Begin typing your search above and press return to search.

చైల్డ్ ఆర్టిస్ట్ ల‌ని అలా చూపిస్తే ఇక అంతే!

By:  Tupaki Desk   |   25 Jun 2022 9:30 AM GMT
చైల్డ్ ఆర్టిస్ట్ ల‌ని అలా చూపిస్తే ఇక అంతే!
X
చిన్న పిల్ల‌ల‌తో సీరియ‌ల్స్‌, సినిమాల్లో, రియాలిటీ షోల్లో, టీవీల్లో, ఓటీటీ ప్లాట్ ఫామ్, సోష‌ల్ మీడియా లో చూపించే కంటెంట్ ల‌పై (NCPCR) నేష‌న‌ల్ క‌మీష‌న్ ఫ‌ర్ ప్రొడ‌టెక్ష‌న్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కీల‌క ఆదేశాల‌ను తాజాగా జారీ చేసింది. పిల్ల‌ల‌ని అభ్యంత‌ర‌కరంగా, ఇబ్బంది క‌రంగా చూపించే ధోర‌ణి ఇటీవ‌ల ఎక్కువైపోయింది. దీనిపై విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న నేప‌థ్యంలో నేష‌న‌ల్ క‌మీష‌న్ ఫ‌ర్ ప్రొడ‌టెక్ష‌న్ ఆఫ్ చైల్డ్ రైట్స్ కీల‌క ఆదేశాల‌ను జారీ చేయ‌డం ప్రాధాన్య‌త‌ను సంత‌రించుకుంది.

తాజాగా ప్ర‌క‌టించిన నూత‌న గైడ్ లైన్స్ సినిమాలు, టీవి, రియాలిటీ షో, షార్ట్ ఫిల్మ్‌, ఓటీటీ ప్లాట్ ఫామ్స్, వార్తా ఛాన‌ల్స్‌, సోష‌ల్ మీడియా ప్లాట్ ఫామ్ ..ల‌కు కొత్త గైడ్ లైన్స్ వ‌ర్తిస్తాయ‌ని NCPCR స్ప‌ష్టం చేసింది. అంతే కాకుండా సైబ‌ర్ చ‌ట్టాలు, పిల్ల‌ల హ‌క్కుల‌కు సంబంధించిన ఇతర చ‌ట్టాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న త‌రువాతే నూత‌న రూల్స్ ని సిద్ధం చేసిన‌ట్టుగా క‌మీష‌న్ తెలియ‌జేసింది. NCPCR తాజా రూల్స్ ప్ర‌కారం నిబంధ‌న‌లు ఈ విధంగా వున్నాయి.

-మూడు నెల‌ల కంటే త‌క్కువ వ‌య‌సున్న ప‌సికందుల‌ను తెర‌పై చూపించ‌కూడ‌దు. అయితే.. చ‌నుబాలు.. రోగ నిరోధ‌క శ‌క్తి లాంటి అవ‌గాహ‌న కార్య‌క్ర‌మాల కోసం మాత్రం మిన‌హాయింపు వుంటుంది, ఈ నిబంధ‌న‌ను పాటించ‌కుంటే మూడేళ్ల పాటు జైలు శిక్ష విధిస్తారు. సినిమా, సీరియ‌ళ్లు, ఓటీటీ... ఇలా అన్ని కేటాగిరీల‌కు ఈ నిబంధ‌న‌లు వ‌ర్తించ‌నున్నాయి.

- అంతే కాకుండా చిల్డ్ర‌న్ ఇన్ న్యూస్ మీడియా అనే కేట‌గిరీని ప్ర‌త్యేకంగా చేర్చింది NCPCR. దీని ప్ర‌కారం పిల్ల‌లు న్యూస్ ఛానెల్స్ లేదంటే ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌ర్ప‌స్ లో ఇంట‌ర్వ్యూల‌కు హాజ‌రైన‌ప్పుడు వాళ్ల‌కు ఇబ్బంది క‌లిగించేలా వ్య‌వ‌హ‌రించ‌కూడ‌దు. ముఖ్యంగా బాధితుల విష‌యంలోనూ విజువ‌ల్స్ ప‌ట్ల జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాలి. లేకుంటే సంబంధిత ఛానెల్స్ పై శిక్ష‌లు క‌ఠినంగా అమ‌లు చేయ‌బ‌డ‌తాయి. ఈ గైడ్ లైన్స్ ప్ర‌కారం నిర్భంధంలో ప‌ని చేయించుకోవ‌డం త‌దిత‌ర అంశాల‌తో పాటు లేబ‌ర్ చ‌ట్టం ప్ర‌కారం ఇక్క‌డ వ‌ర్తిస్తుంది.

- అలాగే సోష‌ల్ మీడియా కూడా పిల్ల‌ల‌పై హింస విషయంలో బాధ్య‌తాయుతంగా వ్య‌వ‌హ‌రించాల‌ని కోరింది. ధూమ‌పానం, మ‌ధ్య‌పానంతో పాటు అత్యాచార బాధితులుగా, లైంగిక వేధింపుల బాధితులుగా ఇబ్బందిక‌ర ప‌రిస్థితుల‌లో వారిని చూపించ‌కూడ‌దు. భారీ భారీ డైలాగుల‌తో స‌మాజంపై చెడు ప్ర‌భావం చూపించేలా పాత్ర‌ల‌ను డిజైన్ చేయ‌డం మేక‌ర్లు మానుకోవాల‌ని మార్గ‌ద‌ర్శ‌కాల్లో సూచించించింది NCPCR.

- చివ‌రగా ..2011లో మార్గ‌ద‌ర్శ‌కాల‌ను జారీ చేసింది NCPCR. ఈ నేప‌థ్యంలోనే మ‌ళ్లీ ఇన్నేళ్ల త‌రువాత కొత్త చ‌ట్టాలు, పాత నిబంధ‌న‌ల స‌వ‌ర‌ణ‌ల ఆధారంగా భారీ మార్పుల‌తో డ్రాఫ్ట్ గైడ్ లైన్స్ ని ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ త‌రువాతే రూపొందించింది. వినోదా రంగం నుంచి ఓ ప్ర‌త్యేక క‌మిటీ ఈ మార్గ ద‌ర్శ‌కాల ప్ర‌తిపాద‌న‌ల‌ను ప‌రిశీలించి అభ్యంత‌రాల‌ను, మార్పులు చేర్పుల‌ను తెల‌ప‌నుంద‌ని తెలిసింది.