మినీ రివ్యూ: 'బట్టల రామస్వామి బయోపిక్కు'

Fri May 14 2021 15:04:02 GMT+0530 (IST)

Mini Review Battala Ramaswamy Biopic

థియేటర్స్ క్లోజ్ అవడంతో చిన్న సినిమాలకు డిజిటల్ వేదికలు ప్రత్యామ్నాయ మార్గాలుగా మారాయి. ఇప్పటికే చాలా సినిమాలు డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో రిలీజ్ అవ్వగా.. లేటెస్టుగా 'రాధే' వంటి భారీ సినిమా కూడా ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లోనే వచ్చింది. ఈ క్రమంలో తాజాగా (మే 14) జీ5 ఓటీటీలో ''బట్టల రామస్వామి బయోపిక్కు'' అనే కామెడీ ఎంటర్ టైనర్ విడుదల అయింది. నూతన నటీనటులతో రామ్ నారాయణ్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది. మ్యాంగో మీడియా సమర్పణలో సెవన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ కుమార్ - రామ కృష్ణ వీరపనేని ఈ చిత్రాన్ని నిర్మించారు. 'తీసేవాడు ఉండాలే కానీ ప్రతివాడి బతుకూ ఒక బయోపిక్కే' అంటూ ట్రైలర్ తోనే ఆసక్తిని కలిగించిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం మెప్పించిందో చూద్దాం!కథ విషయానికి వస్తే.. రామస్వామికి జీవితంలో రెండు లక్ష్యాలు ఉంటాయి. అవేంటంటే శ్రీరాముడిలా ఒక్కరిని మాత్రమే పెళ్లి చేసుకోవాలి.. చీరల వ్యాపారం బాగా చేయాలి. పూసలు అమ్ముకునే జయప్రద (శాంతి రావు)ను రామస్వామి (అల్తాఫ్ హుస్సేన్) తొలి చూపులోనే ఇష్టపడి ప్రేమలో పడుతాడు. గ్రామ పెద్దలను ఒప్పించి జయప్రదను రామస్వామి కులాంతర వివాహం చేసుకొంటాడు. అలానే బట్టల వ్యాపారం కొనసాగిస్తుంటాడు. ఇలా అతను కోరుకున్నట్లే జరుగుతుందని అనుకుంటుండగా.. అనుకోని పరిస్థితుల్లో జయప్రద చెల్లెలు జయసుధ (లావణ్య రెడ్డి)ను కూడా రామస్వామి పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఈ క్రమంలో పక్క గ్రామానికి చెందిన మరో యువతి శ్రీదేవి (సాత్వికా జయ్)ని రామస్వామి బలవంతంగా పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కరిని పెళ్లి చేసుకోవాలనుకున్న రామస్వామి ముగ్గుర్ని ఎందుకు పెళ్లి చేసుకున్నాడు? ఆ తర్వాత ఏమైంది? అనేది 'బట్టల రామస్వామి బయోపిక్కు'.

గ్రామీణ నేపథ్యంతో తెలుగు నేటివిటీని చూపిస్తూ గతంలో అనేక సినిమాలు వచ్చాయి. ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కామెడీని జోడిస్తూ దర్శకుడు ఈ కథ నడిపించాడు. 35-40 ఏళ్ల క్రితం చెప్పాల్సిన పాయింట్ తీసుకొని దాన్ని పూర్తిగా వినోదాత్మక చిత్రంగా మలిచే ప్రయత్నం చేశారు. కాకపోతే అందులో తడబాటుకు గురైనట్టు అనిపిస్తుంది. ఇలాంటి కథలకు తగినంత కామెడీ కలిస్తేనే ప్రేక్షకులను ఆకట్టుకోగలదు. ఆ విషయంలో మేకర్స్ ఫెయిల్ అయ్యారు. అలానే రొమాంటిక్ మూవీగా మార్చుకొనే అవకాశం ఉన్నప్పటికీ.. దర్శకుడు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. రామస్వామికి లేడీస్ ఎందుకు అట్రాక్ట్ అవుతారనే దానికి వివరణ ఇవ్వలేదు. నిడివి కూడా ఈ సినిమాకు మైనస్ గా మారింది.

అయితే గ్రామీణ వాతావరణాన్ని చూపించిన సినిమాటోగ్రాఫర్ పీఎస్‌కే మణి.. రాంనారాయణ్ అందించిన సంగీతం పర్వాలేదనిపించాయి. అలానే కొత్త వారైనప్పటికీ నటీనటులు కూడా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ముగ్గురు భార్యల మధ్య నలిగి పోయిన భర్తగా బట్టల రామస్వామిగా అల్తాఫ్ హుస్పేన్ మెప్పించాడు. భద్రం తనదైన శైలిలో కామెడీని పండించారు. మిగతా వారు కూడా తమ పాత్రల పరిధి మేరకు నటించారు. మొత్తం మీద దర్శకుడు రామ్ నారాయణన్ పాత కథాంశం తీసుకొని కొత్త నటీనటులతో చెప్పిన 'బట్టల రామస్వామి బయోపిక్కు' ఆశించిన స్థాయిలో ఆడియన్స్ ని ఆకట్టుకోవడం లేదని తెలుస్తోంది.