విడాకులు తీసుకున్నా.. మళ్లీ ప్రేమిస్తున్నాః హీరోయిన్

Fri Jun 18 2021 09:00:01 GMT+0530 (IST)

Minisha says she is in love with someone else

భర్త నుంచి విడాకులు తీసుకున్న తర్వాత తన జీవితం చాలా ప్రశాంతంగా ఉందని అంటోంది బాలీవుడ్ నటి. అంతేకాదు.. ఇప్పుడు మరొకరితో ప్రేమలో ఉన్నానని చాలా హ్యాపీగా ఉన్నానని కూడా చెబుతోంది మినీషా లంబా. బచ్ నా యే హసీనా కిడ్నాప్ జోకర్ అనామికా వంటి చిత్రాలతో తనదైన గుర్తింపు తెచ్చుకున్న మినీషా.. తెనాలి రామ ఇంటర్నెట్ వాలా వంటి టీవీ షోస్ తోనూ మెప్పించింది.అయితే.. గతేడాది భర్త నుంచి ఆమె విడాకులు తీసుకుంది. 2015లో రియాన్ థామ్ అనే నైట్ క్లబ్ యజమానిని పెళ్లి చేసుకుంది. ఈ ఐదేళ్లలో వారి కాపురంలో విభేదాలు తలెత్తడంతో విడిపోవాలని నిర్ణయించారు. 2020లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం మరొకరితో లవ్ లో ఉన్నట్టు తెలిపిన మినీషా.. ఇప్పుడు జీవితం సంతోషంగా ఉందని తెలిపింది.

''ప్రతి మనిషికీ సంతోషంగా జీవించే హక్కు ఉంది. కానీ మన సమాజంలో విడాకులు తీసుకున్న మహిళను చిన్న చూపు చూస్తారు. అయితే.. ఆధునిక మహిళలు అందులోనూ స్వతంత్రంగా జీవించే శక్తిగలవారు తమ గళాన్ని వినిపిస్తున్నారు. గతంలో వివాహ బంధాన్ని నిలుపుకోవడానికి కేవలం స్త్రీలు మాత్రమే ప్రయత్నించేవారు. ఎన్నో కష్టాలు భరిస్తూ ఎన్నో త్యాగాలు చేసేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది'' అని అన్నారు.

ఇంకా చెబుతూ.. ''నిలబడే అవకాశం లేదు అనుకున్న బంధనాల నుంచి విడిపోయేందుకు నేటి మహిళలు వెనుకాడటం లేదు. నిజానికి విభేదాలు తారస్థాయికి చేరిన తర్వాత ఆ బంధంలో కొనసాగడంలో అర్థం లేదు. విడాకులు తీసుకోవడమే మంచిది. భర్తతో విడిపోయినంత మాత్రాన జీవితం ముగిసిపోయినట్టు కాదు'' అని చెప్పింది మినీషా లంబా.

అంతేకాదు.. తాను మరొకరిని ప్రేమిస్తున్నట్టు కూడా తెలిపింది. ఓ మంచి మనిషితో ప్రేమలో ఉన్నానని తనకు మరోసారి ప్రేమ దొరికింది అని చెప్పింది.