'మేరా నామ్ వాస్కోడిగామా' సాంగ్: పూరీ లిరిక్స్.. పూరీ తనయుడి వాయిస్..!

Fri Oct 22 2021 21:52:25 GMT+0530 (IST)

Mera Naam Vasco De Gama Song From Romantic Movie

అగ్ర దర్శకుడు పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన తాజా చిత్రం ''రొమాంటిక్''. పూరీ శిష్యుడు అనిల్ పాదూరి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ - స్క్రీన్ ప్లే - మాటలు పూరీ అందించారు. ఇందులో ఆకాశ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. యూత్ ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాని అనేక వాయిదాల అనంతరం ఫైనల్ గా అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ ముమ్మరం చేసిన 'రొమాంటిక్' టీమ్.. రెగ్యులర్ అప్డేట్స్ తో సినిమాపై బజ్ క్రియట్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ - సాంగ్స్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. రీసెంటుగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చేతుల మీదుగా రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా 'మేరా నామ్ వాస్కోడిగామా' అనే మరో పాట లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ విడుదల చేసింది.

పూరీ జగన్నాథ్ ఈ పాటకు లిరిక్స్ రాయగా.. పూరి ఆకాష్ స్వయంగా ఆలపించడం విశేషం. సునీల్ కశ్యప్ దీనికి ట్యూన్ కంపోజ్ చేశారు. 'మేరా నామ్ వాస్కోడిగామా.. వాస్కోడిగామా ఆల్బర్తో.. లోగ్ ముజే బచ్చా బోల్తా హై.. లేకిన్ ఏక్ దిన్ బచ్చా సబ్ కా బాప్ బనేగా..' అంటూ ఆకాష్ చెప్పడంతో ఈ సాంగ్ ప్రారంభమైంది. 'పడుకుంటే మనకు కల రావాలి.. ఆ కల మనల్ని భయపెట్టాలి.. ఆ కల కోసం చావాలి' 'ఈ ప్రపంచమే ఒక అడవి.. అన్నీ జంతువులే.. నేనూ ఒక జంతువునే.. అడవిలో ఎలాంటి రూల్స్ ఉండవు.. అడవిలో నక్కలు ఎక్కువగా ఉన్నాయి.. అదొక్కటే నచ్చట్లా.. చంపేస్తారా సాలే' వంటి పూరీ తరహా మాటలను ఇందులో వినొచ్చు.

'రొమాంటిక్' సినిమాలో లవ్ కు మించి ఏదో ఉందని 'మేరా నామ్ వాస్కోడిగామా' పాట హింట్ ఇస్తోంది. మోటివేట్ చేసే లిరిక్స్ తో కూడిన ఈ పాట శ్రోతలను అలరిస్తోంది. ఈ చిత్రానికి నరేష్ రానా సినిమాటోగ్రఫీ అందించగా.. జానీ షేక్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. లావణ్య సమర్పణలో పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మరియు పూరీ కనెక్ట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. పూరి జగన్నాధ్ - ఛార్మి కౌర్ నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించగా.. మకరంద్ దేశ్ పాండే - ఉత్తేజ్ - సునయన ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.