బాలయ్యను పొగిడిన మోహన్ బాబు భలేగా బుక్ చేశారా?

Thu Oct 14 2021 16:00:01 GMT+0530 (IST)

Mohan Babu praised Balayya

‘ఎన్నికల్లో మీ అల్లుడ్ని ఓడించాం. కానీ.. అవేమీ మనసులో పెట్టుకోకుండా మా అబ్బాయిని గెలిపించారు’ అని ఎవరైనా మన ఇంటికి వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుంది? అప్పటివరకు గెలిపించిన దాని కంటే కూడా.. నేను ఓడించానన్న మాట పదును మనసులోకి దిగుతుంది. ‘మా’ ఎన్నికల్లో మోహన్ బాబు పాత్ర వివాదాస్పదంగా మారి.. పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ.. ఆయన నోటి నుంచి వచ్చిన తాజా మాట ఇప్పుడు కొత్త లొల్లికి తెర తీస్తుందన్న మాట వినిపిస్తోంది. ఇంతకాలం మోహన్ బాబు మీద విరుచుకుపడుతున్న వారు.. ఇప్పుడు బాలయ్యను టార్గెట్ చేసే పరిస్థితి ఉందంటున్నారు.‘మా’ ఎన్నికల్లో విష్ణు గెలిచిన నేపథ్యంలో.. ఆయన గెలుపుకు కీలకపాత్ర పోషించిన వారి ఇళ్లకు తన కొడుకును వెంట పెట్టుకొని వెళుతున్నారు మోహన్ బాబు. తన కొడుకు ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమం ఈ నెల 16న నిర్వహిస్తున్నామని.. దానికి హాజరు కావాలని ఆహ్వానించేందుకు బాలయ్య ఇంటికి వెళ్లారు. అనంతరం మీడియాతో మాట్లాడిన సందర్భంగా మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తనకొడుకును గెలిపించినందుకు థ్యాంక్స్ చెప్పటాన్ని ఎవరూ ఏమీ అనరు. కానీ.. రాజకీయాల్ని లాక్కొచ్చి.. అలాంటి వాటిని పట్టించుకోకుండా తమకు సపోర్టు చేశారంటూ బాలయ్య మీద చేసిన వ్యాఖ్య.. ఇప్పుడాయన్ను ఇరుకున పెట్టేలా చేసిందంటున్నారు.

బాలయ్య అల్లుడు లోకేశ్. మంగళగిరి బరిలో నిలిచిన లోకేశ్ ను ఓడించేందుకు తాము ప్రచారం చేశామని.. అయినా అవేమీ మనసులో పెట్టుకోకుండా బాలయ్య మనసున్న వ్యక్తిలా వ్యవహరించారంటూ మోహన్ బాబు మాటల్ని టీడీపీ వర్గీయులు మొదలుకొని బాలయ్య అభిమానుల వరకు అందరూ నెగిటివ్ గా తీసుకోవటం ఖాయమన్న చర్చ సాగుతోంది. ఎప్పుడో ముగిసిన పురాణాన్ని ఇప్పుడు తట్టి రేపాల్సిన అవసరం ఉందా? అని ప్రశ్నిస్తున్నారు. బాలయ్యది మంచితనమా? చేతకానితనమా? అన్న చర్చ షురూ అవుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అయినా.. రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు. అలాంటప్పుడు రెండింటిని లింకులు వేస్తూ మోహన్ బాబు చేసిన వ్యాఖ్యలతో ఆయనకు జరిగే నష్టం కంటే కూడా బాలయ్యకు పంచ్ పడటం ఖాయమంటున్నారు. ఇప్పటివరకు మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణుకు ఓటు వేసిన దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేకున్నా.. తాజా వ్యాఖ్యలతో సమాధానం చెప్పాల్సిన అవసరం ఏర్పడుతుందన్నమాట వినిపిస్తోంది. మొత్తానికి బాలయ్యను పొగిడినట్లే పొగిడి..మోహన్ బాబు భలేగా ఫిక్సు చేశారని చెబుతున్నారు.