Begin typing your search above and press return to search.

'నారప్ప' విక్టరీ కి మెగాస్టార్ ప్రశంసలు..!

By:  Tupaki Desk   |   23 July 2021 5:45 PM GMT
నారప్ప విక్టరీ కి మెగాస్టార్ ప్రశంసలు..!
X
విక్టరీ వెంకటేష్ హీరోగా దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల తెరకెక్కించిన చిత్రం ''నారప్ప''. ఇటీవలే అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అన్ని వర్గాల వారి ప్రశంసలు అందుకుంటోంది. తమిళంలో ధనుష్ - వెట్రిమారన్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ 'అసురన్' చిత్రానికి రీమేక్ ఇది. ఒరిజినల్‌ స్టోరీ అయినా రీమేక్‌ కథ అయినా తన నటనతో మెప్పించే వెంకీ.. మరోసారి విజృంభించారని ఆడియన్స్ ర్అంటున్నారు. 'నారప్ప' పాత్రలో ఒదిగిపోయిన వెంకటేష్.. ఎమోషన్స్ - యాక్షన్ సన్నివేశాలలో ఇరగదీసాడని చెబుతున్నారు. అందరిచేత ప్రశంసలు అందుకుంటున్న వెంకీమామ పెర్ఫార్మన్స్ కు మెగాస్టార్ చిరంజీవి సైతం ఫిదా అయ్యారు.

'నారప్ప' చిత్రాన్ని చూసిన చిరంజీవి.. సోషల్ మీడియా వేదికగా ఓ ఆడియో సందేశం ద్వారా వెంకటేష్ మరియు చిత్ర బృందాన్ని ప్రశంసించారు. ''నేను ఇప్పుడే 'నారప్ప' సినిమా చూసాను. కంగ్రాచ్యులేషన్స్. వాట్ ఏ పెరఫార్మన్స్.. వాట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. నాకు ఎక్కడా వెంకటేష్ కనపడలేదు. నారప్ప మాత్రమే కనిపించాడు. టోటల్ గా కొత్త వెంకటేష్ ని చూస్తున్నాను. క్యారక్టర్ ని ఎంతగానో అర్థం చేసుకొని.. ఎంతో డెప్త్ కి వెళ్లి నటించావ్ వెంకీ. నీలో ఉండే నటుడు ఎప్పుడూ ఒక తపనతో తాపత్రయంతో ఉంటాడు. దానికి ఈ సినిమా మంచి ఉదాహరణ. నీకు మంచి సంతృప్తినిచ్చే సినిమా. వండర్ ఫుల్ టీమ్ వర్క్. 'నారప్ప' మీకు మంచి పేరుతో పాటుగా మీ కెరీర్ లో గర్వంగా చెప్పుకునే సినిమా అవుతుంది వెంకీ. మరొక్కసారి నీకు మీ టీమ్ అందరికీ కంగ్రాచ్యులేషన్స్'' అని చిరంజీవి తెలిపారు.

చిరంజీవి ఆడియో సందేశం పై వెంకటేష్ కూడా స్పందించారు. ''మీ ప్రశంసలు వినడం మాకు సంతోషకరమైన క్షణం. 'నారప్ప' చూసి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలు చిరంజీవి'' అని వెంకీ ట్వీట్ చేశారు. ఒక సీనియర్ స్టార్ హీరో పెరఫార్మన్స్ ను మరో సీనియర్ స్టార్ హీరో మెచ్చుకోవడం గొప్ప విషయమనే చెప్పాలి. కాగా, 'నారప్ప' చిత్రంలో వెంకటేష్ భార్యగా ప్రియమణి నటించింది. అభిరామి - కార్తీక్ రత్నం - రావు రమేష్ - రాజీవ్ కనకాల - రాఖీ - నరేన్ - నాజర్ - బ్రహ్మాజీ - ఝాన్సీ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. మెలోడీ బ్రహ్మ మణిశర్మ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చారు. శ్యామ్ కె.నాయుడు సినిమాటోగ్రఫీ అందించగా.. మార్తాండ్ కె.వెంకటేష్‌ ఎడిటింగ్ చేశారు. గాంధీ నడికుడికర్‌ ఆర్ట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. వి క్రియేషన్స్ మరియు సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై క‌లైపులి ఎస్.థాను - సురేష్ బాబు కలసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.