ఓమిక్రాన్ ఇంపాక్ట్ తో మళ్లీ రిలీజ్ డైలమా?

Tue Nov 30 2021 11:22:51 GMT+0530 (IST)

Movie Release dilemma with Omicron Impact

కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ బి.1.1.529 ఇప్పుడు ప్రపంచానికి సవాల్ విసిరే దిశగా వెళుతోంది. దక్షిణాఫిక్రాలో పురుడు పుసుకున్న ఈ వేరియంట్ పై కథనాలు భయపెడుతున్నాయి. థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని డబ్ల్యూ.హెచ్.వో ఇప్పటికే హెచ్చరించింది. కేంద్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలు రిలీజ్ చేయడానికి రెడీ అవుతోంది. మళ్లీ లాక్ డౌన్ ఉంటుందా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి.ఓమిక్రాన్ ఇంపాక్ట్ సెకెండ్ వేవ్ ని మించి ఉంటుందని... రెండు డోసులు వ్యాక్సిన్ వేసుకున్నా ఓమిక్రాన్ సోకడం సోకడం ఇప్పుడు అందర్నీ కలవరడ పెడుతోంది. ఇది ఎప్పుడు విరుచుకుపడుతుందో తెలియదు. వచ్చే ఏడాది ఆరంభం నుంచి ఇంపాక్ట్ ఉంటుందని ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి.

ఇదే గనుక జరిగితే టాలీవుడ్ సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే పరిస్థితులు అదుపులోకి వస్తున్నాయి. అంతా చక్కబడుతోందని ఊపిరి తీసుకుంటున్నారు. అయితే కొత్త వేరియంట్ తో మళ్లీ థియేటర్లు లాక్ అయినా అవ్వొచ్చు.. లేదా! 50 శాతం ఆక్యుపెన్సీతో నిర్వహించాలని మార్గదర్శకాలు జారీ అయ్యే అవకాశం కనిపిస్తోంది. మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఉంటే ఎగ్జిబిటర్లు నిలబడే పరిస్థితి ఉండదు. ఇప్పటికే ఓటీటీతో థియేటర్లు వెలవెలబోతున్నాయి. నష్టాల్లోనే నడుస్తున్నాయి. తాజాగా కొత్త వేరియంట్ అంటే పాన్ ఇండియా చిత్రాలపై ప్రభావం తప్పదు.

జనవరిలో `ఆర్.ఆర్.ఆర్` ..`రాధేశ్యామ్` చిత్రాలు రిలీజ్ అవుతున్నాయి. అలాగే ఫిబ్రవరిలో `ఆచార్య`..`సర్కారు వారి పాట` సహా కొన్ని సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి. ఇలాంటి సమయంలో మళ్లీ కోవిడ్ ఆంక్షలు తెరపైకి వస్తే సినిమాల రిలీజ్ లకు ఇబ్బందేనని చాలా మంది భావిస్తున్నారు.

ఇక డిసెంబర్ 2న `అఖండ` రిలీజ్ అవుతుంది. ఈ సినిమా కొత్త వేరియంట్ నుంచి బయట పడినట్లే.. అలాగే డిసెంబర్ 17న `పుష్ప ది రైజ్` రిలీజ్ కాగా..అటు 24న `గని`..` శ్యామ్ సింగరాయ్ ` రిలీజ్ అవుతున్నాయి. దాదాపు ఈ నాలుగు సినిమాలు కొత్త వేరియంట్ నుంచి తప్పించుకునే వీలుందని భావిస్తున్నారు. జనవరి నుంచి సినిమాల విషయమై కొత్త ఆలోచనలు రేకెత్తే వీలుందని భావిస్తున్నారు. ఇప్పటికి ఇవన్నీ సూచనలు సంకేతాలు మాత్రమే.. సంపూర్ణ వ్యాక్సినేషన్ దిశగా వెళుతున్న భారత్ లో ఈ వేరియెంట్ ప్రభావం ఎలా ఉండనుందో వేచి చూడాలి.