Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూః మిమి

By:  Tupaki Desk   |   28 July 2021 9:20 AM GMT
మూవీ రివ్యూః మిమి
X
మూవీ రివ్యూః మిమి

నటీనటులుః కృతిస‌న‌న్‌, పంక‌జ్ త్రిపాటి, సాయి త‌మంక‌ర్‌, మ‌నోజ్ ప‌వా, త‌దిత‌రులు
నిర్మాణంః దినేశ్ విజాన్‌, జియో స్టూడియోస్‌
సంగీతంః ఏఆర్ రెహ‌మాన్‌
దర్శకత్వంః ల‌క్ష్మ‌ణ్ ఉత్క‌ర్‌
రిలీజ్ః నెట్ ఫ్లిక్స్

మ‌హిళ జీవితం త‌ల్లిగా మారితేనే ప‌రిపూర్ణం అవుతుంద‌ని అంటారు. అందుకే.. ప్ర‌తీ స్త్రీ బిడ్డ‌ను క‌నాల‌ని, అమ్మా అని పిలిపించుకోవాల‌ని ఆశ‌ప‌డుతుంది. కానీ.. కొన్ని కార‌ణాల వ‌ల్ల కొంద‌రికి ఆ భాగ్యం ద‌క్క‌దు. అలాంటి వారు పిల్ల‌ల‌ను పెంచుకోవ‌డం ద్వారా త‌మ కోరిక తీర్చుకునేవారు పాత కాలంలో. కానీ.. ఇప్పుడు మ‌రో మార్గాన్ని ఎంచుకుంటున్నారు. అదే స‌రోగ‌సి. త‌మ బిడ్డ‌ను వేరొక మ‌హిళ గ‌ర్భంలో పెంచే ఈ విధానం ఇప్పుడిప్పుడే అంద‌రికీ తెలుస్తోంది. అయితే.. పెళ్లైన మ‌హిళ‌ను స‌రోగ‌సికి ఎంపిక చేసుకుంటే ఒక విధంగా స‌ర్ది చెప్పుకోవ‌చ్చు. కానీ.. పెళ్లికాని యువ‌తిని ఎంచుకోవ‌డ‌మే ‘మి మి’ చిత్రంలో కీలకం. మరి, ఈ క‌థ ఎలా మొద‌లై.. ఏ తీరం చేరింద‌న్న‌ది చూద్దాం...

క‌థః

మిమి రాథోడ్ (కృతి స‌న‌న్‌) రాజ‌స్థాన్ లోని ఓ గ్రామంలో నివ‌సించే యువ‌తి. ఆమె ఉండేది ప‌ల్లె టూరిలోనే అయినా.. ఆమె ఆశ‌లు ఆకాశంలో ఉండేవి. డ్యాన్స‌ర్ అయిన‌ ఆమె.. న‌టిగా ఎద‌గాల‌ని, త‌న‌ను నిరూపించుకోవాల‌ని ఆరాట‌ప‌డేది. ఈ క్ర‌మంలోనే.. అమెరికాకు చెందిన ఇద్ద‌రు దంప‌తులు స‌రోగ‌సి ద్వారా బిడ్డ‌ను క‌నేందుకు చూస్తుంటారు. ఈ విష‌యం డ్రైవ‌ర్ గా ప‌నిచేసే భాను ప్ర‌తాప్ పాండే (పంక‌జ్ త్రిపాఠి)కి తెలుస్తుంది. స‌రోగ‌సి ద్వారా బిడ్డ‌ను క‌నిస్తే.. అందుకు ప్ర‌తిఫ‌లంగా అడిగినంత డ‌బ్బు ఇస్తామంటారు. దీంతో.. వాళ్ల‌ను మిమి వ‌ద్ద‌కు తీసుకెళ్తాడు పాండే. మొద‌ట ఈ ప్ర‌తిపాద‌న‌ను తిర‌స్క‌రించిన మిమి.. త‌న ఆర్థిక ప‌రిస్థితి, అవ‌స‌రాల‌ను గుర్తు తెచ్చుకొని చివ‌ర‌కు అంగీక‌రిస్తుంది. మొత్తంగా 20 ల‌క్ష‌ల‌కు బేరం కుదురుతుంది. అంతా ఓకే అయిపోతుంది. స‌రోగ‌సి ద్వారా మిమి క‌డుపులో బిడ్డ పెరుగుతూ ఉంటుంది. ఈ స‌మ‌యంలోనే ఊహించ‌ని షాక్ ఇస్తారు అమెరికా దంప‌తులు. ఆ బిడ్డ త‌మ‌కు అవ‌స‌రం లేద‌ని అంటారు. దీంతో.. మిమి మైండ్ బ్లాంక్ అయిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని కండీష‌న్లో ఉండిపోతుంది. ఆ త‌ర్వాత ఏం జ‌రిగింది? మిమి బిడ్డను కన్నదా? ఆ బిడ్డ‌ను త‌ర్వాత ఏం చేసింది? అన్న‌ది మిగిలిన క‌థ‌.

విశ్లేష‌ణః

మూస ధోర‌ణి సినిమాలు ఒక‌టీ రెండు వ‌స్తున్నా.. ప్ర‌యోగాత్మ‌క చిత్రాలకు కొద‌వ‌లేదు బాలీవుడ్ లో. మిమి కూడా ఆ కోవ‌లోనిదే. అయితే.. స‌రోగ‌సి ఆధారంగా ఇప్ప‌టి వ‌ర‌కు చాలా సినిమాలు వ‌చ్చాయి. కానీ.. ఇది వాటిక‌న్నా కాస్త‌ భిన్న‌మైన‌ది. ఎంత అద్దె గ‌ర్భం అని చెప్పుకున్నా.. బిడ్డకు జ‌న్మ‌నిచ్చిన త‌ర్వాత త‌ల్లి మ‌న‌సు మారిపోతుంది. ఆ బిడ్డ‌ను వేరేవాళ్ల‌కు అప్ప‌గించేందుకు అంగీక‌రించ‌దు. ఇలాంటి భావోద్వేగంతో కూడిన క‌థ‌కు కామెడీ ట‌చ్ ఇచ్చాడు ద‌ర్శ‌కుడు ల‌క్ష్మ‌ణ్ ఉత్క‌ర్. కామెడీని త‌న‌దైన శైలిలో పండించే ల‌క్ష్మ‌ణ్‌.. ఈ చిత్రంలోనూ త‌న మార్కు చూపించాడు. మొద‌టి భాగంలో హాస్యాన్ని జోడించిన ద‌ర్శ‌కుడు.. ద్వితీయార్థంలో సీరియ‌స్ గా భావోద్వేగాల‌ను పండించ‌డంపై దృష్టి సారించాడు. పాత్ర‌ల‌ను ప‌రిచ‌య‌డం చేయ‌డం.. ప్రేక్ష‌కుడిని క‌థ‌లోకి తీసుకెళ్ల‌డానికి మొద‌టి ప‌దిహేను నిమిషాల స‌మ‌యం తీసుకుని.. ఆ త‌ర్వాత క‌థ‌లో లీనం చేసే ప్ర‌య‌త్నం చేశాడు. బిడ్డను కనేందుకు అంగీకారం తెలిపే వరకూ ఒక ఫ్లోలో సాగిపోయిన చిత్రం.. అమెరికా దంప‌తులు త‌మ‌ నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత ఒక్కసారిగా టర్న్ తీసుకుంటుంది. త‌న క‌డుపులో పెరిగే బిడ్డ భ‌విష్య‌త్ ఏంటీ? త‌న ప‌రిస్థితి ఏంట‌ని త‌లుచుకుంటూ మిమి ప‌డే ఆవేద‌న‌ను చ‌క్క‌గా క‌ళ్ల‌కు క‌ట్టాడు ద‌ర్శ‌కుడు. చివ‌రి వ‌ర‌కు అదే ఎమోష‌న్ ను కొన‌సాగించాడు. మొత్తంగా ఒక ఎమోష‌న‌ల్ డ్రామాను పండించాడు.

పెర్ఫార్మెన్స్ః

పెళ్లి కాకుండానే బిడ్డ‌కు జ‌న్మ‌నివ్వ‌డం అనేది భార‌త్ వంటి సంప్ర‌దాయ దేశాల్లో సామాజిక నేరంగా ప‌రిగ‌ణిస్తారు. అలాంటి ప‌రిస్థిని ఎదుర్కొనే మిమి పాత్ర‌లో అద్భుతంగా న‌టించింది కృతిస‌న‌న్‌. ఫ‌స్ట్ హాఫ్ లో చ‌లాకీ పిల్ల‌గా ఆక‌ట్టుకున్న కృతి.. అమెరికా దంప‌తులు బిడ్డ‌ను వ‌ద్ద‌ని చెప్పిన త‌ర్వాత ప‌డే వేద‌న‌, భ‌విష్య‌త్ పై ఆందోళ‌నను అద్భుతంగా ప‌లికించింది. ఈ సినిమా ఆమె కెరీర్ లో ఓ ట్రేడ్ మార్క్ గా మిగిలిపోతుంద‌ని చెప్పొచ్చు. లేడీ ఓరియంటెడ్ చిత్రాల‌ను ప్లాన్ చేస్తే.. ఇక‌పై కృతిస‌న‌న్ ను కూడా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటార‌ని చెప్ప‌డంలో అతిశ‌యోక్తి లేదు. ఇక డ్రైవ‌ర్ గా పంక‌జ్ త్రిపాఠి త‌న‌దైన శైలిలో అల‌రించారు. కృతితో స‌మానంగా సినిమాను మోశార‌ని చెప్పాలి. మిగిలిన న‌టీన‌టులు సాయి త‌మంక‌ర్‌, మ‌నోజ్ ప‌వా, త‌మ పాత్ర‌ల‌కు న్యాయం చేశారు. ఇక‌, ప్ర‌ధానంగా చెప్పుకోవాల్సిన మ‌రో అంశం మ్యూజిక్‌. భావోద్వేగాల‌ను పండించ‌డానికి న‌టులు ఎంత‌గా ప్ర‌య‌త్నించారు.. వాటికి ధీటుగా త‌న‌దైన బ్యాగ్రౌండ్ స్కోర్ తో ద‌న్నుగా నిలిచారు ఏఆర్ రెహ‌మాన్‌. క‌త్తెర‌కు కాస్త ప‌నిపెడితే బాగుండేద‌ని అనిపిస్తుంది.

బ‌లంః కృతిస‌న‌న్, పంకజ్ తివారీ, బ్యాగ్రౌండ్‌ మ్యూజిక్‌

బ‌ల‌హీన‌తః స్లో నెరేష‌న్‌, ఎడిటింగ్‌

లాస్ట్ లైన్ః మ‌నుసును మెలిపెట్టే ‘మి మి’

రేటింగ్ః 2.75/5