Begin typing your search above and press return to search.

మొత్తం సినిమా లీక్‌.. రాత్రికి రాత్రే రిలీజ్‌ తప్పలేదు

By:  Tupaki Desk   |   27 July 2021 6:22 AM GMT
మొత్తం సినిమా లీక్‌.. రాత్రికి రాత్రే రిలీజ్‌ తప్పలేదు
X
ఒకప్పుడు సినిమా విడుదల అయిన కొన్ని రోజుల తర్వాత పైరసీ వచ్చేది. ఆ పైరసీ వల్ల నిర్మాతలు ఎంతగా నష్టపోయారో.. పోతున్నారో అందరికి తెల్సిందే. పైరసీ టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది పెరుగుతూనే వచ్చింది. అప్పట్లో పైరసీకి రోజులు పడితే ఆ తర్వాత విడుదల అయిన మొదటి లేదా రెండవ రోజుకు పైరసీ చేసి డీవీడీలు విడుదల చేసేవారు. ఇప్పుడు సినిమా విడుదల అయిన కొన్ని గంటల్లోనే పైరసీ ని విడుదల చేస్తున్నారు. ఓటీటీల ద్వారా స్ట్రీమింగ్ అవుతున్న కొత్త సినిమాలను ఇలా పెట్టగానే అలా పైరసీ చేస్తున్నారు. పైరసీని ఏం చేయలేక చేష్టలు ఉడిగి ఫిల్మ్‌ మేకర్స్ కూర్చున్నారు. ఇలాంటి సమయంలో సినిమా విడుదలకు ముందే లీక్‌ అయ్యి పైరసీగా ఆన్ లైన్ లో రావడం కూడా అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది.

బాలీవుడ్‌ మూవీ 'మిమి' ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ లో ఈనెల 30వ తారీకున స్ట్రీమింగ్ అవ్వాల్సి ఉంది. ప్రస్తుతం ప్రమోషన్‌ వర్క్‌ జరుపుతున్నారు. ఈ సమయంలో సినిమా ఫుల్‌ హెచ్‌ డీ కాపీ ఆన్ లైన్ లో ప్రత్యక్షం అయ్యింది. విషయం తెలిసిన వెంటనే ఆన్ లైన్ లో సినిమాను తొలగించేందుకు ప్రయత్నించినా కూడా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగి పోయింది. వందల కొద్ది డౌన్‌ లోడ్‌ లు అయ్యాయి అని గుర్తించిన నెట్‌ ఫ్లిక్స్ వారు సినిమాను వెంటనే స్ట్రీమింగ్‌ చేశారు.

ఈనెల 30వ తారీకున స్ట్రీమింగ్‌ కావాల్సిన మిమి సినిమాను సోమవారం రాత్రి సమయంలో స్ట్రీమింగ్‌ మొదలు పెట్టారు. హఠాత్తుగా స్ట్రీమింగ్‌ చేయడంతో పబ్లిసిటీ చేయలేక పోయామని యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇక సినిమా లీక్ కు చిత్ర యూనిట్‌ సభ్యుల్లో ఎవరైనా కారణం అయ్యి ఉండవచ్చు లేదంటే నెట్‌ ఫ్లిక్స్ బృందంలో ఎవరైనా ఈ పని చేసి ఉండవచ్చు అంటున్నారు. సినిమా ఫస్ట్‌ కాపీ ఎవరి చేతిలో ఉంది అనేది తెలుసుకోవడం పెద్ద కష్టం ఏమీ కాదు. లీక్ కు పాల్పడింది ఎవరు అనే విషయాన్ని గుర్తించే పనులు జరుగుతున్నాయట. కృతి సనన్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా లో పంకజ్ త్రిపాఠి ముఖ్య పాత్రలో నటించారు.

సరోగస్సీ కాన్సెప్ట్‌ తో రూపొందిన ఈ సినిమా అధికారికంగా నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ అవుతున్న నేపథ్యంలో పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. సినిమా లీక్ పై ఇండస్ట్రీ వర్గాల వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితి మళ్లీ ముందు ముందు ఏ సినిమాకు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. సినిమాను నిర్మాతలు ముందుగానే నెట్‌ ఫ్లిక్స్ వారితో ఒప్పందం కుదిరింది కనుక ఇబ్బంది లేదు. అదే థియేటర్లలో విడుదల అయ్యేది ఉంటే మాత్రం ఇప్పటికిప్పుడు విడుదల సాధ్యం అయ్యేది కాదు. థియేటర్లలో సినిమా విడుదల అయ్యేప్పటికి జరగాల్సిన నష్టం జరిగేది. ఓటీటీ రిలీజ్ వల్ల ఇదో ప్రయోజనం అంటూ నిపుణులు చెబుతున్నారు.