వార్ పోస్టర్.. మరీ అన్ని బూతులా?

Thu Sep 12 2019 07:00:01 GMT+0530 (IST)

Mistakes in Hrithik Roshan War Movie Telugu poster

తెలుగు సినిమా స్థాయి పెరిగింది. తెలుగు ప్రేక్షకుల ఆలోచనల స్థాయిలోనూ అమాంతం మార్పు కనిపిస్తోంది. భాష ఏది.. నటుడు ఎవరు?.. స్థానికత ఉందా? ఇలాంటివేవీ చూడకుండా ఇరుగుపొరుగు సినిమాని ఎంతో గౌరవిస్తున్నారు. కళకు సరిహద్దులు లేవు అన్నది మనవాళ్లే నిరూపించారు. అంతేకాదు ఇరుగు పొరుగు సినిమాని గౌరవించే సాంప్రదాయం మనకు ఉన్నట్టే పొరుగు పరిశ్రమకు వెళ్లి మనవాళ్లు దండయాత్ర చేసి వస్తున్నారు. మొన్నటికి మొన్న మన డార్లింగ్ ప్రభాస్ హిందీ పరిశ్రమపై దండయాత్ర చేసి వచ్చాడు. సాహో రిజల్ట్ తెలుగులో ఎలా ఉన్నా హిందీలో బంతాడేసింది. ఈ సినిమాకి తెలుగు కంటే హిందీలో ప్రమోషనే ఎక్కువ. అంతకుముందు బాహుబలి 2 చిత్రంతో ఇండియా నంబర్ 1 రికార్డు మన తెలుగు వారి ఖాతాలోనే ఉంది. అమీర్ దంగల్ వరల్డ్ వైడ్ బెస్ట్ అయితే అవ్వొచ్చు కానీ.. ఇప్పటికీ ఇండియాలో మన బాహుబలినే నంబర్ వన్.అంతటి ప్రాధాన్యత ఉన్న భాషగా `తెలుగు` వెలుగుతోంది. అయితే మన భాషకు గౌరవం ఎలా ఉందో ఇదిగో తాజాగా రిలీజైన `వార్` పోస్టర్ చూస్తే తెలిసిపోతుంది. ఈ పోస్టర్ లో అన్నీ అచ్చు తప్పులు షాక్ కి గురి చేస్తున్నాయి. హృతిక్ పేరును `హృథిక్` అని.. యశ్ రాజ్ పేరును `యష్ రాజ్` అని.. ఆదిత్య చోప్రా పేరును `ఆదిత్య ఛోప్ రా` అని ప్రింట్ చేశారు. మొత్తానికి ఈ అనువాదకుడు ఎవరో కానీ కనీసం గూగుల్ లో చెక్ చేసినా కరెక్షన్ చేసుకోవడానికి వీలుండేది. అన్నట్టు ఇది అనువదించినది ఎవరు?  హిందీ మీడియంలో చదువుకున్న తెలుగువాడా?  లేక తెలుగు మీడియంలో చదువుకున్న హిందీ వాడా? అన్నది తెలిస్తే మన వాళ్లంతా వెతుక్కుని వెళ్లేవారే.

హృతిక్ రోషన్- టైగర్ ష్రాఫ్‌ల `వార్` .. ఈ అక్టోబర్ 2న `సైరా-నరసింహారెడ్డి` చిత్రంతో పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన `వార్` పోస్టర్ ని చూస్తే తెలుగు మార్కెట్ వాళ్లకు అవసరం లేదన్నది స్పష్టంగా అర్థమైపోతోంది. పోస్టర్ నే అంత నిర్లక్ష్యంగా వేశారంటే సినిమా ఇక్కడ ఆడినా ఆడకపోయినా ఫర్వాలేదనే అర్థం. అయితే మనవాళ్లు రిలీజ్ చేస్తున్న `సైరా`కు మాత్రం ఇలాంటి పొరపాటు జరగదనే భావిద్దాం. అక్కడ ఫర్హాన్ అక్తర్ - రవీనా టాండన్ లాంటి పేరున్న వాళ్లే రిలీజ్ చేస్తున్నారు. సైరాను అనువదించి రిలీజ్ చేస్తున్నా చిరంజీవి- రామ్ చరణ్ - సురేందర్ రెడ్డి బృందం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్నారు. దానికి తగ్గట్టే మనవాళ్లు అంత కేర్ లెస్ కాదు. ప్రతిదీ పకడ్భందీగా రిలీజ్ చేస్తారు కాబట్టి ప్రచారంలో ఇలాంటి తప్పులు చేయరనే ఆశిద్దాం.