కత్రిన బుగ్గలపై కామెంట్ చేసి దొరికిపోయిన మంత్రి

Thu Nov 25 2021 09:58:19 GMT+0530 (IST)

Minister comment on Katrina cheeks

అందాల కథానాయికల బూరె బుగ్గలు ఎప్పుడూ మంత్రుల్ని ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఈసారి కూడా సదరు మంత్రివర్యులకు అంతగా ఏం నచ్చిందో కానీ ఏకంగా కత్రిన బుగ్గలపైనే కామెంట్ చేశాడు. ``కత్రినా కైఫ్ చెంపల వంటి రోడ్లు`` అంటూ రాజస్థాన్ మంత్రి వ్యాఖ్యానించడం పెను తుఫాన్ గా మారింది. నెటిజనులు సదరు మంత్రి వర్యులపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మహిళలల్ని అగౌరవపరిచేలా విధేయతకు వ్యతిరేకంగా చేసిన నేరమిది! అంటూ దునుమాడారు.కత్రినా కైఫ్ విషయంలో రాజస్థాన్ మంత్రి రాజేంద్ర సింగ్ గూఢా చేసిన వ్యాఖ్యలు పెద్ద వివాదాన్ని రేపుతున్నాయి. ఝుంజును జిల్లాలోని ఒక గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పంచాయతీరాజ్ .. గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్న రాజేంద్ర సింగ్ గూడా ఈ వ్యాఖ్య చేశారు.

సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఏం ఉంది? అంటే..``రోడ్లు హేమ మాలిని చెంపలలా ఉండాలని`` అయితే ఆమె ``చాలా పాతబడిపోయింది`` అని మంత్రి చెప్పడం వినిపిస్తోంది. ఆ తర్వాత రోడ్లు `కత్రినా కైఫ్ చెంప(బుగ్గ)లు`లా ఉండాలని చెప్పాడు.

వీడియో చూసిన తర్వాత పలువురు నెటిజన్లు కామెంట్ సెక్షన్ లోకి వెళ్లి ఆ కామెంట్ పై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. వినియోగదారుల్లో ఒకరు ``ఇది మహిళల అణకువకు వ్యతిరేకంగా జరిగిన నేరం`` అని రాస్తే.. మరొకరు ``హేమ మాలిని నుంచి కత్రినా కైఫ్ వరకూ.. ఎందుకిలా? కొంతమంది రాజకీయ నాయకులు తలకాయల్లేని వారు. స్త్రీలను ఆక్షేపించడం ఆపండి. మీ ఆనందం కోసం పుట్టిన ప్రొడక్ట్ లు కారు.

ముఖ్యంగా 2000 సంవత్సరంలో లాలూ ప్రసాద్ యాదవ్ బీహార్ లో అధికారంలోకి వచ్చినప్పుడు బీహార్ రహదారి త్వరలో ``హేమ మాలిని చెంపలలాగా మారుతుంద``ని అనడాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయనే కాదు 2019లో మరో రాజకీయ నాయకుడు పిసి శర్మ తన ప్రభుత్వం మధ్యప్రదేశ్ రోడ్లను హేమా మాలిని చెంపల మాదిరిగానే చేస్తానని చెప్పి విమర్శలను ఆహ్వానించాడు. ఇది `డ్రీమ్ గర్ల్` దృష్టిని కూడా ఆకర్షించింది.

హేమ మాలిని స్వయంగా దీనిపై ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ..``రాజకీయ నాయకులు రోడ్ల గురించి నా చెంపలను తీసుకురావడం కొనసాగిస్తే.. నా బుగ్గలు ఎప్పటికీ సాఫీగా లేని ఎగుడుదిగుడు రోడ్లను పోలి ఉంటాయి. వాగ్దానాలు చేయకండి!`` అంటూ పంచ్ విసిరారు.