Begin typing your search above and press return to search.

'మోస్ట్ పాపులర్ స్టార్' గా టాప్ లేపిన తారక్..!

By:  Tupaki Desk   |   16 May 2022 1:53 PM GMT
మోస్ట్ పాపులర్ స్టార్ గా టాప్ లేపిన తారక్..!
X
బాలీవుడ్‌ లోని విశ్వసనీయ మీడియా సంస్థల్లో ఒకటిగా భావించే ఓర్మాక్స్ మీడియా.. ప్రతీ నెల సోషల్ మీడియాలో వివిధ భాషల్లో మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాను విడుదల చేస్తూ ఉంటుంది. అయితే తాజాగా ఏప్రిల్ నెల తెలుగు టాప్ స్టార్స్ లిస్ట్ ను రిలీజ్ చేసింది.

ఓర్మాక్స్ మీడియా వదిలిన జాబితాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నెం.1 స్థానంలో నిలిచారు. 'ఆర్.ఆర్.ఆర్' సినిమాలో అద్భుతమైన నటన కనబరిచిన తారక్.. 'కొమురం భీముడో' పాటతో నార్త్ ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టారు. సరికొత్త పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన క్రమంలో.. తన చుట్టూ ఏర్పడిన బజ్ కారణంగా అగ్రస్థానంలో నిలిచాడని తెలుస్తుంది.

పాన్ ఇండియా వైడ్ పాపులారిటీ తెచ్చుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మరియు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా రెండు - మూడు స్థానాల్లో నిలిచారు. మరో RRR హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాత్రం నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నాడు.

సినిమా చేసినా చేయకపోయినా గత కొన్నేళ్లుగా అగ్రస్థానంలో ఉన్న సూపర్ స్టార్ మహేష్ బాబు.. ఏప్రిల్ నెలలో ఐదో స్థానానికి పడిపోయాడు. ఇటీవల 'భీమ్లా నాయక్' తో ప్రేక్షకులను పలకరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 6వ స్థానానికి పరిమితం అవడం గమనార్హం.

ఇక్కడ మరో ఆసక్తికరమైన పరిణామం ఏంటంటే.. నాని మరియు విజయ్ దేవరకొండ వంటి ఇద్దరు యంగ్ హీరోలు ఈ జాబితాలో మెగాస్టార్ చిరంజీవి కంటే ముందు ఉన్నారు. నేచురల్ స్టార్ నాని 7వ స్థానంలో.. సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ 8వ స్థానంలో నిలిచారు.

ఏప్రిల్ నెలంతా 'ఆచార్య' ప్రమోషన్స్ తో సందడి చేసిన చిరు 9వ స్థానంతో సరిపెట్టుకోగా.. మాస్ మహారాజా రవితేజ వరుస సినిమాలు అప్డేట్స్ తో 10వ స్థానంలో ఉన్నాడు. మరి మే నెలలో ఓర్మాక్స్ మీడియా వదిలే జాబితాలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చూడాలి.

పాపులర్ స్టార్ గా జూనియర్ ఎన్టీఆర్ నిలవడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. మే 20న యంగ్ టైగర్ పుట్టినరోజు ఉండటంతో బర్త్ డే హ్యాష్ ట్యాగ్స్ తో ట్రెండ్ చేయడానికి రెడీ అయ్యారు. ఇక ఫ్యాన్స్ ఉత్సాహాన్ని రెట్టింపు చేయడానికి తారక్ నటిస్తున్న రెండు సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి.

కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కనున్న #NTR30 పూర్తి వివరాలతో పాటుగా ఫస్ట్ లుక్ వచ్చే అవకాశం ఉంది. అలానే ప్రశాంత్ నీల్ తో తారక్ చేయనున్న #NTR31 అఫిషియల్ అనౌన్స్ మెంట్ రానుందని టాక్ వినిపిస్తోంది. అదే రోజున ఎన్టీఆర్ - రామ్ చరణ్ కలిసి నటించిన RRR మూవీ ZEE5 ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్‌ గా ప్రదర్శించబడనుంది.