Begin typing your search above and press return to search.

15 రోజులు కోమాలో ఉన్నాను: ముమైత్ ఖాన్

By:  Tupaki Desk   |   23 Feb 2021 8:30 AM GMT
15 రోజులు కోమాలో ఉన్నాను: ముమైత్ ఖాన్
X
తెలుగు తెరపై ఐటమ్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా ముమైత్ ఖాన్ కనిపిస్తుంది. ముమైత్ ఖాన్ పేరు వినగానే 'పోకిరి' సినిమాలో 'ఇప్పటికింకా నా వయసు' అంటూ ఆమె చేసిన సందడే గుర్తుకు వస్తుంది. అప్పటివరకూ తెలుగు సినిమాల్లో ఐటమ్ సాంగ్స్ ఉన్నప్పటికీ, వాటి స్పీడ్ పెంచింది మాత్రం ముమైత్ ఖాన్ అనే చెప్పాలి. కొత్తగా వచ్చిన సినిమాలో ముమైత్ ఐటమ్ ఉందా లేదా అని కుర్రాళ్లు గమనించడం ఎక్కువైంది. దాంతో తమ సినిమాల్లో ముమైత్ ఐటమ్ సాంగ్ తప్పనిసరిగా ఉండాలనే ఆలోచనకి దర్శక నిర్మాతలు వచ్చేశారు. అలాంటి ముమైత్ ఖాన్ తాజాగా 'ఆలీతో సరదాగా' కార్యమంలో తన మనోభావాలను పంచుకున్నారు.

"నేను 13 ఏళ్లకే బ్యాక్ గ్రౌండ్ డాన్సర్ గా ఇండస్ట్రీకి వచ్చాను. అందువలన అప్పటి నుంచే చాలా దగ్గరగా ఇండస్ట్రీని చూస్తూ వచ్చాను. అయితే ఐటమ్ సాంగ్స్ విషయంలో నేను ఒక స్థాయికి చేరుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు. డాన్స్ చేయడం .. వాళ్లు ఇచ్చిన డబ్బు తీసుకుని వచ్చేయడం తప్ప, నెంబర్ వన్ కావాలని చెప్పేసి నేను ఎప్పుడూ అనుకోలేదు. క్రేజ్ తెచ్చుకోవాలనే ఉద్దేశం .. ఆలోచన కూడా నాకు ఉండేవి కాదు. నా పనిని నేను పెర్ఫెక్ట్ గా చేశానా లేదా? అని మాత్రమే ఆలోచించేదానిని. 'పోకిరి' తరువాత నాకు విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఆ తరువాత కూడా నాకు గర్వం రాలేదు .. అంతకుముందు నేను ఎలా ఉన్నానో ఆ తరువాత కూడా అలాగే ఉన్నాను.

కొరియోగ్రాఫర్ రెమో .. నాకు గురువు. ఆయనతో కలిసి నేను చాలా డాన్స్ షోలలో పాల్గొన్నాను. ఒక టీవీ షో కోసం నేను డాన్స్ చేయగా నాకు అందిన తొలి పారితోషికం 750 రూపాయలు. అప్పట్లో మా ఆర్ధిక పరిస్థితి సరిగ్గా లేకపోవడం వలన మా అమ్మ ఒప్పుకుందిగానీ, లేదంటే ఒప్పుకునేది కాదు. ఆ తరువాత 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' సినిమా కోసం 30 వేల రూపాయలను పారితోషికంగా అందుకున్నాను. మంచి క్రేజ్ తో దూసుకుపోతున్న సమయంలో నేను వాష్ రూమ్ లో జారిపడ్డాను. తలకి బలమైన గాయం తగలడం వలన, 15 రోజుల పాటు కోమాలో ఉండిపోయాను. బ్రెయిన్ కి సంబంధించిన 5 నరాలు దెబ్బతినడంతో ఆపరేషన్ చేశారు. నేను బ్రతకడానికి 20 శాతం మాత్రమే అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారట. అదృష్టం కొద్దీ బ్రతికి బయటపడ్డాను .. ఇలా మీ ముందు ఉండగలిగాను" అని చెప్పుకొచ్చారు.