Begin typing your search above and press return to search.

మూవీ రివ్యూ: 'మిడిల్ క్లాస్ మెలొడీస్'

By:  Tupaki Desk   |   20 Nov 2020 8:06 AM GMT
మూవీ రివ్యూ: మిడిల్ క్లాస్ మెలొడీస్
X
చిత్రం : ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’

నటీనటులు: ఆనంద్ దేవరకొండ - వర్షా బొల్లమ్మ త‌దిత‌రులు
సంగీతం: స్వీకార్ అగస్తి
నేపథ్య సంగీతం: ఆర్.హెచ్.విక్రమ్
ఛాయాగ్రహణం: సన్నీ కూరపాటి
నిర్మాత: ఆనంద్ ప్రసాద్
రచన: జనార్దన్ పసుమర్తి
దర్శకత్వం: వినోద్ అనంతోజు

చడీచప్పుడు లేకుండా షూటింగ్ పూర్తి చేసుకుని.. అమేజాన్ ప్రైంలో విడుదలకు సిద్ధమైపోయిన చిన్న సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ, ‘జాను’ ఫేమ్ వర్ష బొల్లమ్మ జంటగా నటించిన ఈ చిత్రం ప్రోమోలతో జనాల దృష్టిని బాగానే ఆకర్షించింది. మరి సినిమాగా ఎలాంటి అనుభూతిని కలిగించేలా ఉందో తెలుసుకుందాం పదండి.

కథ:

రాఘవ (ఆనంద్ దేవరకొండ) గుంటూరు జిల్లాలోని ఓ పల్లెటూరిలో హోటల్ నడిపే కుటుంబంలోని కుర్రాడు. అతడికి గుంటూరులో హోటల్ పెట్టి తనేంటో రుజువు చేసుకోవాలని కోరిక. అనేక అడ్డంకుల్ని దాటి గుంటూరులో టిఫిన్ సెంటర్ అయితే పెడతాడు కానీ అది అనుుకన్నంతగా విజయవంతం కాదు. మరోవైపు అతను ప్రేమించిన మరదలికి వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయం అవుతుంది. ఓవైపు ఎంత ప్రయత్నం చేసినా టిఫిన్ సెంటర్ సరిగా నడవక.. మరోవైపు ప్రేమించిన అమ్మాయిని దక్కించుకోలేక వేదనకు గురవుతాడు రాఘవ. ఆ క్లిష్ట పరిస్థితుల నుంచి అతను ఎలా బయటపడి టిఫిన్ సెంటర్ని సక్సెస్ చేశాడు.. ప్రేమించిన అమ్మాయిని సొంతం చేసుకున్నాడు అన్నది మిగతా కథ.

కథనం-విశ్లేషణ:

తెలుగు సినిమా హీరో అనుకున్నాడంటే చాలు.. ఏదైనా ఇట్టే జరిగిపోవాలి. చేతిలో చిల్లిగవ్వ లేకుండా వ్యాపారం మొదలు పెట్టినా సరే.. కొన్ని రోజులు తిరిగేసరికి ఇంతింతై అన్నట్లు ఎదిగిపోవాలి. హీరో చూస్తుండగానే కోటీశ్వరుడైపోవాలి. ఐతే ఇలా నేల విడిచి సాము చేసే కథలకు కాలం చెల్లిందని ఈ తరం రచయితలు, దర్శకులు గుర్తిస్తున్నారు. మన చుట్టూ ఉండే మనుషుల కథల్ని వాస్తవికంగా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కోవలో వచ్చిన కొత్త సినిమానే ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’. ఒక కుర్రాడు సిటీకెళ్లి టిఫిన్ సెంటర్ పెట్టడానికి పడే కష్టాలు.. పెట్టాక దాన్ని విజయవంతం చేయడానికి పడే అవస్థల నేపథ్యంలో ఒక సినిమా తెరకెక్కించడం అంటే అనుకున్నంత సులువైన విషయం కాదు. ఐతే ఈ కథను మెజారిటీ ప్రేక్షకులు రిలేట్ చేసుకునేలా సిన్సియర్ గా చెప్పే ప్రయత్నమే చేశారు రచయిత.. దర్శకుడు. ఐతే ఒక మంచి సినిమాగా తయారవడానికి తగ్గ సెటప్ అంతా కుదిరాక.. అప్పటిదాకా పరుగులు పెట్టిన కథనానికి ఉన్నట్లుండి బ్రేకులు పడిపోవడం.. అవసరం లేని సాగతీత.. పునరావృతం అయ్యే సన్నివేశాలు ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ స్థాయిని తగ్గించేస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే బాగుంది అనిపిస్తూనే.. ఇంకా బాగుండాల్సింది అనిపించే సినిమా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’.

ఏదో సినిమా చూస్తున్నట్లు కాకుండా నిజంగా గుంటూరు ప్రాంతానికెళ్లి అక్కడి మనుషుల్ని దగ్గరగా చూస్తూ వాళ్ల కథలు వింటున్న భావన కలిగించడం ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ ప్రత్యేకత. సినిమా ఆరంభమై కొంత సమయం గడిచేసరికే ఇందులోని ఒరిజినాలిటీ ఏంటో తెలుస్తుంది. అక్కడి మనుషుల్ని, పరిస్థితుల్ని చాలా దగ్గరగా చూసిన అనుభవంతో ఈ సినిమా తీశారని అత్యంత సహజంగా సాగే తొలి సన్నివేశం.. ఆ తర్వాత టైటిల్స్ పడేటపుడు కథకు రిలేట్ చేస్తూ గుంటూరులో ఫేమస్ ఫుడ్స్ అన్నింటినీ చూపిస్తూ సాగే పాటను బట్టి అర్థమవుతుంది. సినిమాలో ఎవరూ పేరున్న ఆర్టిస్టులు లేకపోయినా.. ఆయా పాత్రల్లోని ప్రత్యేకత వల్ల, ఆర్టిస్టుల పెర్ఫామెన్స్ వల్ల చాలా త్వరగా అలవాటు పడిపోయి వాటితో కలిసి ట్రావెల్ చేస్తాం. ముఖ్యంగా హీరో తండ్రి పాత్ర అయితే నేరుగా హృదయాల్లోకి చొచ్చుకెళ్లిపోతుంది. ఈ పాత్ర కనిపించిన ప్రతిసారీ అలెర్టయి స్క్రీన్ వైపు చూసేలా చేస్తుందంటే అతిశయోక్తి కాదు.అంత బాగా దాన్ని డిజైన్ చేశారు. ఆ పాత్ర చేసిన గోపరాజు రమణ కూడా అంత బాగా నటించాడు. మిగతా పాత్రలూ అలాగే ప్రత్యేకతను చాటుకున్నాయి. ఆర్టిస్టులు వాటికి జీవం పోశారు.

హీరో లక్ష్యం ఏంటన్నది ఆరంభంలోనే తెలిశాక.. ఆ లక్ష్యాన్ని నెరవేర్చుకోవడమే క్లైమాక్స్ అనే విషయం ముందే అర్థమైపోతుంది. చివరికి హీరో గెలుస్తాడన్నది తెలిసిన విషయమే. ఐతే ఆ లోపు అతడికి ఎదురయ్యే సవాళ్లు.. దాని చుట్టూ డ్రామాను నడిపిస్తూ రెండు గంటల పాటు కాలక్షేపం చేయించడం అంత తేలిక కాదు. ఈ విషయంలో ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ రచయిత, దర్శకుడు చాలా వరకు విజయవంతం అయ్యారు. హీరో హోటల్ మొదలుపెట్టడానికి ముందు వరకు కథనం పరుగులు పెట్టేలా ఆసక్తికర సన్నివేశాలు రాసుకుని.. వాటిని చక్కగా ప్రెజెంట్ చేశారు. హీరో హీరోయిన్ల ప్రేమకథను మరీ సింపుల్ గా తేల్చేయడం, అందులో స్పష్టత కొరవడటం ప్రతికూలతలే అయినా మిగతా ఎపిసోడ్లన్నీ బాగా పండటంతో ప్రథమార్ధంలో సినిమా వేగంగా సాగిపోతుంది. ఐతే ద్వితీయార్ధంలో మాత్రం కథను ముందుకు నడిపించడంలో తడబాటు కనిపిస్తుంది.

హీరో ఈజీగా గెలిచేస్తే మజా ఏముంటుందని.. ఆ దశ రావడానికి ముందు కష్టాలన్నీ చుట్టుముట్టేలా సన్నివేశాలు రాసుకున్నారు. కానీ ఇవి మరీ సాధారణంగా ఉండటం.. ఎంతకీ వ్యవహారం తేలకపోవడం.. మరీ నెమ్మదిగా సన్నివేశాలు నడవడంతో ఒక దశ దాటాక విసుగు పుడుతుంది. ఫ్రెండు ప్రేమకథలో ఉన్నంత ఆసక్తి హీరో లవ్ స్టోరీలో లేకపోవడం కూడా బలహీనతే. ఇక హీరో కథ మలుపు తిరిగే ఆ సన్నివేశం ఏదో వచ్చేస్తే చాలని ఎదురు చూసే పరిస్థితి వస్తుంది. హీరో సులువుగా పరిష్కరించుకోవాల్సిన విషయాల్ని ఊరికినే సాగదీసిన భావన కలుగుతుంది. చివరికి ఈ మాత్రం దానికా ఇంత సేపు ఆగారు అనిపించేలా కథ మలుపు తిరిగే సన్నివేశాన్ని సింపుల్ గా తేల్చేశారు. ఐతే పతాక సన్నివేశాలకు వచ్చేసరికి ఉన్నట్లుండి హడావుడి మొదలై.. సందడి కనిపిస్తుంది. సరదాగా సాగే ఆ సన్నివేశాలు ప్రేక్షకుల్లో కొంత హుషారు పుట్టిస్తాయి. ముగింపు ఆకట్టుకుంటుంది. ఐతే మిడిల్ పోర్షన్లను ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుని ఉంటే... మలుపులు కొంచెం పెద్ద స్థాయిలో ఉండి ఉంటే.. ప్రథమార్ధంలో ఉన్న వేగం ద్వితీయార్ధంలోనూ కొనసాగి ఉంటే ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ రేంజ్ వేరుగా ఉండేది. అయినా సరే.. ఫార్ములా సినిమాల మధ్య వైవిధ్యం కోరుకుంటే.. రియలిస్టిగ్గా సాగే ఒక కామన్ మ్యాన్ స్టోరీని చూడాలనుకుంటే ఈ సినిమా మంచి ఛాయిసే.

నటీనటులు:

తొలి సినిమా ‘దొరసాని’లో మరీ సాధారణంగా కనిపించిన ఆనంద్ దేవరకొండ రెండో సినిమాతో మెరుగయ్యాడు. ఇందులోనూ కొన్ని లోపాలు కనిపించినప్పటికీ మధ్య తరగతి కుర్రాడి పాత్రకు సరిపోయాడు. అతడి లుక్స్ ఈ పాత్రకు సూటయ్యాయి. నటన పర్వాలేదు. ఎమోషనల్ సీన్స్ లో ఇంకా మెరుగవ్వాల్సిందనిపిస్తుంది. ఐతే మరీ ఎబ్బెట్టుగా అయితే కనిపించలేదతను. గుంటూరు కుర్రాడిగా అతడి డిక్షన్ మాత్రం బాగా లేదు. అక్కడక్కడా తెలంగాణ యాస తెలియకుండానే వచ్చేసి డామినేట్ చేసింది. డిక్షన్ విషయంలో తన అన్నను అతను ఇమిటేట్ చేస్తున్నట్లు అనిపిస్తుంది. వర్ష బొల్లమ్మ హీరోయిన్ లాగా కాకుండా ఒక మామూలు అమ్మాయిలా కనిపించి తన పాత్రను పండించింది. ఆమె హావభావాలు ఆకట్టుకుంటాయి. హీరో ఫ్రెండుగా చేసిన చైతన్య.. అతడికి జోడీగా నటించిన దివ్య శ్రీపాద ఆకట్టుకున్నారు. సినిమాలో మొత్తంగా హైలైట్ పెర్ఫామెన్స్ అంటే మాత్రం హీరో తండ్రి పాత్రలో చేసిన గోపరాజు రమణదే. గుంటూరు చెందిన మధ్య తరగతి మనుషులకు ప్రతిబింబంలా కనిపిస్తాడాయన. హావభావాలు, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా అదిరిపోయాయి. హీరో తల్లిగా నటించిన నటి కూడా సహజంగా బాగా చేసింది. హీరోయిన్ తండ్రి పాత్రలో చేసిన ప్రేమ్ కుమార్ కూడా ఆకట్టుకున్నాడు. మిగతా ఆర్టిస్టులూ ఓకే. తరుణ్ భాస్కర్ చిన్న గెస్ట్ రోల్ లో మెరిశాడు.

సాంకేతిక వర్గం:

చిన్న సినిమానే కానీ సాంకేతికంగా ‘మిడిల్ క్లాస్ మెలొడీస్’ మంచి స్థాయిలో నిలిచేదే. స్వీకార్ అగస్తి పాటలు.. విక్రమ్ నేపథ్య సంగీతం.. రెండూ ఆకట్టుకుంటాయి. రెండూ ఒక పాజిటివ్ ఫీలింగ్ తీసుకొస్తాయి. సన్నీ కూరపాటి ఛాయాగ్రహణం కూడా ప్రత్యేకంగా అనిపిస్తుంది. గుంటూరు ప్రాంతాన్ని తెరపైకి తీసుకొచ్చిన తీరు మెప్పిస్తుంది. నిర్మాణ విలువలు బాగున్నాయి. రచయిత జనార్దన్ పసుమర్తి పనితనం సినిమాలో చాలా చోట్ల తెలుస్తుంది. చాలా సింపుల్ గా అనిపించే కథను ఆసక్తికర రీతిలో చెప్పే ప్రయత్నం చేశాడు. రచయిత సెన్సాఫ్ హ్యూమర్ చాలా సన్నివేశాల్లో అర్థమవుతుంది. దర్శకుడు వినోద్ అనంతోజు ఈ కథను ఆహ్లాదకరంగా ప్రెజెంట్ చేశాడు. అతడి అభిరుచి కూడా సినిమా ఆరంభం నుంచి కనిపిస్తూనే ఉంటుంది. ద్వితీయార్ధంలో ఓ అరగంట మీద ఇంకాస్త దృష్టిపెట్టి ఉంటే.. కథనాన్ని ఇంకా ఆసక్తికరంగా తీర్చిదిద్దుకుని ఉంటే రచయిత, దర్శకులకు ఇంకా మంచి మార్కులు పడేవి.

చివరగా: మిడిల్ క్లాస్ మెలొడీస్.. కొంచెం ఇష్టం కొంచెం కష్టం

రేటింగ్-2.75/5


Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre