Begin typing your search above and press return to search.

మినీ రివ్యూ : మాలిక్‌

By:  Tupaki Desk   |   13 Aug 2022 9:50 AM GMT
మినీ రివ్యూ : మాలిక్‌
X
న‌టీన‌టులు : ఫ‌హ‌ద్ ఫాజిల్ - నిమిషా స‌జ‌య‌న్ - విన‌య్ ఫోర్ట్ - జోజు జార్జ్ - డిలీష్ పోత‌న్ - ఇంద్ర‌న్స్ - జ‌ల‌జ - సాలిమ్ కుమార్ - దినేష్ ప్ర‌భాక‌ర్ - స‌న‌ల్ అమ‌న్ - పార్వ‌తీ ఆర్ కృష్ణ త‌దిత‌ర‌లు న‌టించారు. ఈ సినిమాకు సంగీతం : సుషిన్ శ్యామ్ - సినిమాటోగ్ర‌ఫీ : సాను జాన్ వ‌ర్గీస్ - ఎడిటింగ్ : మ‌హేష్ నారాయ‌ణ‌న్ - నిర్మాతలు (తెలుగు) : అనిల్ కె. రెడ్డి, కిషోర్ రెడ్డి - ర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వం : మ‌హేష్ నారాయ‌ణ‌న్.

మ‌ల‌యాళ ఇండ‌స్ట్రీతో హీరోగా విభిన్న‌మైన సినిమాలు చేస్తూ ప్ర‌త్యేక గుర్తింపుని సొంతం చేసుకున్నారు న‌టుడు ఫ‌హ‌ద్ ఫాజిల్. త‌మిళంతో పాటు తెలుగులోనూ న‌టిస్తూ మూడు భాష‌ల్లోనూ న‌టుడిగా క్రేజ్ ని ద‌క్కించుకున్నారు. ఈ మ‌ధ్య కాలంలో మ‌ల‌యాళంలో ఫ‌హ‌ద్ ఫాజిల్ న‌టించిన సినిమాల్లో దాదాపు అన్ని మంచి విజ‌యాల్ని సాధించ‌డ‌మే కాకుండా విమ‌ర్శ‌ల‌కుల ప్ర‌శంస‌ల్ని ద‌క్కించుకున్నాయి. కంటెంట్ ప్ర‌ధానంగా సాగే సినిమాల‌కే ప్ర‌ధానంగా ప్రాధాన్య‌త‌నిస్తూ ఫ‌హ‌ద్ సినిమాలు చేస్తున్నారు.

ఈ నేప‌థ్యంలో నిజ‌జీవిత సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఫ‌హ‌ద్ న‌టించిన లేటెస్ట్ మ‌ల‌యాళ మూవీ `మాలిక్‌`. భూ క‌బ్జా, రాజ‌కీయ అవినీతి నేప‌థ్యంలో ఈ మూవీని తెర‌కెక్కించారు. మ‌ల‌యాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న ఈ మూవీని తెలుగులో అదే పేరుతో ఆహా ఓటీటీలో విడుద‌ల చేశారు. ఈ మూవీ ఆగ‌స్టు 12 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ అవుతోంది. గ‌త ఏడాది అమెజాన్ ప్రైమ్ వీడియో లో మ‌ల‌యాళ వెర్ష‌న్ స్ట్రీమింగ్ అయింది.

క‌థ : అహ‌మ్మ‌ద్ అలీ సులేమాన్ మాలిక్ (ఫ‌హ‌ద్ ఫాజిల్‌) కేర‌ళ తిరువ‌నంత‌పురంలోని స‌ముద్ర తీర ప్రాంతంలో వున్న ర‌మాద‌ప‌ల్లి కి గ్యాంగ్ స్ట‌ర్‌. ఆ ప్రాంతంలో మాలిక్ ఏది చెబితే అదే శాస‌నం. పోలీసులు, రాజ‌కీయ నాయ‌కులు కూడా ఆయ‌న మాట వినాల్సిందే. అదే స‌మ‌యంలో కేర‌ళ తుఫాను బాధితుల‌కు ఇళ్లు, ప‌క్కా సౌక‌ర్యాలు క‌ల్పించ‌డానికి ప్ర‌భుత్వం అల‌స‌త్వం ప్ర‌ద‌ర్శిస్తూ వుంటుంది. ఇదే స‌మ‌యంలో స్థానికంగా వున్న కొంత మంది నాయ‌కులు తుఫాను బాదితుల కోసం కేటాయించిన స్థ‌లంలో ప్రైవేటు వ్య‌క్తుల‌తో క‌లిసి క‌మ‌ర్షియ‌ల్ ప్రాజెక్ట్ ల‌ని నిర్మించాల‌నుకుంటారు.

ఈ విష‌యం తెలుసుకున్న మాలిక్ రాజ‌కీయ నాయ‌కుల్ని తీవ్రంగా హెచ్చ‌రిస్తాడు. దీంతో ఎలాగైనా నాయ‌క్ అడ్డు తొల‌గించుకోవాల‌ని చూసిన రాజ‌కీయ నాయ‌కులు కొన్నేళ్ల క్రితం జ‌రిగిన మ‌త‌ఘ‌ర్ష‌ణ‌ల కేసుని తిరిగ‌తోడి హ‌జ్ యాత్రకు వెళుతున్న మాలిక్ ని అరెస్ట్ చేయిస్తారు. అంతే కాకుండా జైల్లోనే అత‌న్ని హ‌త్య చేయించాల‌ని ప‌థ‌కం వేస్తారు. ఇంత‌కీ వారి ప్లాన్ కు మాలిక్ చిక్కాడా?..ఈ క్ర‌మంలో ర‌మాద‌ప‌ల్లి కి త‌ను కీల‌క గ్యాంగ్ స్ట‌ర్ ఎలా అయ్యాడు? సులేమాన్.. మాలిక్ గా మారే క్ర‌మంలో ఏం జ‌రిగింది? త‌ను ఏం కోల్పోయాడు అన్న‌దే ఈ చిత్ర ప్ర‌ధాన క‌థ‌.

ఒక సాధార‌ణ వ్య‌క్తి త‌న చుట్టూ ఏర్ప‌డిన ప‌రిస్థితుల ప్ర‌భావం చేత‌ ప్ర‌జ‌ల కోసం, త‌న‌ని న‌మ్ముకున్న వారి కోసం ఒంటిగా పోరాటం చేసి కాల క్ర‌మేనా తిరుగులేని శ‌క్తిగా ఎద‌గ‌డం ఇందులో చూపించారు. త‌నే గ్యాంగ్ స్ట‌ర్ గా, చివ‌రికి తిరుగులేని డాన్ గా మారిన వైనాన్ని ఆవిష్క‌రించారు. ఇదే త‌ర‌హాలో వ‌చ్చిన హాలీవుడ్ ఫిల్హ్ `గాడ్ ఫాద‌ర్‌`, క‌మ‌ల్ హాస‌న్ `నాయ‌కుడు, ర‌జీనీకాంత్ `భాషా`సంచ‌ల‌న విజ‌యాల్ని సొంతం చేసుకున్నాయి. బ్లాక్ బ‌స్ట‌ర్ లు అనిపించుకున్నాయి. మంచి పై చెడుతో సాగే స‌మ‌రం నేప‌థ్యంలో ఈ సినిమాల పంథాలోనే ద‌ర్శ‌కుడు `మాలిక్‌`ని తెర‌కెక్కించాడు.

సులేమాన్ నేర జీవితాన్ని వ‌దిలేయాల‌ని అనుకోవ‌డం.. కానీ అత‌న్ని పోలీసులు చంపేయాల‌ని ప్లాన్ చేయ‌డం వంటి స‌న్నివేశాల‌తో క‌థ మొద‌ల‌వుతుంది. ప్రారంభ దృశ్యాల నుంచే సినిమా కథేంటో.. సులేమాన్ ఎవ‌రో తెలుసుకోవాల‌నే ఆస‌క్తి స‌గ‌టు ప్రేక్ష‌కుడిలో మొద‌ల‌వుతుంది. ఆ స్థాయిలో ద‌ర్శ‌కుడు మ‌హేష్ నారాయ‌ణ‌న్ క‌థ‌, క‌థ‌నాల్ని న‌డిపించి ఆక‌ట్టుకున్నాడు. చిన్న చిన్న నేరాలు చేస్తూ ఫైన‌ల్ గా ఓ హ‌త్య తో సులేమాన్ కాస్తా మాలిక్ గా మార‌డం స్థానిక నాయ‌కులు, పోలీసులు, అధికారుల్ని ఎదిరించే స్థాయికి మాలిక్ చేర‌డం వంటి స‌న్నివేశాలు ఆక‌ట్టుకుంటాయి.మాలిక్ ని హ‌త్య చేయాల‌ని పోలీసులు చేసే కుట్ర‌లు, వాటిని అధిగ‌మిస్తూ మాలిక్ ముందుకు సాగే తీరు ఈ క్ర‌మంలో త‌న‌కు విలువైనవి పోగొట్టుకునే తీరు ప్ర‌తీ ఒక్క‌రినీ ఎమోష‌న‌ల్ కు గురిచేస్తుంది. మాలిక్ పాత్ర‌లో ఫ‌హ‌ద్ శ‌భాష్ అనిపించాడు. క‌థా గ‌మ‌నం నెమ్మ‌దిగా సాగినా గ్యాంగ్ స్ట‌ర్ సినిమాల‌ని ఇష్ట‌ప‌డే ప్రేక్ష‌కుల్ని మెప్పించే సినిమా ఇది. ఒక్క ముక్క‌లో చెప్పాలంటే మాలిక్.. ఫ‌హ‌ద్ ఫాజిల్‌.. మ‌హేష్ నారాయ‌ణ‌న్ ల క‌ల‌యిక‌లో వ‌చ్చిన ఓ మ్యాజిక్ అని చెప్పొచ్చు.