఎన్టీఆర్ నుంచి మూడేళ్లుగా మరో సినిమా లేదు. దాంతో అభిమానులంతా ఆయన సినిమా కోసం వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారమే అయితే 'ఆర్ ఆర్ ఆర్' ఈ పాటకి విడుదలైపోవాలి. కొరటాలతో ఎన్టీఆర్ అనుకున్న సినిమా షూటింగు ముగింపు దశలో ఉండాలి. కానీ ఈ రెండూ జరగలేదు.



ఇక ఇప్పుడు కరోనా కారణంగా వాయిదా పడిన 'ఆర్ ఆర్ ఆర్' ఎప్పుడు విడుదల కానుందనేది అధికారిక ప్రకటన రావలసి ఉంది. ఈ వేసవికి రావొచ్చని అంటున్నారు. ఇక ఆల్రెడీ కొరటాల 'ఆచార్య'ను రిలీజ్ కి రెడీ చేశాడు గనుక తరువాత ప్రాజెక్టుపై ఆయన దృష్టి పెట్టాడు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ సినిమా పనులతోనే బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ఆయన రెడీ అవుతున్నాడు. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టును మొదలుపెడదామనే ఎన్టీఆర్ కూడా తొందర చేస్తున్నాడట. ఆ దిశగానే ఈ ప్రాజెక్టులో కదలిక మొదలైందని అంటున్నారు.

ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయడానికి ఆయన రంగంలోకి దిగిపోయాడు. ఇక ఈ సినిమా కోసం ఆయన అనిరుథ్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నాడు. త్వరలోనే మ్యూజిక్ సిటింగ్స్ మొదలు పెట్టనున్నారట. కొరటాలకి ఇంతవరకూ అపజయమనేది తెలియదు. ఒక సినిమాకి మించి మరొక సినిమాను విజయం వైపుకు నడిపిస్తూ ఆయన ముందుకు వెళుతున్నాడు. గతంలో ఆయన ఎన్టీఆర్ తో 'జనతా గ్యారేజ్' చేసి ఉండటం వలన సహజంగానే ఈ ప్రాజెక్టుపై అంచనాలు ఉన్నాయి. ఈ కథ ఏ జోనర్లో నడవనుందనే ఆసక్తి అభిమానుల్లో ఉంది.

ఈ కథ రివేంజ్ డ్రామాగా కొనసాగుతుందని అంటున్నారు. ఎన్టీఆర్ మార్క్ యాక్షన్ .. ఎమోషన్ తో పాటు కొరటాల తరహా సందేశం కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇక కథానాయిక విషయంలోను ఇంతవరకూ క్లారిటీ లేదు. రష్మికను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. ఇక కీర్తి సురేశ్ పేరు కూడా పరిశీలనలో ఉందని చెప్పుకుంటున్నారు. మరి ఈ ఇద్దరిలో ఒకరిని తీసుకుంటారా? లేదంటే వేరెవరినైనా సెట్ చేస్తారా? అనేది చూడాలి. ఇక ఈ సినిమా తరువాత ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ ప్రాజెక్ట్ ఉండనుందని అంటున్నారు.