Begin typing your search above and press return to search.

దేశభ‌క్తి సినిమాలు తెలుగులో ఏవీ?

By:  Tupaki Desk   |   25 Sep 2021 2:30 AM GMT
దేశభ‌క్తి సినిమాలు తెలుగులో ఏవీ?
X
దేశ‌వ్యాప్తంగా వున్న అన్ని భాష‌ల్లో దేశ భ‌క్తిని ప్ర‌భోధించే చిత్రాలు చాలానే వ‌చ్చాయి. కానీ అందులో గుర్తుంచుకోద‌గ్గ‌వి మాత్రం చాలా త‌క్కువే వున్నాయి. ముందుగా దేశ భ‌క్తి పంజాబీ చిత్రాల్లో ప్ర‌ధానంగా క‌నిపించింది. దాన్ని హిందీ.. బెంగాలీ..మ‌రాఠీ.. భాష‌లు అనుస‌రించాయి. నేటి యువ‌త‌కు ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ చేసిన త్యాగాలు.. స్ఫూర్తిని ర‌గిలించే పోరాటాలు.. ఎదుర్కొన్న అవాంత‌రాల గురించి తెలియ‌జెప్పాల‌ని చాలా మంది ద‌ర్శ‌కులు ప్ర‌య‌త్నించారు.

ద‌క్షిణాదిన ఇటీవ‌ల దేశ‌భ‌క్తి సినిమాల వెల్లువ అంతంత మాత్రంగానే ఉంది. నాటి రోజుల్లో రెండు మ‌ల‌యాళ‌ చిత్రాలు దేశ‌భ‌క్తి క‌థాంశాల‌తో వ‌చ్చి జాబితాలో ప్ర‌ముఖంగా నిల‌వ‌డం విశేషం. ప్రియ‌ద‌ర్శ‌న్ తెర‌కెక్కించిన చిత్రం `కాలాపానీ` ఒక‌టి కాగా మ‌రొక‌టి మేజ‌ర్ ర‌వి రూపొందించిన `కీర్తి చ‌క్ర‌`. ఈ రెండు చిత్రాల్లోనూ మ‌ల‌యాళ సూప‌ర్ స్టార్ మోహ‌న్ లాల్ హీరోగా న‌టించారు. `కాలాపానీ` 1996లో వ‌చ్చింది. ఇందులో మోహ‌న్ లాల్ తో పాటు త‌మిళ హీరో ప్ర‌భు కూడా న‌టించారు.

చెయ్య‌ని త‌ప్పుకు 25 ఏళ్ల పాటు అండ‌మాన్ కారాగారం అనుభ‌వించిన గోవింద్ మీన‌న్ అత్యంత రాక్ష‌సుడైన జైలు అధికారికి ఎలా బుద్ది చెప్పాడు.. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎలాంటి నేరం చేయ‌కుండానే జైలు శిక్ష అనుభ‌విస్తున్న భిన్న‌మైన వ్య‌క్తుల‌ని ఎలా ఏకం చేసి తిరుగుబాటు చేశాడ‌న్న నేప‌థ్యంలో ఈ చిత్రాన్ని ప్రియ‌ద‌ర్శ‌న్ అద్భుతంగా తెర‌కెక్కించారు.

అంతే అద్భుతంగా గోవింద్ మీన‌న్ పాత్ర‌లో మోహ‌న్ లాల్ న‌టించి అబ్బుర‌ప‌రిచారు. అత‌నికి అండ‌గా నిలిచే త‌మిళుడిగా ప్ర‌భు పాత్ర కూడా ఆక‌ట్టుకుంటుంది. ఇదే త‌ర‌హా పాత్ర‌లు మేజ‌ర్ ర‌వి తెర‌కెక్కించిన `కీర్తి చ‌క్ర‌`లోనూ క‌నిపిస్తాయి. మ‌ల‌యాళీ మేజ‌ర్ మ‌హ‌దేవ‌న్ గా మోహ‌న్‌లాల్ క‌నిపిస్తే హ‌విల్దార్ జ‌య‌కుమార్ పాత్ర‌లో త‌మిళియ‌న్ గా యంగ్ హీరో జీవా క‌నిపించాడు. క‌శ్మీర్ లో చొర‌బ‌డిన విదేశీ మిలిటెంట్ ల‌ని ఏరివేసే ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో ఈ మూవీ మేజ‌ర్ ర‌వి రూపొందించారు.

కాలాపానీ.. కీర్తి చ‌క్ర విభిన్న కాలాల్లో వేరు వేరు నేప‌థ్యాల్లో తీసినా రెండు సినిమాల ప్ర‌ధాన ఉద్దేశం దేశ భ‌క్తిని ప్ర‌బోధించ‌డ‌మే. ఆ విష‌యంలో ఈ రెండు చిత్రాలు నూటికి నేరు శాతం విజ‌యం సాధించాయి. అయితే ఈ రెండు చిత్రాల్లో అన్ని విష‌యాల్లోనూ ప్ర‌ధానంగా నిలిచింది మాత్రం ప్రియ‌ద‌ర్శ‌న్ తెర‌కెక్కించిన `కాలాపానీ`. ఆ నాటి కాల‌మాన ప‌రిస్థితుల్ని.. బ్రిటీష్ అహంకార పూరిత రాక్ష‌స జైల‌ర్ తీరుని.. అత‌ని రాక్ష‌స హింస‌ని క‌ళ్ల‌కు క‌ట్టి న‌ట్టుగా చూపించి నేటి త‌రం స్వాతంత్య్రం కోసం పోరాడిన వీరుల గొప్ప‌ద‌నాన్ని తెలుసుకునేలా చేసింది.

ఇటీవ‌లి కాలంలో తెలుగులో దేశ‌భ‌క్తి సినిమాలు రావ‌డం లేదు. ఇప్ప‌టికీ మేజ‌ర్ చంద్ర‌కాంత్ (ఎన్టీఆర్)- ఆజాద్ (నాగార్జున‌) - భార‌తీయుడు లాంటి చిత్రాల గురించి స్మ‌రించుకోవ‌డ‌మో లేక మ‌ల‌యాళ చిత్రం కాలాపానీ గురించి చెప్పుకోవ‌డ‌మో త‌ప్ప ఇటీవ‌ల తెలుగులో చెప్పుకోద‌గ్గ దేశ‌భ‌క్తి సినిమా లేదు. మునుముందు స్పై ఏజెంట్ కాన్సెప్టుల‌తో దేశ‌భ‌క్తి నేప‌థ్యంలో సినిమాల్ని తీస్తున్నారు. ఎన్.ఐ.ఏ ఏజెంట్ నేప‌థ్యంలో వైల్డ్ డాగ్ ఆక‌ట్టుకుంది. అంత‌కుముందు రాజ‌శేఖ‌ర్ పీఎస్ వి గ‌రుడ‌వేగ లో ఎన్.ఐ.ఏ ఏజెంట్ గా న‌టించారు. ఇవి ఆక‌ట్టుకున్నాయి. ఆ త‌ర్వాత అఖిల్ ఏజెంట్ గా న‌టిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో దేశ‌భ‌క్తి ఎలిమెంట్ ని ఏ స్థాయిలో ఎలివేట్ చేయ‌నున్నారు? అన్న‌ది వేచి చూడాలి.