'చావు కబురు చల్లగా' నుంచి 'కదిలే కాలాన్నడిగా' మెలోడీ సాంగ్..!

Tue Feb 23 2021 16:11:19 GMT+0530 (IST)

Melody song from 'Chavu Kaburu Challaga'

కార్తికేయ - లావణ్య త్రిపాఠి హీరో హీరోయిన్లుగా పెగళ్ళపాటి కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ''చావు కబురు చల్లగా'' సినిమా మార్చి19న ప్రేక్షకుల ముందుకు రానుంది. అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ పై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టీజర్ మరియు లిరికల్ సాంగ్స్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో తాజాగా 'కదిలే కాలాన్నడిగా' అనే మరో సాంగ్ లిరికల్ వీడియోని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.'పడవై కదిలిందే మనసే.. ఆకాశం వైపే... గొడవే పొడుతూ ఉందే.. నువ్వు కావాలనే... నువ్వు వచ్చావని నువు వచ్చావని నా ప్రాణం చెప్పిందే' అంటూ సాగిన ఈ గీతానికి డైరెక్టర్ పెగళ్ళపాటి కౌశిక్ - సనరే కలసి సాహిత్యాన్ని అందించారు. జేక్స్ బిజోయ్ స్వరాలు సమకూర్చగా.. గౌతమ్ భరద్వాజ్ - షాసా త్రిపాఠి ఆలపించారు. 'కదిలే కాలాన్నడిగా.. ఈ చోటే పరుగాపమని.. తిరిగే భూమిని అడిగా.. నీ వైపే నను లాగమని' అంటూ ఒకరినొకరు ఇష్టపడుతున్న జంట తమ మనసులోని భావాలను చెప్పుకుంటున్నట్లు ఈ పాటలో కనిపిస్తోంది. ఈ మెలోడీ సాంగ్ వీక్షకులను బాగా అలరోస్తోంది.

దీనికి కరమ్ చావ్లా సినిమాటోగ్రఫీ అందించగా.. జీఎమ్ శేఖర్ ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. సత్య ఎడిటర్ గా వ్యవహరించారు. ఇకపోతే 'చావు కబురు చల్లగా' సినిమాలో కార్తికేయ స్వర్గపురి వాహనం నడిపే 'బస్తీ బాలరాజ్' గా కనిపించనున్నాడు. అలానే లావణ్య త్రిపాఠి 'మల్లిక' అనే నర్స్ పాత్ర పోషించింది.