దర్శకులతో మెగాస్టార్ క్రియేటివ్ డిఫరెన్సెస్?

Thu Nov 19 2020 11:15:27 GMT+0530 (IST)

Megastar Creative Differences with Directors?

ఏదైనా సినిమాని ప్రారంభించాలి అంటే తొలిగా బౌండ్ స్క్రిప్టును లాక్ చేయాల్సి ఉంటుంది. మన స్టార్ హీరోలు స్క్రిప్టు విషయంలో రాజీ అన్నదే లేకుండా పకడ్భందీగా వ్యవహరిస్తున్నారు. స్టార్ డైరెక్టర్లు అయినా స్క్రిప్టు నచ్చకపోతే నిర్మొహమాటంగా చేయలేమని చెప్పేస్తున్నారు. మొహమాటానికి పోయి ఏదీ ఖాయం చేసేయడం లేదు.ఇటీవల మహేష్ లాంటి స్టార్ హీరో వంశీ పైడిపల్లి.. సుకుమార్.. పూరి లాంటి డైరెక్టర్లను పక్కన పెట్టేసిన సంగతి తెలిసిందే. కేవలం స్క్రిప్టు పరంగా రాజీకి రాకపోవడం వల్లనే అంత పెద్ద డైరెక్టర్లను కాదనేశారు మహేష్. తదుపరి స్క్రిప్టు బావుంటే వీళ్లతో పని చేసేందుకు అతడికి ఎలాంటి అభ్యంతరం లేదు.

ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా ఇదే బాటలో పలువురు దర్శకుల్ని కాదనేయడం ఇండస్ట్రీలో ప్రధానంగా చర్చకు వచ్చింది. ఆచార్య తర్వాత వరుసగా ముగ్గురు దర్శకులతో స్క్రిప్టు విషయమై చర్చలు సాగిస్తున్న చిరు అందులో ఎవరినీ ఫైనల్ చేయకపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఇప్పటికి వేదాళం రీమేక్ కోసం మెహర్ రమేష్ ని మాత్రమే ఫైనల్ చేశారట. బాబి.. వినాయక్ వంటి దర్శకులు వినిపించిన రీమేక్ స్క్రిప్టులేవీ ఆయనను మెప్పించలేదట. దీంతో వారితో సినిమాలు ఉంటాయా లేదా? అన్న డైలమా కొనసాగుతోంది.

అయితే ఆచార్య పూర్తయ్యే లోపు ఎవరు బౌండ్ స్క్రిప్టుతో మెప్పిస్తే వారితో పని చేసేందుకు చిరుకి అభ్యంతరం ఉండకపోవచ్చు. ఇక స్క్రిప్టు విషయంలో క్రియేటివ్ డిఫరెన్సెస్ ఎప్పుడూ ఉండేవే. దర్శకరచయితలతో చర్చల్లో లోటు పాట్లపై చిరు చర్చిస్తారు. అనుభవ పూర్వక సలహాలిస్తారు. ఆ తర్వాత వాటిని సరి చేయడంలో దర్శకులు తడబడకపోతే రీమేక్ లన్నీ సెట్స్ కెళ్లే వీలుంటుంది.

మెగాస్టార్ చిరంజీవి ఈ నెల చివరిలో ఆచార్య షూటింగును తిరిగి ప్రారంభిస్తారు. ప్రస్తుతానికి వేదాలం రీమేక్ తప్ప కొత్త ప్రాజెక్టును ప్రారంభించే మానసిక స్థితిలో చిరు లేరని తాజా సన్నివేశం చెబుతోంది. బాబీతో సినిమా ఉందా లేదా?  లూసీఫర్ రీమేక్ కి వినాయక్ పని చేస్తున్నట్టా లేదా? అన్నది కొణిదెల కాంపౌండ్ ధృవీకరించాల్సి ఉంటుంది.