మమ్ముట్టిని రంగంలోకి దింపుతున్న కొరటాల?

Tue May 18 2021 10:00:01 GMT+0530 (IST)

NTR 30 With Director Koratala Siva

టాలీవుడ్ దర్శకుల జాబితాలో కొరటాలకి ఒక ప్రత్యేకత ఉంది. కథకి సంబంధించిన ప్రతి అంశాన్ని కొత్తగా చూపించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు. ఆ పాత్రలకి తగిన నటీనటులను మాత్రమే ఎంచుకుంటూ ఉంటారు. అందుకోసం ఆయన ఇతర భాషలకి చెందిన స్టార్లను కూడా తీసుకొస్తుంటారు. అలా ఆయన ఎన్టీఆర్ తో చేయనున్న సినిమా కోసం మమ్ముట్టిని రంగంలోకి దింపే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనే ఒక టాక్ ఫిల్మ్ నగర్లో జోరుగా వినిపిస్తోంది.గతంలో 'మిర్చి' సినిమా కోసం ఆయన సత్యరాజ్ ను తీసుకున్నారు. ఆ తరువాత చేసిన 'జనతా గ్యారేజ్' కోసం మోహన్ లాల్ ను ఎంపిక చేసుకున్నారు. ఇక 'భరత్ అనే నేను' కోసం శరత్ కుమార్ ను తీసుకొచ్చారు. ప్రస్తుతం చేస్తున్న 'ఆచార్య' కోసం బెంగాలీ నటుడు జిషు సేన్ గుప్తాను ఒక కీలకమైన పాత్ర కోసం తీసుకున్నారు. ఇలా మొదటి నుంచి కూడా కొరటాల సినిమాల్లో ఇతర భాషలకి చెందిన స్టార్లు కనిపిస్తూనే వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మమ్ముట్టి పేరు తెరపైకి వచ్చింది.

మలయాళంలో మమ్ముట్టికి గల క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పని లేదు. అనువాద చిత్రాల ద్వారా ఇక్కడి ప్రేక్షకులకు మమ్ముట్టి బాగా తెలుసు. అంతేకాదు .. స్వాతికిరణం .. సూర్యపుత్రులు వంటి స్ట్రయిట్ సినిమాలు కూడా చేశారు. ఆ మధ్య తెలుగులో వచ్చిన 'యాత్ర' సినిమా ద్వారా ఈ జనరేషన్ వారికి కూడా ఆయన చేరువయ్యారు. అలాంటి మమ్ముట్టి మళ్లీ ఇప్పుడు కొరటాల తదుపరి సినిమాలో కనిపించే ఛాన్స్ ఉందని చెప్పుకుంటున్నారు. ఇందులో వాస్తవమెంతన్నది చూడాలి మరి.