హవ్వ! ఆర్టిస్టులకు మంత్రి పరిష్కారమా?

Tue Nov 19 2019 18:58:24 GMT+0530 (IST)

Minister Talasani Srinivas Yadav Meet with TV Artists

ఆకలి వేసిందని చెప్పకపోతే అమ్మయినా అన్నం పెట్టదు అంటారు. ఈ కోవకే చెందుతారు ఆర్టిస్టులు. సమస్యలెన్నో ఉంటాయి. కానీ ఎవరికీ చెప్పుకోలేరు. కోఆర్డినేటర్లు.. మీడియేటర్ల పర్సంటేజీ వ్యవహారం నుంచి వేధింపుల ప్రహసనం వరకూ.. ఎందరి వల్లనో ఎన్నో రకాలుగా వంచనకు గురయ్యే వృత్తి ఇదని పబ్లిగ్ గానే వాపోతుంటారు ఆర్టిస్టులు. తాడిత పీడిత జనాల జాబితాలో ఆర్టిస్టుల పేర్లు చేర్చి తీరాలి. అందరూ నటి శ్రీరెడ్డిలా బరస్ట్ అవ్వగలరా?  చెడ్డ మాటాడి చెడు అనిపించుకోవడం మనకెందుకులే అని సర్ధుకుపోతుంటారు.  దానివల్ల ఏళ్ల తరబడి ఇక్కడ అరాచకాలు అలా సాగిపోతూనే ఉన్నాయి. ఇప్పటికీ అవి కొనసాగుతూనే ఉన్నాయి.అయితే ఇలాంటి తాడిత పీడిత ఆర్టిస్టులంతా వెళ్లి తలసానికి సమస్యల్ని మొర పెట్టుకుంటారట. అది కూడా సినిమాటోగ్రఫీ మంత్రి హోదాలో ఆయన ఈ సమస్యల్ని తీరుస్తారట. ముఖ్యంగా 2020 జనవరి లో మంత్రివర్యుల మీటింగ్ కోసం టీవీ ఆర్టిస్టులు తపిస్తున్నారు. ఇక ఈ వేదికపైనే TV ఆర్టిస్ట్ లకు గుర్తింపు కార్డుల పంపిణీ జరగనుంది. నేడు(మంగళవారం) మాసాబ్ ట్యాంక్ లోని  పశు సంక్షేమ భవన్ లోని తన చాంబర్ లో TV ఆర్టిస్టుల ప్రతినిధులతో మంత్రి తలసాని  సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో ఎఫ్.డీ.సీ సీ.ఐ.వో కిషోర్ బాబు.. సాంస్కృతిక శాఖ డైరెక్టర్  మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆర్టిస్టు ల సమస్యలను దశల వారిగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని.. ప్రతి ఒక్కరికి త్వరలోనే హెల్త్ కార్డులను అందజేసేందుకు చర్యలు తీసుకుంటానని సినిమాటోగ్రఫీ మంత్రి హామీ ఇచ్చారు.

అయితే హెల్త్ కార్డుల సమస్య పరిష్కారం అయితే అన్ని సమస్యలు పరిష్కారం అయినట్టు కాదు.. ఇది విస్తృతంగా చర్చించాల్సిన అంశం. ఆర్టిస్టులకు అన్ని రకాలుగానూ సమస్యలు తొలగిపోయే ఒక కొత్త వేదికను మంత్రి వర్యులు సిద్ధం చేయాల్సి ఉంటుంది. వేధింపులను ఆపగలగాలి. పర్సంటేజీల నొక్కుడు గాళ్లను తగ్గించే ఆన్ లైన్ సిస్టమ్ ని రూపొందించాల్సి ఉంటుంది. అంతా పారదర్శకంగా జీతభత్యాల చెల్లింపులు ఉండేలా చేయాలి. ముఖ్యంగా ఈ వ్యవస్థలో కేటుగాళ్లు ఎవరు అన్నది ఆరాలు తీసి కాస్త గట్టిగా బుద్ధి చెబితే కానీ దారికి వచ్చే వీల్లేదు సిస్టమ్. మరి వీటన్నిటినీ మంత్రివర్యుల దృష్టికి తీసుకెళ్లారా అన్నది చూడాలి.