Begin typing your search above and press return to search.

అయిదు నెలల గ్యాప్‌ లో రెండు సినిమాలతో మెగాస్టార్‌

By:  Tupaki Desk   |   29 Sep 2020 5:30 PM GMT
అయిదు నెలల గ్యాప్‌ లో రెండు సినిమాలతో మెగాస్టార్‌
X
రాజకీయాల్లోకి వెళ్లడం వల్ల సినిమాలకు పదేళ్ల గ్యాప్‌ తీసుకున్న మెగాస్టార్‌ చిరంజీవి 2017లో ఖైదీ నెం.150 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ సినిమా తర్వాత చాలా స్పీడ్‌ గా సినిమాలు చేయాలని చిరంజీవి అనుకున్నారు. అయితే 151వ సినిమాగా సైరా నరసింహారెడ్డి చేయడంతో ఎక్కువ సమయం తీసుకున్నాడు. దాదాపు రెండేళ్ల పాటు ఆ సినిమాకు పట్టింది. సైరా తర్వాత అయినా ఏడాదికి రెండు సినిమాలు చేయాలని చిరంజీవి భావించారు. అందులో భాగంగా ఆచార్య సినిమాను కేవలం వంద రోజుల్లో పూర్తి చేసి విడుదల చేయాలని భావించారు.

కొరటాల శివ కూడా వంద రోజుల్లో పూర్తి చేస్తానంటూ ఛాలెంజ్‌ గా తీసుకుని మరీ ప్లాన్‌ చేశాడు. చకచక షూటింగ్‌ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా కరోనా వల్ల షూటింగ్‌ ఆగిపోయింది. చిరు ఆరోగ్యం ఇతరత్ర విషయాల కారణంగా సినిమాను ఈ ఏడాది చివరి వరకు ప్రారంభించే అవకాశం లేదట. వచ్చే ఏడాదిలో ఆచార్యను ఏప్రిల్‌ లో విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇదే సమయంలో ఆయన వచ్చే ఏడాది మరో సినిమాను కూడా విడుదల చేయాలని భావిస్తున్నారట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం తమిళ సూపర్‌ హిట్‌ మూవీ 'వేదాళం' ను స్పీడ్‌ గా పూర్తి చేసి వచ్చే ఏడాది దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఆచార్య సినిమా షూటింగ్‌ పూర్తి అయిన వెంటనే మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో వేదాళంను రీమేక్‌ చేయబోతున్నారు. ఆ తర్వాత లూసీఫర్‌ ను కూడా చిరంజీవి చేయనున్నట్లుగా ఇప్పటికే మీడియా వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఈ మూడు సినిమాలు చాలా తక్కువ గ్యాప్‌ తో విడుదల కాబోతున్నాయి. సాధ్యం అయినంత తక్కువ సమయంలో సినిమాలను పూర్తి చేసి విడుదల చేయాలని ఏడాదిలో రెండు మూడు సినిమాలను విడుదల చేసేలా మెగాస్టార్‌ ప్లాన్‌ చేస్తున్నారు.