Begin typing your search above and press return to search.

'అఖండ' లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు: తమన్

By:  Tupaki Desk   |   24 Nov 2021 2:30 AM GMT
అఖండ లాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు: తమన్
X
బాలకృష్ణ .. బోయపాటి కాంబినేషన్లో ఒక సినిమా వస్తుందనేసరికి భారీ అంచనాలు ఉంటాయి. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'లెజెండ్' .. 'సింహా' సినిమాలు సంచలన విజయాలను నమోదు చేశాయి. అందువలన మూడో సినిమాగా రూపొందిన 'అఖండ'పై సహజంగానే అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. మిరియాల రవీందర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో, బాలకృష్ణ రెండు విభిన్నమైన లుక్స్ తో కనిపించనున్నారు. ఆయన సరసన నాయికగా ప్రగ్యా జైస్వాల్ అలరించనుంది. డిసెంబర్ 2వ తేదీన విడుదలవుతున్న ఈ సినిమాకి తమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

తాజా ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ .. "ఈ మధ్య ఏ సినిమా చూసినా సంగీత దర్శకుడిగా నా పేరే కనిపిస్తోందని అంటున్నారు. కానీ ఈ సినిమాలన్నీ ఒకదాని తరువాత ఒకటిగా ఎప్పటిలా వచ్చేవే. కాకపోతే కరోనా కారణంగా ఆగిపోయి అన్నీ ఒక్కసారిగా వస్తుండటంతో అలా అనిపిస్తోంది .. అంతే. 'అఖండ' పాటలు చాలా బాగా వచ్చాయని అంటున్నారు. బాలకృష్ణ - బోయపాటి అండర్ స్టాండింగ్ చాలా గొప్పది. వాళ్లిద్దరూ కలిసి ఎన్ని వందల సినిమాలు చేసినా ఫ్లాప్ సినిమా మాత్రం తీయలేరు. ఈ సినిమాలో పాటలు తక్కువ .. అందువలన ఇచ్చే పాటలు కరెక్టుగా ఇద్దామని బాగా కష్టపడటం జరిగింది.

నాలుగు పాటల్లో రెండు పాటలను వదలడం జరిగింది. మిగతా రెండు పాటలను ప్రీ రిలీజ్ ఈవెంట్ రోజున స్టేజ్ పై రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ సినిమా పాటలు ఇంతబాగా రావడానికి కారణం, కరోనా వలన లభించిన సమయం కూడా. ఇక బోయపాటి శ్రీను గారు రేసు గుర్రం వంటి మనిషి. ఆయన అలా పరిగెడతారు .. మిగితా వాళ్లను పరిగెత్తిస్తారు. ఈ సినిమా రీ రికార్డింగ్ రెండు మూడు నెలల ముందే పూర్తయింది. కానీ రిలీజ్ వాయిదా పడటంతో, బెటర్మెంట్ కోసం మరోసారి చేశాము. ఈ రోజుల్లో సినిమా అనేది ఆరు నెలలకోసారి అప్ డేట్ అవుతోంది. అందువలన అందుకు తగినట్టుగానే పనిచేయాలి.

ఈ సినిమాలో ఫైర్ ఉంది .. ఎమోషన్ ఉంది .. బాలకృష్ణగారు అదరగొట్టేశారు. ఆయన అఘోర పాత్ర తెరపైకి వచ్చినప్పుడు సినిమా వేరే జోనర్లో నడుస్తుంది. అఘోర ఎంట్రీ ఇచ్చిన తరువాత ఎలాంటి మ్యూజిక్ ఉండాలనే విషయంపై గట్టిగానే రీసెర్చ్ చేశాము. ఆ సమయంలో వచ్చే ఆర్ ఆర్ వినాలంటే గుండెను చేత్తోపట్టుకోవాలి. బోయపాటి చాలా పెర్ఫెక్ట్ గా ఈ సినిమాను ఇస్తున్నారు .. అందువలన మేము కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఎక్కడ సినిమా ఏం అడుగుతుందో .. అది ఇచ్చేస్తూ వచ్చాము. సినిమాలో ఎక్కడా కూడా అనవసరంగా పాటలు రావు.

నాకు తెలిసి ఇలాంటి సినిమాలు మళ్లీ మళ్లీ రావు. ఇది రెగ్యులర్ గా వచ్చే కమర్షియల్ సినిమా కాదు. థియేటర్లో అందరూ ఎంజాయ్ చేస్తారు. ఈ సినిమా కోసం అందరం కలిసి కష్టపడ్డాం .. అందరికీ పేరు వస్తుంది. మేము చేసిన మ్యూజిక్ ను జనంలోకి తీసుకెళ్లేది హీరోలే .. అందువలన వాళ్లు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న ట్రెండ్ వలన సింగర్స్ కి కూడా మంచి పేరు వస్తోంది. అలాగే ఒక్కో సాంగ్ ను మాత్రమే వదలడం వలన అవి జనంలోకి బాగా వెళుతున్నాయి .. మంచి వ్యూస్ తెచ్చుకుంటున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో సాంగ్స్ ప్రధానమైన పాత్రను పోషిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ప్రభాస్ సినిమా కోసం జపాన్ లో ఉన్న ఆయన అభిమానులు వెయిట్ చేస్తున్నారు. మహేశ్ మూవీ కోసం అమెరికాలో ఉన్న ఆయన ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. అందువలన ఇప్పుడు మనం చేస్తున్నవి పాన్ ఇండియా సినిమాలు కావు .. పాన్ వరల్డ్ సినిమాలు" అని చెప్పుకొచ్చాడు.