నిర్మాత అవాక్కయ్యేలా డిస్ట్రిబ్యూటర్ల నిర్ణయం

Thu May 28 2020 09:30:42 GMT+0530 (IST)

Movie Distributors Sensational Decision

మహమ్మారీ పాఠాలు రోజువారీగా కొనసాగుతున్నాయి. ప్రతిదీ కొత్త కొత్తగానే  ఉంది ఇపుడు. ఊహించని అనూహ్య పరిణామాలకు ఇది కారణమవుతోంది. అన్నిరంగాలపైనా పడినట్టే సినీరంగంపైనా మహమ్మారీ ప్రభావం ఆషామాషీగా లేదని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ పై ఊహించని పిడుగులా పడింది.ప్రస్తుతం ఇండస్ట్రీలో ప్రతి శాఖా రివ్యూలు చేసుకోవాల్సిన సన్నివేశం తలెత్తింది. నిర్మాతలు ఇప్పటికే భారీ బడ్జెట్లు.. భారీ పారితోషికాలు అన్న కాన్సెప్టు నుంచి బయటపడుతున్నారు. మునుముందు సినిమాల కంటే డిజిటల్ -ఓటీటీ వేదికల్ని నమ్ముకునే ఆస్కారం కనిపిస్తోంది. పర్యవసానంగా స్టార్ హీరోలు.. స్టార్ డైరెక్టర్లు సైతం అటువైపు ఆలోచిస్తున్నారు. కేవలం నిర్మాతలు.. హీరోలే కాదు.. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు కూడా పూర్తిగా మారిపోతున్నారు.

కొందరు టాప్ డిస్ట్రిబ్యూటర్లు ఇప్పటికే మహమ్మారీ ప్రభావాన్ని అంచనా వేసారు. అందుకు తగ్గట్టే భవిష్యత్ నిర్ణయాలు ఉండబోతున్నాయట. ఎంత గొప్ప క్రేజీ హీరో నటించిన సినిమా అయినా కొనకూడదన్న నిర్ణయానికి కొందరు వచ్చారట. ఎందుకంటే థియేట్రికల్ రిలీజ్ చేసినా జనం థియేటర్లకు వస్తారా రారా? అన్న సందిగ్ధత డిస్ట్రిబ్యూటర్ ని నిలువనీయడం లేదుట. ఆ క్రమంలోనే ఓ అగ్ర నిర్మాత కం పంపిణీదారుడు ఇకపై నాన్ రీఫండబుల్ అడ్వాన్స్ (ఎన్.ఆర్.ఏ- తిరిగి ఇవ్వనిది) కేటగిరీలో భారీ సినిమాలకు ఒప్పందాలు చేసుకునే ఆలోచనను విరమించారట. ఆయన బాటలోనే పలువురు ఇప్పటికే ఆ దిశగా ఆలోచిస్తున్నారన్న సమాచారం ఉంది. ఏదైనా తమ పంపిణీ సంస్థలో రిలీజ్ చేసుకునే వెసులుబాటు కల్పించి లాభాల్లో వాటాలు పంచుకునే ప్రాతిపదికను తెరపైకి తేనున్నారట.

వైరస్ ఇక లేదు.. రాదు! అనేంత వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందట. ఎన్.ఆర్.ఏ ఒప్పందాలతో చిక్కులుండడం వల్లనే ఈ నిర్ణయం అని తెలుస్తోంది. అయితే బడా పంపిణీదారులు ఆ దిశగా ఆలోచిస్తే ఇకపై అందరూ అదే బాట పడతారన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ పర్యవసానం భారీ పాన్ ఇండియా సినిమాలు తీయాలనే ఆలోచనను పెద్ద దెబ్బ కొడుతుందనడంలో సందేహమేం లేదు. ఇకపై బడ్జెట్లు తగ్గిపోతాయి. నటీనటుల పారితోషికాల రేంజ్  అమాంతం పడిపోతుంది. టాప్ టెక్నీషియన్ల పారితోషికాల రేంజ్ కూడా కిందికి దిగిపోతుందని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే సెట్స్ పై ఉన్న డజను భారీ చిత్రాల రిలజ్ లు సందిగ్ధంలోనే ఉన్నట్టే. అలానే సెట్స్ పై ఫినిషింగ్ లో ఉన్న భారీ బడ్జెట్ చిత్రాలకు  కూడా డిస్ట్రిబ్యూషన్ పరంగా చిక్కుల్ని ఎదుర్కోవడం ఖాయంగానే కనిపిస్తోంది.