నా ఆత్మ నన్ను శాశ్వతంగా వదిలి వెళ్లింది! -అమితాబ్

Sun Aug 02 2020 13:20:51 GMT+0530 (IST)

My soul has left me forever! Amitab

దోస్త్ మేరా దోస్త్ తూహై మేరీ జాన్ వాస్తవంరా దోస్త్ నువ్వే నా ప్రాణం.. బ్రతుకు తీపి పాటలో మధుర స్వరాలం మనం.. స్నేహమనే మాటలో చెరో అక్షరం మనం.. ఈ పాట ఎన్నటికీ మరువలేనిది. సృష్టిలో స్నేహానికి మించినది లేదు. స్నేహితుడి కంటే గొప్ప ఇంకేదీ లేదు. మరణంతో ఆ బంధం దూరం కాదు. అందుకే దోస్త్ మారే దోస్త్.. తూహే మేరా జాన్ అంటూ గొప్పగా రాశారు లిరిసిస్టులు.బిగ్ బి అమితాబ్ స్నేహితుడు అమర్ సింగ్ గత కొంత కాలంగా కిడ్నీసంబంధిత వ్యాధితో బాదపడుతూ .. చివరకు శనివారం తుది శ్వాస విడిచారు. రాజకీయాలకు అతీతంగా అజాతశత్రువుగా ఉండే అమర్ సింగ్ మరణంతో దేశ ప్రధాని నరేంద్రమోడీ సహా ఎందరో ప్రగాఢ సంతాపం  తెలిపారు. మరి ఇలాంటప్పుడు తన ప్రాణ స్నేహితుడు బిగ్ బి అమితాబ్ ఎలా స్పందించారు? అంటే.. అది ఎంతో ఉద్విగ్నమైనది. నేడు యాథృచ్ఛికంగానే స్నేహితుల దినోత్సవం. ఆరోజుకి ఒకరోజు ముందే అమితాబ్ స్నేహితుడు అమర్ అమరుడయ్యారు.

స్నేహితుడి మరణంతో కుంగిపోయిన అమితాబ్ తన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసిన తీరు ఎమోషన్ కి గురైన తీరు అభిమానుల్ని తీవ్ర ఉద్విగ్నతకు గురి చేస్తోంది. ప్రాణ స్నేహితుడు ఇక లేరనే విషయం తెలిసి దుఖసాగరంలో ముగినిపోయిన బిగ్ బి తల దించి ఉన్న ఫోటోని సోషల్ మీడియాల్లో షేర్ చేశారు. అది చూడగానే ఆయన ఎంతగా బాధకు గురయ్యారో అభిమానులకు అర్థమైంది.

అమితాబ్ భార్యామణి జయా బచ్చన్ ని రాజకీయాల్లోకి ఆహ్వానించి అక్కడ ఓనమాలు నేర్పిన గురువు ఆయన. అన్నయ్యా అంటూ జయాజీ ఆప్యాయంగా పిలుస్తారు. అమితాబ్ కుటుంబంతో దశాబ్ధాల అనుబంధం అమర్ సింగ్ కి ఉంది. అందుకే ట్విట్టర్ లో మౌనంగా తన తల వంచి ఉన్న ఫోటోతోనే తన భావోద్వేగ సంతాపాన్ని తెలియజేసిన తీరు ఫ్యాన్స్ లో ప్రముఖంగా చర్చకు వచ్చింది. ``నేను దుఖంలో మునిగిపోయాను. చాలా బాధపడుతున్నాను. నా తల వంగి ఉంది. ప్రార్థనలు మాత్రమే మిగిలి ఉన్నాయి. నా హృదయానికి దగ్గరైన ఆత్మ నన్ను శాశ్వతంగా విడిచి వెళ్లింది`` అంటూ అమితాబ్ ఎమోషన్ కి గురయ్యారు. ప్రస్తుతం ట్విట్టర్ లో షేర్ చేసిన బిగ్ బి ఫోటో అంతర్జాలంలో వైరల్ గా మారింది.