Begin typing your search above and press return to search.

సుశాంత్ కేసులో ఫేక్ న్యూస్...వ్యక్తి అరెస్టు

By:  Tupaki Desk   |   16 Oct 2020 5:31 PM GMT
సుశాంత్ కేసులో ఫేక్ న్యూస్...వ్యక్తి అరెస్టు
X
బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం కేసు నేపథ్యంలో ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో విపరీతంగా వార్తలు, కథనాలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, సోషల్ మీడియాలో వచ్చిన వార్తల్లో, కథనాల్లో చాలావరకు ఫేక్ న్యూస్ అని తేలిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా ఈ తరహాలో ఫేస్ న్యూస్ ప్రచారం చేస్తున్న ఢిల్లీకి చెందిన వ్యక్తిని ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. విభోర్ ఆనంద్ అనే వ్యక్తి సుశాంత్‌, ఆయన మాజీ మేనేజర్‌ దిశా సలియాన్ మరణాలపై తన ట్విటర్ ఖాతాలో వివాదస్పద ఆరోపణలు చేశాడు. న్యాయవాదినని చెప్పుకున్న ఆనంద్.... పలువురు వ్యక్తులపై సంచలన ఆరోపణలు చేస్తూ ట్వీట్లు చేశాడు. అంతేకాదు, సుశాంత్ కేసు దర్యాప్తు చేస్తున్న ముంబై పోలీసుల తీరును విమర్శిస్తూ పలు పోస్టులు పెట్టాడు. ఇప్పటికే విభోర్‌ ఖాతాను ట్విట్టర్‌ సస్పెండ్‌ చేయగా...తాజాగా పోలీసులు అరెస్టు చేసి విచారణ జరుపుతున్నారు.

విభోర్‌ చేసిన ఆరోపణలు, సుశాంత్‌ కేసును తప్పుదారి పట్టించేలా ఉన్నాయని ముంబై పోలీసులు తెలిపారు. కేసు విచారణలో ఉండగా ఇటువంటి పోస్టులు విచారణను ప్రభావితం చేస్తాయని, అందుకే వాటిని సీరియస్‌గా పరిగణించి అరెస్టు చేశామని చెప్పారు. ఇదే తరహాలో ఓ మహిళ గురించి తప్పుగా వీడియోలు పోస్ట్‌ చేసిన మోడల్‌, యూట్యూబర్‌ ప్రదీప్ మొహిందర్ సింగ్ చౌదరిని గత నెలలో ముంబై పోలీసులు అరెస్ట్‌ చేశారు. తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఫిర్యాదు చేయడంతో అతడిని అరెస్ట్ చేసి విచారణ జరిపారు. కాగా, సుశాంత్ సోదరి శ్వేత హఠాత్తుగా తన ట్విటర్, ఇన్ స్టా ఖాతాలను డిలీట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, శ్వేత తన ఫేస్ బుక్ ఖాతాను మాత్రం కొనసాగిస్తున్నారు. జస్టిస్ ఫర్ సుశాంత్ పేరుతో సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్వేత హఠాత్తుగా ఆ ఖాతాలను డిలీట్ చేయడం చర్చనీయాంశమైంది.